లిక్కర్, పెట్రోల్‌‌‌‌‌‌‌‌తోనే రూ.54,574 కోట్లు

లిక్కర్, పెట్రోల్‌‌‌‌‌‌‌‌తోనే రూ.54,574 కోట్లు

లిక్కర్, పెట్రోల్‌‌‌‌‌‌‌‌తోనే రూ.54,574 కోట్లు
ఎక్సైజ్ రాబడి రూ.39 వేల కోట్లు
పెట్రోల్, డీజిల్, సిగరెట్ల సేల్స్​తో రూ.15 వేల కోట్లు
మొత్తంగా పన్ను ఆదాయం రూ.1.52 లక్షల కోట్లు
కేంద్రం నుంచి వచ్చేవి రూ.65 వేల కోట్ల పైనే

హైదరాబాద్, వెలుగు : లిక్కర్, పెట్రోల్, డీజిల్ అమ్మకాలతోనే రాష్ట్ర సర్కార్ భారీగా ఆదాయం సమకూర్చుకోనుంది. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో భారీగా ప్రతిపాదనలు చేసింది. టాక్స్​ల ద్వారా మొత్తం రూ.1.52 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఒక్క లిక్కర్​తోనే ఏకంగా రూ.39 వేల కోట్లు వస్తాయని పేర్కొంది. ఇందులో వ్యాట్ వేయడం ద్వారా రూ.20 వేల కోట్లు, ఇంకో 19 వేల కోట్లు స్టేట్ ఎక్సైజ్ కింద రానున్నాయి. మొత్తంగా గతేడాది కంటే ఈసారి 2 వేల కోట్లు ఎక్కువ వస్తాయని పేర్కొన్నారు. ఇంకా పెట్రోల్, డీజిల్, సిగరెట్ల సేల్స్​లో వచ్చే రాబడిని రూ.15,574 కోట్లుగా చూపెట్టారు. ఇది గత ఏడాది కంటే దాదాపు ఐదు వేల కోట్లు ఆధికం. భూముల కొనుగోళ్లు, అమ్మకాలు పెరగడం, రిజిస్ట్రేషన్ చార్జీలు, భూ విలువలను పెంచడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ ఆదాయం కూడా పెంచుకున్నారు. వీటికి రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్లు ప్రతిపాదించారు.

గత ఏడాది కంటే మూడు వేల కోట్లు అదనంగా టార్గెట్ పెట్టుకున్నారు. వాహనాలపై పన్ను వేయడం ద్వారా రూ.7,512 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఈసారి కూడా భూముల అమ్మకంతో ఎక్కువ మొత్తంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బడ్జెట్​లో 13 వేల కోట్ల రూపాయలు భూములు, ప్లాట్ల అమ్మకం ద్వారా తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.65 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర సర్కార్ అంచనా వేస్తోంది. సొంత ఆదాయం పెరుగుతుందంటూ పోయినసారి కంటే ఈసారి రూ.34 వేల కోట్లు ఆదనంగా బడ్జెట్​ను ప్రతిపాదించింది. ఇందులో టాక్స్ ఆదాయంతో పాటు నాన్​ టాక్స్ రెవెన్యూ పెంచింది. జీఎస్టీతో రూ.44 వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేసింది.