బెల్.. థెరిసా ఆశ్రమంలోని ఓ అర్పణ కథ

బెల్.. థెరిసా ఆశ్రమంలోని ఓ అర్పణ కథ

పదిహేనేండ్ల అర్పణ చాలా అందంగా ఉంటుంది. థెరిసా ఆశ్రమంలో పెరుగుతున్న అనాథ తను. పిల్లలు చిన్న చిన్న విషయాలకే ఉత్సాహపడి, ఆనందానుభూతులకు లోనవుతారు. అది పిల్లలకు ఉండే గొప్ప గుణం. అలాగే అర్పణ కూడా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండేది.
‘‘రాణీ, ఇవ్వాళ మన స్కూల్​కి కొత్త మ్యాథ్స్​ టీచర్​ వస్తున్నారంట కదా” అని స్నేహితురాలిని అడిగింది అర్పణ.
‘‘ఒకసారి గంట కొడితే తెలుగు మాష్టారు వస్తారు. రెండుసార్లు కొడితే కొత్త మ్యాథ్స్​ సర్​ వస్తారంట”అని అర్పణతో చెప్తూ మహిమ, ఇతర స్నేహితులతో కలిసి రెండు పరుగులు తీసింది రాణి. నెమ్మదిగా ఏదో పాట పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అర్పణ.
ఆ మరుసటి రోజు..
గణ.. గణమని గంట రెండు సార్లు మోగింది. కొత్త మ్యాథ్స్ సర్ క్లాస్​ రూమ్​లోకి రానే వచ్చాడు. ‘హలో స్టూడెంట్స్’ అని పిల్లలందరినీ పలకరించి, తనని తాను పరిచయం చేసుకున్నాడు. అర్పణకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే మ్యాథ్స్ టీచర్​కి తన మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.
‘‘సర్, నా పేరు అర్పణ. నాకు మ్యాథ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను పెద్దయ్యాక సాఫ్ట్​వేర్​ ఇంజనీర్ అవుతా” అని మ్యాథ్స్ మీద తనకున్న ప్రేమను మాటల్లో నింపుకొని మరీ చెప్పింది.
క్లాస్​ రూమ్​లో ఎవరూ మాట్లాడకముందే అర్పణ ధైర్యంగా లేచి, మాట్లాడినందుకు స్టూడెంట్స్​ అందరూ ఆశ్చర్యంతో చూసారు. కొత్త మ్యాథ్స్ టీచర్ అర్పణ కేసి రెండు నిమిషాలు చూశాడు. ఆ చూపుకి అర్థం ఏమిటో అప్పుడు అర్పణకు అర్థం కాలేదు.
అదే రోజు చివరి పీరియడ్ కూడా మ్యాథ్స్ సర్ క్లాస్​ రూమ్​లోకి రావడంతో పిల్లలంతా ‘మళ్లీ ఈ సారేనా?’ అనుకున్నారు. ఆయన రావడం అర్పణకు మాత్రం చాలా ఆనందాన్నిచ్చింది. ‘‘మీ సైన్స్ టీచర్ రాలేదు. ఈ పీరియడ్ కూడా నేనే తీసుకుంటా” అని చెప్పాడు. అర్పణ ముఖం వెలిగిపోయింది. మ్యాథ్స్​ని భూతంలా చూసే మిగతా స్టూడెంట్స్​ వెన్నెముకలు వంచి, బల్ల మీద మోచేతిని పెట్టి, అరచేతిని చెంప మీద ఉంచి, గోడ మీద ఉన్న బ్లాక్​బోర్డు వైపు తప్పదన్నట్లు చూడసాగారు. ఒక లెక్కను బ్లాక్​ బోర్డ్ మీద రాసి, ‘‘ఈ సమస్య సాల్వ్​ చేసిన వారిని హాస్టల్​కి తొందరగా పంపించేస్తా” అన్నాడు మ్యాథ్స్ సర్. ఎవరూ ఆ సమస్యని సాల్వ్​ చేయలేకపోయారు. చివరికి అర్పణ కూడా చేయలేక చేతులెత్తేసింది.
“మీరెవరూ ఈ లెక్క చేయలేకపోవడం నాకు కోపం తెప్పించడం లేదు. కానీ, మ్యాథ్స్​ని ఎంతో ఇష్టపడే అర్పణ ఈ సమస్యను సాల్వ్​ చేయలేకపోవడం నాకు కోపం తెప్పిస్తుంది” అని గుడ్లు పెద్దవి చేసి కోపంగా చూశాడు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి, ‘‘అందుకే... శిక్ష కూడా అర్పణ ఒక్కదానికే వేద్దామనుకుంటున్నా” అన్నాడు. 
క్లాస్​రూమ్​ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ‘‘అర్పణ తప్ప మిగతా వాళ్ళంతా హాస్టల్​కి వెళ్ళిపొండి” అన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు అర్పణకు.
సాయంత్రం 4:30... 4:50... 4:54..
అర్పణ క్లాస్​రూం డోర్​ తీసి బయటకు వచ్చింది. కళ్ళలో నీళ్లు గడ్డకట్టుకుపోయాయి. కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. కొంచెం వేగంగా వీచే గాలి శబ్దానికి కూడా తుఫాను వచ్చినంతగా భయపడుతోంది. కళ్ళు తెరిచే ఉన్నా ముందు ఏం జరుగుతుందో చూడలేకపోతోంది. మనసంతా మంచు ముద్దలా బిగుసుకుపోయింది. భయంతో గట్టిగా అరవాలి అనిపించింది. ముఖమంతా చెమటతో తడిసిపోయింది. వణుకుతున్న కాళ్ళతోనే నాలుగడుగులు ముందుకు వేసింది. ఐదో అడుగు వేసిందో లేదో మెట్ల మీద నుంచి జారి పడింది. తలకు గాయం అయి, రక్తం మడుగులో ఉన్న అర్పణను చూసిన అటెండర్ హాస్టల్ వార్డెన్​కు ఇన్ఫర్మేషన్​ ఇచ్చాడు.
*   *   *
‘‘ఏయ్... ఎవరికైనా చెప్పావా? ఎవరికైనా చెప్పావా? ఎవరికైనా చెప్పావో గొంతు పిసికి చంపేస్తా” అని ఒక కీచక గొంతు వినబడింది. అర్పణ ఉలిక్కిపడి నిద్రలేచింది. ఊపిరి సరిపోవడం లేదు. ఒళ్లంతా వణికిపోతోంది. చుట్టూ చూసింది. పిల్లలంతా పడుకుని ఉన్నారు. గోడలన్నీ దెయ్యాల్లా తన వైపు చూస్తూ భయంకరమైన చప్పుళ్ళు చేస్తున్నట్టు అనిపించింది. ఆమె గుండె చప్పుడే ఆమెని భయపెడుతోంది. కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. నరాలన్నీ బిగుసుకుపోయిన చేతులతో తల గట్టిగా పట్టుకుని బలవంతంగా కళ్లు మూసుకుంది. నెమ్మదిగా దుప్పటి దగ్గరకు తీసుకుని నిండా కప్పుకొని నిద్ర రాకపోయినా నిద్రపోయింది.
ఎందుకలా జరిగిందో అర్థం కాలేదు అర్పణకు. తనకే ఎందుకు అలా జరిగిందో తెలియదు. ఎవరితో చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? అన్న ప్రశ్నలు తనని గుండు సూదుల్లా గుచ్చని రోజు లేదు. ఆ ఘటనతో అర్పణ ఒక రకమైన అన్​సేఫ్​ కండిషన్​కి, లోన్లీనెస్​కు గురైంది. కాలం మారింది. కానీ, అర్పణ గాయం మాత్రం మానలేదు. ఆ దుర్ఘటన నీడలా వెంటాడుతూ అర్పణను తీవ్రమైన మనోవేదనకు గురిచేస్తూనే ఉంది.
*   *   *
అర్పణకు ఒక ఎమ్​.ఎన్​.సి. కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వర్క్​ ప్లేస్​లో కూడా ఆమె ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదు. తన పనేదో తను  చూసుకునేది. ‘తనొక ‘సైకో’ సర్​’ అని ఓ ఉద్యోగి వాళ్ల బాస్​తో చెప్పడం అర్పణ చెవిలో పడింది. కానీ, అది నిజమో... కాదో... ఆమెకే అర్థం కాలేదు. 
రాత్రి ఎనిమిది గంటలు. అర్పణ తన ఫ్లాట్​లో మంచం మీద కూర్చుని గోడ మీద ఉన్న పెయింటింగ్ ని చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. అంతలో కాలింగ్ బెల్ మోగింది. అర్పణకు గుండెలో పిడుగు పడినట్లు అనిపించింది. రిక్టరు స్కేలుకి కూడా అందనంత భూకంపం వచ్చినట్టు ఒళ్లంతా వణికిపోవడం మొదలైంది. వణుకుతూనే లేచి, కిటికీ పరదాలు మూసింది. బెడ్ రూమ్ తలుపులు వేసి, మంచం మీద కూర్చుంది. దుప్పటి దగ్గరకు తీసుకొని, ఒళ్ళంతా కప్పుకొని భయం భయంగా చుట్టూ చూసింది. వణుకుతున్న చేతులతో పక్క టేబుల్ మీద ఉన్న ఏదో టాబ్లెట్​ తీసుకుంది. చెయ్యి తగిలి నీళ్ళ బాటిల్ కింద పడిపోయింది. టాబ్లెట్​ వేసుకొని, నీళ్ళు తాగకుండానే నిద్ర పోయింది. ఉదయం అయింది.. ‘‘మేం మొన్నే పక్క ఫ్లాట్​లోకి వచ్చాం. పరిచయం చేసుకుందామని నిన్న రాత్రి కాలింగ్ బెల్ కొట్టా. మీరు రెస్పాండ్​ కాలేద”ని ఆఫీస్​కి వెళ్లేందుకు ఫ్లాట్​కి తాళం వేస్తున్న అర్పణతో మాట కలిపింది రమణి.
నవ్వీనవ్వనట్టు ఒక నవ్వు నవ్వి ‘‘నాకు ఆఫీస్​కి టైం అయింది. నేను వెళ్ళాలి” అని చెప్పి వెళ్ళిపోయింది అర్పణ. ఆమె మామూలవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఒంటరితనం, చుట్టుపక్కల వాళ్ల చేష్టలు, మాటలు, చూపులు ఆమెను మరింత అన్​సేఫ్​ కండిషన్​లోకి నెట్టేసేవి.
*   *   *
అర్పణ మానసిక పరిస్థితి ఎరిగిన సహోద్యోగి రక్షిత్ ‘‘నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా” అని చెప్పాడు. ఆ మాటలు విన్నా విననట్లే అక్కడి నుంచి వెళ్లిపోయింది అర్పణ. 
కొంతసేపటి తర్వాత ‘‘నీ నిర్ణయం ఏంటి?” అని అడిగిన రక్షిత్​తో ‘‘కొంతమంది నాకు పిచ్చి అంటారు. కొందరు లోక జ్ఞానం లేదంటారు. మరికొందరు సైకో అంటారు. నేను నీకు సరిపోను” అని తలదించుకుని చెప్పింది అర్పణ. 
తన చేతితో అర్పణ తల పైకి ఎత్తి కళ్ళలోకి చూస్తూ ‘‘నువ్వు ఎలా ఉన్నావో అలానే నాకు ఇష్టం. నువ్వు మానసికంగా బాగయ్యేందుకు నేను నీకు సాయపడతా” అని హామీ ఇచ్చాడు రక్షిత్. అతని మాటలతో అర్పణకు ధైర్యం వచ్చినట్లు అనిపించింది. ఇన్ని రోజులుగా ఒక్క ఫ్రెండ్​ కూడా లేని అర్పణకు ఒక్కసారిగా రక్షిత్ పెళ్లి చేసుకుంటానని అడిగేసరికి అన్నీ తనే అన్నట్లు కనిపించాడు. ఆ రోజు హాయిగా, మనసారా నవ్వింది. తరువాతి రోజే వాళ్ళు పెండ్లి చేసుకున్నారు. పెండ్లయిన తర్వాత ఆమె ముఖం వెలిగిపోయింది.
ఆఫీసులో కొలీగ్స్​ అర్పణతో మాటలు కలపడం, భోజనానికి పిలవడం లాంటివి చేశారు. ఇవన్నీ రక్షిత్​లోని అనుమానపు పిశాచిని నిద్రలేపాయి. ‘‘అర్పణా, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడింది చాలు. ఇక ఉద్యోగం మానేయ్” అన్నాడు రక్షిత్. ప్రేమతో చెప్తున్నాడు కదా అని ‘ఓకే’ అన్నది అర్పణ.
నా భార్య ఏం చేస్తుందో? ఎవరి కళ్ళు నా భార్య మీద ఉన్నాయో? అనే అనుమానపు ప్రశ్నలన్నీ అతన్ని మద్యానికి బానిస చేశాయి. ఒక్కోసారి ఆఫీసు నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాడు. వచ్చిన వెంటనే ఇల్లు మొత్తం అనుమానంగా వెతికేవాడు.
*   *   *
‘‘మేడమ్, సిలిండర్” అని తలుపు దగ్గర నిల్చున్నాడు హెచ్.పి. గ్యాస్ డెలివరీ అబ్బాయి. అర్పణ లోనికి రమ్మన్నట్టు చెయ్యి చూపించింది.
‘‘మేడమ్ మీ ఇంట్లో చాలా రోజుల నుంచి కాలింగ్ బెల్ పనిచేయట్లేదు” అన్నాడు. దానికి అర్పణ సమాధానం ఇవ్వలేదు. ఇంతలోనే రక్షిత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు.
‘‘అప్పుడే వచ్చావేంటి?’’ అంది అర్పణ.
‘‘ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు?’’
‘‘ఇలాంటి పని ఏదో చేస్తావని నాకు ముందే తెలుసు’’ అని ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ టై వదులు చేసుకొని, పక్కన ఉన్న కుర్చీని తన్ని, కోపంగా అరిచాడు రక్షిత్.
‘‘రక్షిత్ ఏం మాట్లాడుతున్నావ్? నువ్వు ఇలా ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. ఏ మనిషినీ నమ్మని మనస్తత్వం నాది. అలాంటి నేను నిన్ను నమ్మా. నిన్ను నమ్మినందుకు నాకు దొరికిన ప్రతిఫలం ఇదా?’’ అని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది.
అదే రోజు రాత్రి రక్షిత్ బాగా తాగి వచ్చాడు. ‘‘ఎక్కడున్నావే? నాకు తెలుసే నువ్వంత మంచిదానివి కాదని” అరిచాడు రక్షిత్. అర్పణను అనరాని మాటలని, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉన్న రక్షిత్​లోని మనిషి ఎప్పుడో చచ్చిపోయాడు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఆవేశంతో అర్పణ డైనింగ్​ టేబుల్​ మీద ఉన్న కత్తి తీసుకుని రక్షిత్​ కడుపులో మూడు పోట్లు పొడిచింది. అక్కడికక్కడే రక్షిత్ కుప్పకూలిపోయాడు.
ఫ్యాన్ తిరుగుతోంది. మెయిన్ డోర్ తెరిచే ఉంది. గాలి బయటి నుంచి గాబరాగా చూస్తోంది. చీకటి సాక్షిగా ఈ ఘటన జరిగిపోయింది. అర్పణ ఫ్లాట్ డోర్ తెరిచే ఉండటంతో పలకరిద్దామని లోపలికి తొంగిచూసింది పక్క ఫ్లాట్​ రమణి. ఇంట్లోకి చూసిన ఆమె భయంతో పెద్దగా కేక పెట్టింది. రమణి కేక విన్న ఆమె భర్త లోపలి నుండి పరిగెత్తుకుని వచ్చాడు. చూసేసరికి అర్పణ డెడ్​బాడీ రక్తం మడుగులో పడి ఉంది. క్షణాల్లో తేరుకుని 100 నెంబర్​కు డయల్​ చేశాడు. 
RBVRR, రాష్ట్ర పోలీసు అకాడెమీ, హైదరాబాద్.
ట్రైనీ పోలీసులంతా ఒక హాల్​లో కూర్చొని ఉన్నారు. ట్రైనీలను చూస్తూ ఒక సీనియర్ ట్రైనర్,  ‘‘ఈరోజు అంశం: కేస్ స్టడీ. అర్పణ అనే అమ్మాయి డెత్​ కొన్ని రోజుల పాటు క్రైం డిపార్ట్​మెంట్ పోలీసుల్ని కలవరపెట్టింది. ఈ  కేసు వివరాల్లోకి వెళ్తే, అర్పణ అనే అమ్మాయి ఆర్​.వి.ఆర్​. అపార్ట్​మెంట్​, ఫ్లాట్ నెం. 204లో తన భర్త రక్షిత్​ను చంపేసింది. డయల్100కు వచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీస్​లు వెళ్ళి చూస్తే అక్కడ అర్పణ మృతదేహం పడుంది” అని చెప్పి తరువాతి విషయం చెప్పేముందు ఒక నిమిషం మౌనంగా ఉన్నాడు సీనియర్ ట్రైనర్​.
అంతలో ‘‘సర్, ‘అర్పణ తన భర్తను చంపేసింది’ అని చెప్పారు. కానీ దొరికింది మాత్రం అర్పణ డెడ్​ బాడీ అంటున్నారు. మరి రక్షిత్ ఏమయ్యాడు? అసలు అర్పణను చంపింది ఎవరు?” అని ఓ ట్రైనీ అడిగాడు. 
‘‘లెట్​ మి ఎక్స్​ప్లెయిన్​. అసలు రక్షిత్ అనే వ్యక్తే లేడు. అర్పణ ‘బై పోలార్ డిజార్డర్​’తో బాధ పడుతున్న ఒక మానసిక రోగి” అని నిజాన్ని చెప్పేశాడు సీనియర్ ట్రైనర్​. అందరూ ఆశ్చర్యపోయారు.
‘‘అర్పణకు బైపోలార్ డిజార్డర్ ఉందని ఎలా కనిపెట్టారు సర్?’’ అని మరో ట్రైనీ ప్రశ్నించాడు. ‘‘అర్పణకు ‘నా’ అన్న వాళ్లెవరూ లేరు. తన ఫ్లాట్​లోకి రెండో వ్యక్తి ఎవ్వరూ రాలేదు. కానీ, అర్పణ చనిపోయిన రోజు ఉదయం హెచ్. పి. గ్యాస్ డెలివరీ అబ్బాయి ఫ్లాట్​కి వచ్చాడు. అతన్ని ఎంక్వైరీ చేస్తే... ‘ఆ రోజు అక్కడ రక్షిత్​ అనే వ్యక్తే లేడు. లేని వ్యక్తిని ఊహించుకొని మాట్లాడింది. రక్షిత్ ఆమెను అనుమానించాడని, బాధపడి గదిలోకి వెళ్ళిపోయింద’ని చెప్పాడు” అని కేసు గురించి వివరంగా చెప్పాడు సీనియర్​ ట్రైనర్​.

- పట్లూరి నర్సింహా రెడ్డి