ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీలో విషాదం.. తుర్కచెరువులో మిథున్ డెడ్బాడీ లభ్యం

ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీలో విషాదం.. తుర్కచెరువులో మిథున్ డెడ్బాడీ లభ్యం

హైదరాబాద్ : ప్రగతినగర్ నాలాలో గల్లంతైన నాలుగేళ్ల బాలుడు మిథున్ డెడ్ బాడీ దొరికింది. ఉదయం నుంచి తుర్క చెరువును జల్లెడ పట్టిన డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి డెడ్ బాడీ లభించింది. ప్రస్తుతం ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో బాలుడు ఇంటి ముందు ఉన్న మ్యాన్ హోల్ లో గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీలో జరిగింది.

శోకసంద్రంలో తల్లిదండ్రులు 

గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా ప్రగతినగర్ లోని అపార్ట్ మెంట్ సెల్లార్లు నీట మునిగాయి. వీధులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. ఈ క్రమంలోనే ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీలో ఇంటి ముందు నీళ్లల్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు మిథున్.. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడిపోయాడు. 

ఘటనాస్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా మిథున్ మ్యాన్ హోల్ లో పడిపోయిన విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు, స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 

ఎన్ఆర్ఐ కాలనీకి దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న తుర్క చెరువులో డెడ్ బాడీ కనిపించిందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గజ ఈతగాళ్లు, 10 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది బాలుడి డెడ్ బాడీ కోసం తుర్క చెరువును జల్లెడ పట్టారు. దాదాపు ఆరు గంటలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. చివరకు మిథున్ డెడ్ బాడీ దొరికింది. 

మిథున్ డెడ్ బాడీని చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తుండడం ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనతో ప్రగతినగర్ లో విషాదం నెలకొంది. 

 

జీహెచ్ఎంసీపై విమర్శలు 

వర్షాలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వర్షాలు వచ్చిన సమయంలో మ్యాన్ హోల్స్ ను మూసి వేయకుండా.. అజాగ్రత్తగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపస్తున్నాయి. బాలుడు మృతికి కారకులు ఎవరని ప్రశ్నిస్తున్నారు.