సింగరేణిపై రాష్ట్ర సర్కారు తప్పుదోవ పట్టిస్తున్నది

సింగరేణిపై రాష్ట్ర సర్కారు తప్పుదోవ పట్టిస్తున్నది

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్​ని కేంద్ర ప్రభుత్వం అమ్మలేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఖండిస్తూ ట్వీట్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నదని తెలిపారు. ‘‘సింగరేణిని కేంద్రం ఎవరికీ అమ్మలేదు. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. బొగ్గు క్వారీలను వేలం వేయడమే కేంద్రం చేస్తున్న తప్పు.

దానిపైనే మనం పోరాడాలి. ఒడిశాలో వేలం ద్వారా బొగ్గు గనులను దక్కించుకున్న సింగరేణి.. వాటిని ప్రైవేట్​కు అప్పగించింది. ఇప్పుడేమో మన రాష్ట్రంలో వేలం వేయొద్దనడం అవకాశవాదమే” అని మురళి ట్వీట్ చేశారు. సమాచార కమిషన్​ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అత్యంత ముఖ్యమైన, రాజ్యాంగబద్ధమైన సమాచార కమిషన్​ సభ్యుల్లేక మూతపడిందన్నారు.

‘‘రాజకీయాల్లో పెద్ద సారు బిజీగా ఉన్నారు. ఇలాంటి సంస్థలంటేనే ఆయనకు పెద్ద చిరాకు. పెద్దసారు ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ అనొద్దు. ప్రగతిభవన్ కోట నుంచి రాచరిక పాలన కొనసాగిస్తున్నరు. అదే తెలంగాణకు పట్టిన అతిపెద్ద శని” అని విమర్శించారు.