అటు దోస్తీ… ఇటు కుస్తీ

అటు దోస్తీ… ఇటు కుస్తీ
  • నదీ జలాల వినియోగంపై వింత పరిస్థితి
  • గోదావరి-కృష్ణా లింక్​కు తెలంగాణ, ఏపీ సర్కార్ల ఆలోచన
  • ముఖ్యమంత్రులు, ఇంజనీర్ల స్థాయిలో చర్చలు
  • కృష్ణా ట్రిబ్యునల్​లో మాత్రం పాత పాటే పాడిన ఏపీ ఆఫీసర్లు
  • పాలమూరు, డిండి ప్రాజెక్టులకు అనుమతుల్లేవని కంప్లైంట్లు
  • తెలంగాణ నీటి వాటాలపై వితండ వాదనలు
  • అవి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులేనని స్పష్టం చేసిన రాష్ట్ర ఇంజనీర్లు
  • ఏపీనే అక్రమంగా మళ్లిస్తోందని వివరణలు

తెలంగాణ, ఏపీ రెండూ వేర్వేరు అన్న భావన లేదు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడిస్తే చాలు. నీళ్ల కోసం ట్రిబ్యునళ్లు, కేంద్రం చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనమేదీ లేదు. నదీ జలాలను రెండు రాష్ట్రాల అవసరాలు తీర్చేలా వాడుకుందాం. – ఇటీవల సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్​ చెప్పిన మాటలివి

తెలంగాణ, ఏపీ రెండూ వేర్వేరు అన్న భావన లేదు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడిస్తే చాలు. నీళ్ల కోసం ట్రిబ్యునళ్లు, కేంద్రం చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనమేదీ లేదు. నదీ జలాలను రెండు రాష్ట్రాల అవసరాలు తీర్చేలా వాడుకుందాం. – ఇది కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట ఏపీ ఇంజనీర్ల వాదన

పాలమూరు, డిండి ప్రాజెక్టులు ఉమ్మడి ఏపీలో చేపట్టినవే. ఏపీయే శ్రీశైలం నీటిని అక్రమంగా పెన్నా బేసిన్​కు తరలిస్తోంది. పోలవరం కింద రావాల్సిన వాటాను అడ్డుకుంటోంది. తొలి నుంచీ తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది. – ఇది తెలంగాణ ఇంజనీర్ల వివరణ.

హైదరాబాద్‌, వెలుగు: ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలు, జల వివాదాల పరిష్కారం కోసం జూన్‌ 28న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్​ సమావేశమయ్యారు. కృష్ణాలో ఎక్కువగా నీళ్లు లేవని గోదావరి జలాలతో తెలుగు నేల ప్రతి అంగుళాన్ని తడుపుతామని ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు ఒకే మాటగా చెప్పారు. గోదావరి నుంచి కృష్ణా పరీవాహకానికి నీటిని తరలించే ప్రాజెక్టుపైనా చర్చలు జరిగాయి. ఇదే కాదు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహబంధం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. సెక్రటేరియెట్‌, స్టేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఆఫీసుల్లో వినియోగించని భవనాలన్నింటినీ ఏపీ ఖాళీ చేసి తెలంగాణకు ఇచ్చేసింది. మరిన్ని అంశాల్లోనూ ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్​లో మాత్రం ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు, అధికారులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమని ఏపీ ఇంజనీర్లు ఆరోపిస్తుండగా.. నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని, ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుంటోందని తెలంగాణ ఇంజనీర్లు, అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అధికారులు భేటీ అయినా..

ప్రగతి భవన్​లో సీఎంల సమావేశానికి కొనసాగింపుగా ఇరు రాష్ట్రాల ఇంజనీర్​ఇన్​ చీఫ్​లు, ఇతర ఇంజనీర్లు, అధికారులు రెండు సార్లు భేటీ అయ్యారు. గోదావరి– కృష్ణా బేసిన్‌ లింక్‌పై చర్చించారు. జూన్‌ 9న జరిగిన భేటీలో గోదావరి-కృష్ణా లింక్‌పై రెండు రాష్ట్రాలు రెండేసి ప్రతిపాదనలు చేశాయి. అదే నెల 15న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నా వాయిదా పడింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇంజనీర్ల భేటీ జరగలేదు. తిరిగి ఈ వారంలో వారు సమావేశమయ్యే అవకాశముంది. అయితే పైకి అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. తెలంగాణ, ఏపీ ఇరిగేషన్‌ ఇంజనీర్ల మధ్య గ్యాప్‌ స్పష్టంగా కనిపిస్తోంది. కృష్ణా ట్రిబ్యునల్‌ విచారణలో ఈ విషయం స్పష్టమైంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేదని, ఆ ప్రాజెక్టులు అక్రమమైనవని ఏపీ ఇంజనీర్లు ఎదుట వాదించారు. ట్రిబ్యునల్​లో తెలంగాణ తరఫున సాక్షిగా హాజరైన సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఘన్‌శ్యాం ఝాను ఏపీ న్యాయవాది ఆర్‌. వెంకటరమణి పదే పదే ప్రశ్నించారు. అనుమతుల్లేకుండా చేపట్టారన్న వాదననే హైలైట్​ చేశారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు ఉమ్మడి ఏపీలో చేపట్టినవని, జూరాల వద్ద నీటి నిల్వ తక్కువగా ఉంటుంది కాబట్టే నీటిని శ్రీశైలం ఫోర్‌షోర్‌ నుంచి ఎత్తిపోసేలా రీడిజైన్‌ చేశారని తెలంగాణ సాక్షి వివరించారు. కొత్త ప్రాజెక్టులు కాదు కాబట్టి కొత్తగా కేఆర్‌ఎంబీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి అవసరం లేదని, 2016లో తెలంగాణ సర్కారు అపెక్స్‌ కౌన్సిల్‌ ముందు హాజరై ఈమేరకు స్పష్టత ఇచ్చిందని వివరించారు.

అక్రమంగా నీళ్లు తరలిస్తున్నరు..

ఏపీ సర్కారు శ్రీశైలం నీటిని అక్రమంగా పెన్నా బేసిన్‌లోకి తరలించుకుపోతుందని.. కృష్ణా బేసిన్‌లోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేస్తోందని తెలంగాణ ఇంజనీర్లు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. కృష్ణా జలాల ట్రిబ్యునల్‌–1 చైర్మన్‌ జస్టిస్‌ బచావత్‌ సైతం ఈ విషయాన్ని గుర్తించారని చెప్తున్నారు. బచావత్‌ తన అవార్డు (1974) లో ‘తెలంగాణకు నీళ్లు కావాలని అడిగే వాళ్లే లేరు.. అయినా అక్కడి పరిస్థితులను గమనించి మేమే జూరాలకు 18 టీఎంసీలు కేటాయిస్తున్నం..’అని ఆయన చెప్పినట్టు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో కృష్ణా పరీవాహక ప్రాంతం 19.9 శాతం ఉండగా 299 టీఎంసీల నీటినే కేటాయించారని.. 9.2 శాతం క్యాచ్‌మెంట్‌ ఏరియా ఉన్న ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారని ఇది సరికాదని స్పష్టం చేస్తున్నారు. ట్రిబ్యునళ్లు నీటి కేటాయింపుల్లో శాస్త్రీయతను విస్మరించాయని, అందుకే పునః పంపిణీ చేయాలని తెలంగాణ కోరుతోందని అంటున్నారు.

సాగర్​ నీటిలోనూ..

కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు ఉన్నా ఏటా 150 టీఎంసీలకు మించి ఉపయోగించుకోవడం లేదని ఇంజనీర్లు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిన వెంటనే నాగార్జున సాగర్‌లో 80 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు వాడుకోవచ్చని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ పేర్కొందని, దాంతో కర్ణాటక, మహారాష్ట్రలు 35 టీఎంసీల నీళ్లను ఉపయోగించుకుంటున్నాయని చెప్తున్నారు. కానీ తెలంగాణ వాటాగా దక్కాల్సిన 45 టీఎంసీలు ఇవ్వకుండా గత ఏపీ ప్రభుత్వం, అధికారులు అడ్డుతగిలారని స్పష్టం చేస్తున్నారు. అసలు అంతరాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారం చట్టం (1956) సెక్షన్‌–3 ప్రకారం కృష్ణా జలాలను తిరిగి పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారు గతంలోనే కేంద్రాన్ని కోరింది కూడా. లోక్‌సభలో అంతరాష్ట్ర నదీజలా వివాదాల సవరణ బిల్లు–2019పై చర్చ కూడా జరుగుతోంది. కానీ ఏపీ మాత్రం ట్రిబ్యునల్‌ ఎదుట అడ్డగోలుగా వాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులపై విషం చెమ్ముతోందని ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఇరిగేషన్‌ అధికారుల తీరుతో భవిష్యత్‌ లో ఇరు రాష్ట్రాల సంబంధాలు దెబ్బతినే అవకాశముందని అంటున్నారు.