వడ్లు కొనకుండా చేతులెత్తేస్తున్న రాష్ట్ర సర్కారు

వడ్లు కొనకుండా చేతులెత్తేస్తున్న రాష్ట్ర సర్కారు
  • 60 లక్షల టన్నుల సేకరణకు 2 నెలల కిందనే ఓకే చెప్పిన కేంద్రం 
  • ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం కొన్నది 10 లక్షల టన్నులే..
  • ప్రభుత్వ పెద్దల ఆందోళనలతో సాగని కొనుగోళ్లు 
  • వడ్ల కుప్పల దగ్గర్నే రైతుల పడిగాపులు

హైదరాబాద్​, వెలుగు: వానాకాలంలో పండించిన వడ్లను అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతుంటే.. అదేమీ పట్టించుకోకుండా వచ్చే యాసంగి పంటకు క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలు చేస్తున్నది. సీఎం సహా మంత్రులు,  అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదే పనిలో ఉన్నారు. పదిరోజుల నుంచీ ప్రెస్​మీట్లు, ఆందోళనల్లో మునిగితేలుతున్నారు. దీంతో మార్కెట్​ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనే దిక్కు లేకుండాపోయింది. 60 లక్షల టన్నుల వడ్ల సేకరణకు కేంద్రం రెండు నెలల కిందట్నే  ఓకే చెప్పినా.. ఇప్పటివరకు 10 లక్షల టన్నుల వడ్లు కూడా రాష్ట్ర సర్కారు కొనలేదు. ఎప్పటికప్పుడు కేంద్రం తరఫున కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే నిరసనల్లో ఉండటం.. వడ్ల కొనుగోళ్ల బాధ్యత తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తుండటం.. రైతులను కలవరపెడుతున్నది. 

మొగులైతే బుగులు
దాదాపు అన్ని జిల్లాల్లో వానాకాలం వరి పంట కోతలు పూర్తయ్యాయి. దసరా తర్వాత నుంచి వడ్లు మార్కెట్​కు వస్తున్నాయి. పంటను కోసి.. కల్లాల్లో, రోడ్ల మీద ఆరబోసుకొని ఎప్పుడు కొంటరా అని రైతులు దిక్కులు చూస్తున్నారు. మొగులైతే చాలు బుగులుపడుతున్నారు. వడ్లు తడవకుండా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రోజుల తరబడి వడ్ల కుప్పల దగ్గర్నే పడిగాపులు కాస్తున్నారు.  వడ్లపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా అందడం లేదు. ఉమ్మడి కరీంనగర్​, మెదక్​, మహబూబ్ నగర్​, వరంగల్​ జిల్లాల్లో ఈ వారంలో కురిసిన వర్షాలతో వడ్లు మొలకలొచ్చి రైతులు భారీగా నష్టపోయారు. 

60 లక్షల టన్నుల వడ్లు కొనే వీలున్నా..!
కేంద్ర ప్రభుత్వం ఈ వానాకాలం మార్కెటింగ్​ సీజన్​లో 40 లక్షల టన్నుల బియ్యం సేకరిస్తామని రెండు నెలల కిందటే టార్గెట్​ ఇచ్చింది. అంటే దాదాపు 60 లక్షల టన్నుల వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొనే వీలుంది. కానీ ఇప్పటి వరకు కేవలం 10  లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. రాష్ట్ర మంతటా 6,500కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని నెల కిందట ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు 5 వేల సెంటర్లనే  తెరిచింది. తెరిచిన కేంద్రాల్లోనూ కొనుగోళ్లు జరుగుతున్నయా.. లేదా అని సివిల్​ సప్లయిస్​, మార్కెటింగ్​ విభాగాలు పట్టించుకోకపోవటం రైతుల పాలిట శాపంగా మారింది. ఎమ్మెల్యేలు సెంటర్లు ఓపెన్​ చేస్తున్నట్లు కొబ్బరి కాయలు కొట్టడం తప్ప.. ఇప్పటికే తెరిచిన కొన్ని సెంటర్లలో ఒక్క గింజ కూడా కొనడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సాగుపై తేలని  లెక్కల తంటా
వానాకాలంలో రాష్ట్రం అంతటా మొత్తం 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేసింది. కోటి 65 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేసింది. అందుకే 40 లక్షల టన్నుల బియ్యం సేకరిస్తే సరిపోదని,  దాన్ని 90 లక్షల టన్నులకు పెంచాలని కేంద్రంపై ఒత్తిడి పెంచింది. కానీ, డైరెక్టరేట్​ ఆఫ్​ ఎకనామిక్స్​ అండ్​ స్టాటిస్టిక్స్​ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. వరి సాగు విస్తీర్ణం దాదాపు 42 లక్షల ఎకరాలు అని, 54.17 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలున్నాయని అంటూ కేంద్రం అబ్జెక్షన్​ చెప్పింది. రాష్ట్రం విజ్ఞప్తి మేరకు టార్గెట్ పెంచే విషయం పరిశీలిస్తామని ప్రకటించింది. ఈ లోగా.. రెండు నెలల కింద కేంద్రం ఇచ్చిన  టార్గెట్​ ప్రకారం కొనుగోళ్లు చేపట్టేందుకు ఎలాంటి అడ్డంకులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం దాటవేత ధోరణి అనుసరించటం రైతులను కలవరపెడుతున్నది. 

నెల నుంచి కుప్పల కాన్నే
మెట్లపల్లి సెంటర్​కు వడ్లు తెచ్చి నెలైతంది. ఆఫీసర్లు, లీడర్ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే గురువారం కాంటాలు స్టార్ట్ చేసిన్రు. మూడు లారీల లోడ్ నింపి పంపిన్రు. అవెప్పుడు తిరిగొస్తయో తెల్వది. ఓ దిక్కు వానచ్చెటట్టుంది. రోజూ పొద్దున వడ్లు నేర్పుడు, కుప్పజేసుడు, రాత్రి కాపలా పండుడైతంది. పండించుడు కంటే అమ్ముకుంటానికే ఎక్కువ తిప్పలైతంది.
-  కట్ల శ్రీనివాస్, మెట్లపల్లి, పెద్దపల్లి జిల్లా