వడ్లపై రాష్ట్ర సర్కార్ తర్జనభర్జన

వడ్లపై రాష్ట్ర సర్కార్ తర్జనభర్జన
  • అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటేనే బియ్యం సేకరిస్తామన్న ఎఫ్​సీఐ 
  • చర్యలకు వెనకాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 
  • 17 రోజులుగా ఆగిపోయిన మిల్లింగ్ 
  • అధికారులతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని మిల్లుల్లో 17 రోజులుగా మిల్లింగ్ ఆగిపోవడంతో రాష్ట్ర సర్కార్ తర్జనభర్జన పడుతోంది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోకపోతే బియ్యం సేకరించబోమని ఎఫ్సీఐ తేల్చి చెప్పడంతో ఏం చేయాలనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మిల్లర్లపై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోంది. దీంతో బియ్యం సేకరణ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మిల్లర్లు మిల్లింగ్ ఆపేశారు. సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేసినా ఎఫ్ సీఐ రూల్స్ ప్రకారమే నడుచుకుంటామని తేల్చి చెప్పింది. దీంతో శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో ఆర్థిక మంత్రి హారీశ్​రావు ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్​కుమార్‌ సివిల్‌ సప్లయ్స్‌ అధికారులతో సమావేశమయ్యారు. వడ్లను ఏం చేద్దామనే దానిపై చర్చించారు. మంగళవారం వరకు ఎఫ్ సీఐ నుంచి సానుకూల స్పందన రావొచ్చని భావిస్తున్నారు. అప్పటి వరకు వేచి చూడాలని, ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

మిల్లుల్లోనే 20 వేల కోట్ల వడ్లు 

రాష్ట్రంలోని 2,470 రా రైస్ మిల్స్, 970 బాయిల్డ్ రైస్ మిల్స్​లో మిల్లింగ్‌ పూర్తిగా ఆగిపోయింది. ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. ఈ యాసంగిలో సేకరించిన 50.15 లక్షల టన్నుల వడ్లతో పాటు పోయిన వానాకాలం, నిరుటి యాసంగి వడ్ల మిల్లింగ్ కూడా పూర్తి కాలేదు. వీటన్నింటిని మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి అందించాల్సి ఉంది. నిరుడు యాసంగికి సంబంధించి 3.70 లక్షల టన్నుల బియ్యం ఇచ్చేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. పోయిన వానాకాలం బియ్యం 25 లక్షల టన్నులు, ఈ యాసంగికి సంబంధించి 33.58 లక్షల టన్నులు.. ఇలా అన్నీ కలిపి 62.28 లక్షల టన్నులకు పైగా బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. వీటి విలులు రూ.20 వేల కోట్ల వరకు ఉంటుంది. ఒకవేళ ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ పూర్తిగా నిలిపివేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వచ్చే ప్రమాదం ఉంది. 

పేరుకుపోయిన నిల్వలు... 

సివిల్ సప్లయ్స్‌ డిపార్ట్‌మెంట్‌ రేషన్‌ బియ్యం సెంట్రల్‌ పూల్‌ నుంచి లిఫ్ట్‌ చేసి పంపిణీ చేయడంలో జాప్యం చేయడం, మరోవైపు ఫిజికల్‌ వెరిఫికేషన్‌లో ధాన్యం నిల్వల్లో తేడాలు వచ్చినా మిల్లులపై చర్యలు తీసుకోకపోవడంపై ఎఫ్‌సీఐ ఆగ్రహంతో ఉంది. దీంతో ఈ నెల 7 నుంచి బియ్యం సేకరణ నిలిపివేసింది. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లో మిల్లర్లు  మిల్లింగ్‌ నిలిపివేశారు. దీంతో మిల్లుల వద్ద వడ్ల నిల్వలు పేరుకుపోయాయి. యాసంగికి సంబంధించి మరో 15 వేల టన్నుల ధాన్యం రోడ్ల మీద, మిల్లుల వద్ద నిలిచిపోయి ఉంది. లక్షలాది టన్నుల వడ్లు బస్తాలు మిల్లుల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. వానలకు వడ్ల బస్తాలు తడిసి మొలకలు వస్తున్నాయి.