
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ హాస్పిటల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో త్వరలో నాలుగు వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో మంత్రి తలసానితో కలిసి పశుసంవర్ధక, మత్స్య శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జీవాలను కాపాడేందుకు వాటి మంద వద్దకే వెళ్లి వైద్య సేవలదించాలనే ఆలోచనతో మొదటి సారిగా రాష్ట్రంలో షురూ చేసిన మొబైల్ వెటర్నరీ హాస్పిటల్స్‌ను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రారంభించడమే దీనికి నిదర్శనం అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పశుసంవర్ధక శాఖకు ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు.
ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలను మంత్రి తలసాని దృష్టికి తీసుకొచ్చారు. రూ.370 కోట్ల ఖర్చుతో 58,992 పాడి గేదెలను సబ్సిడీపై పంపిణీ చేసినట్లు చెప్పారు. పాల సేకరణ ధరను పెంచడంతో మరో 30వేల లీటర్ల సేకరణ పెరిగిందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్య సంపద మూడింతలు పెరిగిందని తెలిపారు. 2021–22లో రూ.76 కోట్లతో 77.49 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా, రూ.5,410 కోట్ల విలువైన 3.76 టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందన్నారు. ఈయేడు 26,778 నీటి వనరుల్లో 88.53 కోట్ల చేప పిల్లలను రూ.68 కోట్లతో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో షీప్ కార్పొరేషన్ చైర్మన్ డి.బాల్‌రాజ్, స్పెషల్ సీఎస్ అధర్ సిన్హా, ఫిషరీస్ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.