ఆస్తుల ఆన్​లైన్ గందరగోళం..15 రోజుల గడువుపై జనంలో గుబులు

ఆస్తుల ఆన్​లైన్ గందరగోళం..15 రోజుల గడువుపై జనంలో గుబులు
  • ప్రతి ఆస్తికి ఆధార్​, ఫోన్​ నంబర్ల లింక్​ ఎందుకు?
  • గ్రామాల్లో కాగితాల్లేని ఇండ్లు, ఖాళీ స్థలాలు ఎక్కువే
  • ముదురనున్న ఆస్తి తగాదాలు, స్థల వివాదాలు
  • గైడ్​లైన్స్​ లేకుండా హడావుడి ఏందంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయేతర భూములకు మెరూన్​ పాస్​ బుక్కులు జారీ చేస్తామని సీఎం చేసిన ప్రకటన.. అనుమానాలు రేకెత్తిస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టం పట్టాలెక్కక ముందే..  ప్రజలందరూ తమ ఆస్తులను ఆన్​లైన్​లో నమోదు చేసుకోవాలని ఆయన ప్రకటించటం గందరగోళానికి తెర లేపింది.  15 రోజుల్లోనే ఈ ప్రాసెస్​ పూర్తి చేయాలని చెప్పటంతో రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్​ విభాగాల్లోనూ అయోమయం నెలకొంది. తమ ఆస్తులను సెల్ఫ్​ డిక్లరేషన్​ చేయాలా..? ఎందుకు చేయాలి..?  ఎందుకీ ఆగమాగం..? ఇప్పటికిప్పుడు ఆస్తులను డిక్లరేషన్​ చేయడమేంది? అనే సందేహాలు అందరిలోనూ  వ్యక్తమవుతున్నాయి.  సాధారణంగా ఎన్నికలప్పుడు పోటీచేసే వాళ్లు తమ ఆస్తులను అఫిడవిట్​ ద్వారా వెల్లడించాలని, ఏడాదికోసారి ఐఏఎస్​ ఆఫీసర్లు తమ ఆస్తులను వెల్లడించాలని చట్టంలో నిబంధనలున్నాయి.కానీ.. రాష్ట్రంలోని ప్రజలందరూ తమ ఇండ్లు, భవనాలు, ఒక్క ఇంచ్​ వదలకుండా వ్యవసాయేతర భూములన్నీ  బహిర్గతం చేయాలని, వాటిని ఆధార్​తో లింక్​ చేయాలని, ఫోన్​ నెంబర్లు సహా కుటుంబసభ్యుల వివరాలన్నీ సమర్పించాలన్నట్లుగా  రాష్ట్ర  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కుటుంబ సర్వే అప్పుడు అట్ల.. ఇప్పుడు ఇట్ల..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం చేపట్టిన  సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఒక కోటీ లక్షా 93 వేల కుటుంబాలు.. 57 లక్షల ఇండ్లు ఉన్నాయి.  వీటిలో 90 శాతంపైగా  ఇండ్లు, ఆస్తులన్నీ వారసత్వంగా లేదా  క్రయ విక్రయాల ద్వారా వచ్చినవేనని రెవెన్యూ, పంచాయతీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. సంబంధిత రికార్డులు,  ధ్రువీకరణలన్నీ  ప్రభుత్వం నిర్దేశించిన రికార్డులు, ఆస్తి పన్ను రశీదుల ఆధారంగానే చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా.. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలని ప్రభుత్వం బలవంతం చేయటం వెనుక ఏదో మతలబు దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ‘‘ప్రజలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించటం, ఆధార్​తో లింక్​ చేసుకోవటం తప్పనిసరి కాదు.. అదొక ఆప్షన్​ మాత్రమే’’నని సూచించిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటినే నిర్బంధం చేస్తుందనే  అభిప్రాయాలున్నాయి. సమగ్ర ఆస్తుల రికార్డు పేరుతో ప్రభుత్వం ప్రజల ఆస్తుల సమాచారం, ఆధార్​ నెంబర్లు, ఫోన్​ నెంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుంటుందని.. వీటి ఆధారంగా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, రేషన్​ కార్డులను తొలగిస్తారనే ఆందోళనలు ప్రజల్లో  అలుముకున్నాయి. ఆస్తుల ఆన్ లైన్​ నమోదు ప్రాసెస్​ కొత్త వివాదాలకు తెర లేపుతుందని.. ఇప్పటికే కోర్టు కేసులు, తగాదాల్లో ఉన్న ఆస్తుల గొడవలు మరింత ముదిరే ప్రమాదముందని  రెవెన్యూ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.

ఊళ్లలో రికార్డుల్లేని ఖాళీ స్థలాలెన్నో..?

ఊళ్లలో ఇండ్లు ఎక్కువగా ఆబాదీ/గ్రామకంఠం భూముల్లోనే ఉన్నాయి. వీటికి సరైన రికార్డుల్లేవు. 80 ఏండ్ల కింద వ్యవసాయ భూముల సమగ్ర సర్వే జరిగినప్పటికీ.. ప్రజల నివాసం కోసం నిర్దేశించిన ఈ భూములను సర్వే చేయలేదు. దీంతో ఈ భూములకు సంబంధించిన మ్యాపుల్లేవు. గతంలో ఈ భూముల రిజిస్ట్రేషన్లు కూడా జరిగేవి కావు. ఊళ్లలో తరతరాలుగా వారసత్వంగా వస్తున్న విశాలమైన ఇంటి స్థలాలు, ఇండ్లకు కొలతలతో కూడిన రికార్డుల్లేవు.   పంచాయతీ విధించే ఇంటి పన్ను రిసిప్ట్​ మాత్రమే ఓనర్​షిప్​కు ఆధారంగా మారింది. దీని ఆధారంగానే ప్రస్తుతం ఓనర్​షిప్​ సర్టిఫికెట్ ను ప్రజలు తీసుకుంటున్నారు. ఊళ్లలో 2016లో ఇస్రో సాయంతో భువన్​ యాప్​ ఆధారంగా.. ఇండ్లు నిర్మించిన ఏరియా వరకే అసెస్​మెంట్ చేశారు. ఇంటి చుట్టూ ఉండే మిగితా ఖాళీ స్థలం వివరాలు ఇందులో లేవు. ఇప్పుడు ఇలాంటి ఇంటి స్థలాలకు కొలతలు వేసి పక్కాగా నమోదు చేస్తేనే ఆస్తుల నమోదు సంపూర్ణమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

విధివిధానాలు లేకుండానే..!

వ్యవసాయేతర ఆస్తుల ఆన్​లైన్​ ప్రాసెస్​ 15 రోజుల్లో పూర్తి చేయాలని ఈ నెల 22న సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ప్రకటించి మూడు రోజులైనా ఆస్తుల నమోదుకు సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్​ శాఖ సీనియర్​ ఆఫీసర్ల నుంచి ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ ఆఫీసర్లు ముందుకెళ్లడం లేదు. అంతేగాక తమకు ఇండ్లు, ఫ్లాట్ల ఆన్​లైన్​(మ్యుటేషన్)​ చేయడానికి మాత్రమే ఆప్షన్​ ఉందని, ఖాళీ స్థలాలు తమ పరిధిలోకి రావని వారు చెబుతున్నారు. ఆన్​లైన్​లో ఆస్తుల మ్యుటేషన్​కు ఇ–పంచాయతీ వెబ్​సైట్​తోపాటు మున్సిపాలిటీలు, మున్సిపల్​ కార్పొరేషన్ల వెబ్​సైట్​లో ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఎలాంటి విధివిధానాలు ప్రకటించకముందే 15 రోజుల డెడ్ లైన్​ పెట్టడం, అందులోనూ మూడు రోజులు గడిచిపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ ఆఫీసర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన ఆస్తుల ఆన్ లైన్, కుటుంబ సభ్యుల వివరాల చేర్పును ఎలా చేసుకోవాలో,​ ఎక్కడ చేసుకోవాలో తెలియక ప్రజలు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

వ్యవసాయేతర ఆస్తులు కోటిపైనే..

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసింది. రాష్ట్రంలో 1,01,93,027  కుటుంబాలు ఉంటే.. మొత్తం ఇండ్ల సంఖ్య 57,44,457గా తేలింది. ఇ– పంచాయతీ పోర్టల్ లెక్కల ప్రకారం.. భువన్  యాప్​ ద్వారా ట్యాక్స్​ అసెస్​మెంట్​ పూర్తయిన ఇండ్లు ఊళ్లలో 49,63,233 ఉండగా.. మరో 4,19,647 ఇండ్లు అసెస్​ చేసి, ఆన్ లైన్​ లో నమోదు కావాల్సి ఉంది. ఈ లెక్కన ఊళ్లలో ఇండ్ల సంఖ్య 53,82,880గా తేలే అవకాశముంది. మున్సిపాలిటీల్లో మరో 11.55 లక్షల ఇండ్లకు అసెస్ మెంట్​ పూర్తయింది. ఊళ్లలో, పట్టణాల్లో కలిపితే ఇండ్ల సంఖ్య 65 లక్షలు దాటనుంది. వీటితోపాటు  పంచాయతీల పరిధిలోని లేఔట్ అనుమతి లేని 12,14,574 ప్లాట్లను, పట్టణాల పరిధిలోని 2,81,171 పాట్లను ఆన్​ లైన్​ చేయాల్సి ఉంది. వీటితో కలిపి సుమారు 35 లక్షల ఖాళీ స్థలాలు, వ్యవసాయేతర ఆస్తులను ఆన్​ లైన్​ చేయడంతోపాటు ఆధార్​ తో అనుసంధానించాల్సి ఉందని తెలిసింది.

రేషన్​ కార్డు, సంక్షేమ పథకాలు కోల్పోతామన్న భయం

ప్రభుత్వం చేతుల్లో  ప్రజల ఆస్తుల చిట్టా

భూరికార్డుల  ప్రక్షాళన పేరిట మూడేండ్ల కింద వ్యవసాయ భూముల రికార్డుల డిజిటలైజేషన్​ చేపట్టిన సర్కార్.. ఇప్పుడు వ్యవసాయేతర భూముల రికార్డు పేరుతో ప్రజల ఆస్తులను ఆన్​ లైన్​ లో నమోదు చేస్తున్నది. చిన్న తండాలు, గూడేలు, ఊళ్లు మొదలుకొని పట్టణాలు, మహా నగరాల్లో ఉన్న ప్లాట్లు, అపార్ట్​మెంట్లలోని ఫ్లాట్లు, ఇండ్లు, వ్యవసాయేతర ఆస్తులన్నీ స్థానిక సంస్థల రికార్డుల్లోకి తీసుకురావాలని పట్టు బడుతున్నది. గతంలో పట్టాదారు పాస్​పుస్తకాలకు ఆధార్​ లింక్​ చేసిన తరహాలోనే ఇప్పుడు వ్యవసాయేతర ఆస్తులకు కూడా ఆధార్​ను లింక్​ చేయబోతున్నది. దీంతోపాటు సదరు ఆస్తి యజమాని కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్​నంబర్లను ఆ ఆస్తులతో లింక్ చేయబోతున్నది. ఈ ఆన్​లైన్ ప్రాసెస్​ పూర్తయితే ​రాష్ట్రంలోని ప్రజలందరి ఆస్తుల చిట్టా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఆధార్​ నంబర్​ సాయంతో ఒక్క క్లిక్​తో ఏ కుటుంబ ఆస్తినైనా ఇట్లే తెలుసుకునే చాన్స్ ఉంది.