
సుప్రీంకోర్టు ముందు తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
12 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల ఆశలకు గండి
ఏటా 7.15 టీఎంసీలు మాత్రమే తీసుకోవాలన్న సుప్రీం
అదీ కేవలం తాగునీటి కోసమేనని స్పష్టీకరణ
మొదటి నుంచి ప్రాజెక్టు నిర్మాణంపై సర్కారు నిర్లక్ష్యం
పర్యావరణ అనుమతుల కోసమూ నాన్చివేత ధోరణి
రాష్ట్రం ఏర్పడ్డాక ముగ్గుపోసిన మొదటి ప్రాజెక్టు ఇది
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు : ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 12 లక్షలకుపైగా ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు –రంగారెడ్డి లిఫ్ట్ స్కీం ప్రాజెక్టును కడ్తున్నామని చెప్పిన రాష్ట్ర సర్కారు.. దాన్ని తాగునీటికే పరిమితం చేసింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ముందు ఈ విషయాన్ని ఒప్పుకుంది. ఏటా ఫ్లడ్ సీజన్లో 90 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉండగా.. 7.15 టీఎంసీలకు మాత్రమే అంగీకారం తెలిపింది. అవి కూడా తాగునీటి కోసమే. దీంతో ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మొదటి నుంచి రాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న అంతులేని నిర్లక్ష్యమే ప్రాజెక్టు ఊపిరిని తీసింది. ఫ్లడ్ సీజ్‌లో రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. కానీ, క్రమంగా ప్రభుత్వం దాన్ని ఒక టీఎంసీకి, ఆ తర్వాత అర టీఎంసీకి కుదిస్తూ వచ్చింది.
ఒక్కో పంపుహౌస్‌లో నాలుగు మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. మొన్నామధ్య రెండు మోటార్లకు కుదించింది. ఇప్పుడు ఒక్కో మోటారు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఎన్జీటీ విధించిన రూ. 828 కోట్ల పరిహారం, ఫైన్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. డ్రింకింగ్ వాటర్ కోసమే ప్రాజెక్టును చేపడుతున్నామని, ఆ పనులకు అనుమతివ్వాలని అభ్యర్థించింది. ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతో ప్రాజెక్టు నుంచి ఏటా 7.15 టీఎంసీలు ఎత్తిపోసుకునేందుకు చాన్స్ ఇస్తున్నామని, అంతకు మించి పనులు చేయడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ మెరిట్స్ఆధారంగానే ఉంటుందని చెప్తూ ఆగస్టుకు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
మొదటి నుంచి నిర్లక్ష్యమే
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట పునాది రాయి వేసిన ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డి. దీనిపై తొలి నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. 2015 జూన్10న రూ.35,200 కోట్లతో ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు. 30 నెలల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎప్పటికి కంప్లీట్ అవుతుందో తెలియని పరిస్థితి. నిర్మాణ వ్యయం రూ.49,595 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు రూ.22,935 కోట్ల విలువైన పనులు చేశారు. ఇందులో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన రూ.6 వేల కోట్ల లోన్ కాగా మిగతా మొత్తం రాష్ట్ర సర్కారు బడ్జెట్ నుంచి సమకూర్చింది. కాంట్రాక్టర్లకు రూ.1,500 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లోని ఎల్లూరు వద్ద నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసేందుకు 145 మెగావాట్ల కెపాసిటీ గల 8 భారీ మోటార్లు, ఒక స్టాండ్‌బై మోటార్ ఏర్పాటు చేసేలా పంపుహౌస్ డిజైన్‌చేశారు. మొదట ఓపెన్‌కట్ పంపుహౌస్‌గా దీనిని డిజైన్ చేయగా.. తర్వాత అండర్‌గ్రౌండ్‌కు మార్చారు. దీంతో స్టాండ్‌బై మోటారు తొలగించారు. మొదటి పంపుహౌస్‌లో స్టాండ్‌బై మోటార్ తీసేసి మిగతా పంపుహౌసుల్లో కంటిన్యూ చేయడంపై ‘వీ6 వెలుగు’ వరుస కథనాలు ప్రచురించింది. సర్కారు దిగివచ్చి అదనపు మోటారుకు సివిల్వర్క్లు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. మొదటి దశలో ఎల్లూరు నుంచి ఉద్దండపూర్ రిజర్వాయర్ వరకు నాలుగు పంపుహౌస్‌లు, కాల్వలు, టన్నెళ్లు ఇతర పనులను 18 ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవిపల్లి వరకు చేపట్టాల్సిన మరో మూడు ప్యాకేజీలకు ఇంతవరకు టెండర్లే పిలువలేదు.
టైమ్‌కు అనుమతులు తీసుకోక..!
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవడంపై రాష్ట్ర సర్కారు నాన్చివేత ధోరణి అవలంబించింది. 2019లోనే భూ సేకరణకు పబ్లిక్ హియరింగ్ చేపట్టేందుకు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది. ప్రాజెక్టుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన మొదటి దశ అనుమతులు (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ – టీవోఆర్) గడువు ముగిసే సమయంలో మేల్కొని హడావుడిగా భూసేకరణకు పూనుకుంది. నిర్ణీత వ్యవధిలోగా పర్యావరణ అనుమతులు సాధించకపోవడంతో గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 828 కోట్ల జరిమానా విధించింది. ఇందులో ఎన్వీరాన్మెంట్కు జరిగిన నష్టానికి పరిహారం కింద రూ.528 కోట్లు, ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని రూ.300 కోట్ల ఫైన్ వేసింది. ఈ ఆర్డర్స్ ను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం జస్టిస్సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ ముఖల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఎన్జీటీ ఆదేశాలతో రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. ‘‘ప్రాజెక్ట్ లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డ్రింకింగ్, మరొకటి ఇరిగేషన్. పాలమూరు- రంగా రెడ్డి ప్రాజెక్ట్ పూర్తిగా డ్రింకింగ్ వాటర్ కోసం నిర్మిస్తున్నది’’ అని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకొని... ఇది పూర్తిగా డ్రింకింగ్ వాటర్ కోసమే అని పిటిషన్ లో ఎక్కడా మెన్షన్ చేశారని ప్రశ్నించింది. స్పందించిన తెలంగాణ తరపు అడ్వకేట్.. కేవలం డ్రికింగ్ వాటర్ కోసమే ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించామని, ఇందుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవసరం లేదన్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన నిర్మాణాల చిత్రాలను బెంచ్ కు సమర్పించారు. ‘‘ఈ ప్రాజెక్ట్ లో నిర్మిస్తున్న ఐదు రిజర్వాయర్లు కేవలం డ్రికింగ్ వాటర్ కోసం మాత్రమే. ఈ రిజర్వాయర్ సైట్ 24 వేల ఎకరాలు. రాష్ట్రపతి భవన్ సైజ్ కన్నా ఇది 100 రెట్లు పెద్దది’’ అని వివరించారు. అయితే 2021 నవంబర్ నుంచి ఎన్జీటీ ఆదేశాలతో ఈ ప్రాజక్ట్ ఆగిపోయిందన్నారు. కాగా, తాగునీటి అవసరాలకు 7.15 టీఎంసీలు సరిపోతాయని, అయితే డ్రింకింగ్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్ అవసరాలకు తగ్గట్లుగా దాదాపు 90 టీఎంసీలకు ప్రాజెక్టుకు తెలంగాణ డిజైన్ చేసిందని ఏపీ తరఫున సీనియర్ అడ్వకేట్ జైదీప్ గుప్తా వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. అప్పటి వరకు తాగునీటి అవసరాల కోసం మాత్రమే 7.15 టీఎంసీల ప్రాజెక్టు పనులు చేపట్టుకోవాలని స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దని, ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని వెల్లడించింది. అలాగే ఎన్జీటీ విధించిన పరిహారం, జరిమానాలపై స్టే విధించింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్రం, ఏపీ సర్కార్, రైతులకు నోటీసులు జారీ చేసింది. వీటికి ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత ఆరు వారాల్లో వాటికి సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం రిజాయిండర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జూరాల నుంచి శ్రీశైలానికి మార్చినా..!
ఉమ్మడి ఏపీలో జూరాల నుంచి 60 రోజుల్లో రోజుకు ఒకటిన్నర టీఎంసీల చొప్పున 90 టీఎంసీలు ఎత్తిపోసేలా పాలమూరు ప్రాజెక్టును డిజైన్ చేశారు. కేసీఆర్ రీ ఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టు సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. పాలమూరుకు అదనంగా డిండి ఎత్తిపోతల ప్లాన్ చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లోని ఎల్లూరు నుంచి 60 రోజుల్లో రోజుకు 2 టీఎంసీల చొప్పున 120 టీఎంసీలను ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా ఎత్తిపోసే నీళ్లల్లో 90 టీఎంసీలు పాలమూరుకు, 30 టీఎంసీలు డిండికి వాడుకుంటామని ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లూరు, ఏదుల, వట్టెం, కరివెన పంపుహౌసుల్లో 145 మెగావాట్ల సామర్థ్యం గల తొమ్మిది చొప్పున మోటార్లు, ఉద్దండపూర్‌లో అంతే కెపాసిటీ గల ఐదు మోటార్లు ఏర్పాటు చేసేలా పనులు చేపట్టారు. 2019 ఆగస్టులో కేసీఆర్ ఈ ప్రాజెక్టును విజిట్ చేసి మొదటి దశలో రోజుకు ఒక టీఎంసీ ఎత్తిపోసే పనులే చేపట్టాలని ఆదేశించారు. ఆ తర్వాత నిధుల లేమి పేరుతో మొదటి 3 పంపు హౌసుల్లో 4 మోటార్లకు బదులు 2 మోటార్లు, ఉద్దండాపూర్‌లో ఒక మోటార్ మాత్రమే పెట్టాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. వర్క్ ఏజెన్సీలు సీఎం ఆదేశాలకు తగ్గట్టుగా పంపుహౌస్‌ల పనులు చేస్తున్నాయి.
ఆయకట్టుకు నీళ్లు కలే!
తాజా పరిణామాలతో ఎల్లూరు, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ పంపుహౌసుల్లో ఒక్కో మోటారు ఏర్పాటుకు మాత్రమే అనుమతి వచ్చినట్లయింది. ఏటా 7.15 టీఎంసీలకు మించి నీళ్లు తీసుకోవడానికి అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టు ప్రతిపాదిత 12 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు డిండి కింద చేర్చిన మరో 3 లక్షల ఎకరాలకు ఇంకా ఎన్నేండ్లకు నీళ్లు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ప్రాజెక్టు పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలు అధికంగా ఉండటంతో వాటిని అధిగమించేందుకు ఎక్కవ సమయమే పట్టే అవకాశం ఉంది. దీంతో రాబోయే కొన్నేండ్లలో ఈ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లు అందే పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులకు అనుమతులు లేకున్నా నిర్మాణ పనులు వేగంగా చేపట్టిన ప్రభుత్వం.. పాలమూరు విషయంలో మాత్రం ఆ వేగం చూపించలేదన్న విమర్శలు ఉన్నాయి. అనుమతులు లేవన్న పేరుతో పనులు స్లోగా చేసింది. తద్వారా నిర్మాణ వ్యయం తడిసి మోపెడు కాగా.. రూ.22 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా కేవలం తాగునీటికే పాలమూరు ప్రాజెక్టు పరిమితం కానుంది.
ప్రాజెక్టులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డ్రింకింగ్, మరొకటి ఇరిగేషన్. పాలమూరు- రంగా రెడ్డి ప్రాజెక్ట్ పూర్తిగా డ్రింకింగ్ వాటర్ కోసం నిర్మిస్తున్నది. ఇందుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవసరం లేదు. ప్రాజెక్ట్ లో చేపడుతున్న ఐదు రిజర్వాయర్లు కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే.
- సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదన