
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ పైసల వేటలో పడింది. ఎలక్షన్ ఇయర్ కావడం, నిధుల కొరతతో స్కీములన్నీ ఆగిపోవడంతో ఫండ్స్ ఎలా సమకూర్చుకోవాలని తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలో మళ్లీ భూముల అమ్మకాలపై దృష్టిపెట్టింది. బడ్జెట్ సెషన్ అయిపోయిన తెల్లారే సోమవారం అత్యవసరంగా రీసోర్సెస్ మొబిలైజేషన్ పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ బీఆర్కే భవన్ లో భేటీ అయింది. ఇప్పటి వరకు అమ్మిన భూములు, రాజీవ్ స్వగృహ ప్లాట్లు, ఫ్లాట్లతో పాటు రానున్న రోజుల్లో అమ్మాల్సిన వాటిపై చర్చించింది. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకంతో రూ.15 వేల కోట్ల ఆదాయం అంచనా వేయగా, ఇప్పటి వరకు దాదాపు రూ.12 వేల కోట్లు సమకూరినట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది భూములు అమ్మి ఇంకో రూ.13 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలో అందుకోసం తీసుకున్న చర్యలపై సబ్ కమిటీ భేటీలో చర్చించారు.
హౌసింగ్ భూముల్లో లేఅవుట్లు..
వేలం వేసిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలని, మిగిలిన వాటిని కూడా త్వరగా అమ్మేయాలని సమావేశంలో నిర్ణయించారు. గనుల వేలంతో భారీగానే ఆదాయం వస్తున్నప్పటికీ, దాన్ని ఇంకా ఎలా పెంచుకోవచ్చనే దానిపై చర్చించారు. ఆర్ అండ్‌బీలో హౌసింగ్ డిపార్ట్ మెంట్ విలీనం కావడంతో హౌసింగ్ లో నిరుపయోగంగా ఉన్న భూములను హెచ్ఎండీఏతో కలిసి లేఅవుట్లుగా అభివృద్ధి చేసే విషయమై చర్చించారు. ఇండస్ర్టీలకు కేటాయించిన భూములను అమ్మాలని ఇప్పటికే నిర్ణయించగా.. ఆజామాబాద్, బాలానగర్, హాఫీజ్ పేట్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లోని ల్యాండ్స్ అమ్మకాలపై మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ పై కొన్ని చోట్ల వ్యతిరేకత వస్తుండడంతో, ఇందుకోసం ఒక విధానం రూపొందించి ముందుకెళ్లాని నిర్ణయించారు.
సొంత జాగా ఉన్నోళ్లకు సాయంపై చర్చ..
సొంత జాగా ఉన్నోళ్లు ఇండ్లు కట్టుకునేందుకు చేసే ఆర్థిక సాయం స్కీమ్ పైనా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ స్కీమ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ఇంకా ప్రారంభం కాలేదు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున, సీఎం కోటాలో మరికొంత మందికి కలిపి దాదాపు 4 లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చారు. కానీ ఇది ఇంకా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్గైడ్ లైన్స్ తొందరగా ఫైనల్‌చేసి ప్రారంభించాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దీనిపై గైడ్ లైన్స్ ఇవ్వడంతో పాటు నిధులు సమకూర్చాలని ఆర్థిక శాఖను మంత్రులు ఆదేశించినట్లు తెలిసింది.