ఏ జిల్లాలు ఏ పార్టీ వైపు.. కారుకు పోటీగా కమలం

ఏ జిల్లాలు ఏ పార్టీ వైపు.. కారుకు పోటీగా కమలం
  • కారుకు పోటీగా దూసుకొస్తున్న కమలం 
  • కాంగ్రెస్​ వైపే ఖమ్మం ప్రజలు    
  • ఎమ్మెల్యేల పనితీరుపై మెజారిటీ జిల్లాల్లో జనం నిరాశ

ఉమ్మడి పది జిల్లాల ప్రాతిపదికన చూస్తే.. కరీంనగర్, నిజామాబాద్​ జిల్లాల్లో ఎక్కువ మంది కేసీఆర్​ సర్కారు ఏడాది పాలనపై  సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా జిల్లాల్లో సర్కారు పనితీరు బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్​పై కరీంనగర్​ జిల్లాలో ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేయగా, మెదక్​ జిల్లాలోనూ మంచి టాక్​ వచ్చింది. మిగతా జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై జనం అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్​పై సంతృప్తితో ఉన్నామని చెప్పిన కరీంనగర్​ జనం.. పార్టీల విషయానికి వచ్చేసరికి బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలానికే ఓటు వేస్తామని ఆ జిల్లాలో ఎక్కువ మంది చెప్పారు. కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాల్లో కమలం పార్టీకి ఫస్ట్​ ప్లేస్​ కట్టబెట్టిన జనం.. మరికొన్ని జిల్లాల్లో బీజేపీకి రెండో స్థానం ఇచ్చారు.

ఆదిలాబాద్​ జిల్లా..

కమలంవైపే మొగ్గు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లావాసులు కేసీఆర్​ సర్కారు పనితీరుపై అంత సంతృప్తిగా లేరు. ఈ జిల్లాలో సర్కారు పనితీరు బాగోలేదన్నవారు45.6 శాతంకాగా.. 34. 2 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 20.2 శాతం మంది ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరుపైనా జిల్లా ప్రజలకు సంతృప్తి లేదని సర్వేలో తేలింది. 50శాతం మంది తమ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చెప్పగా.. 37.6 శాతం మాత్రమే బాగుందన్నారు. ఇక 12 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జిల్లా జనం, బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలం పార్టీకే ఓటేస్తామని 41 శాతం మంది చెప్పగా, టీఆర్ఎస్​కు ఓటేస్తామని 32.8 శాతం, కాంగ్రెస్​కు వేస్తామని 19 శాతం మంది చెప్పారు.

హైదరాబాద్ జిల్లా..

సెకండ్​ ప్లేస్​ కోసం బీజేపీ,కాంగ్రెస్​ ఢీ అంటే ఢీ

ప్రభుత్వ పనితీరుపై ఉమ్మడి హైదరాబాద్​ జిల్లా జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఏకంగా 53.68 శాతం మంది సర్కారు పనితీరు బాగోలేదని చెప్పారు. 35.8 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, 10.5 శాతం మంది ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. తమ ఎమ్మెల్యేల పనితీరుపైనా ఈ జిల్లా ప్రజలు నిరాశతో ఉన్నారు. ఏకంగా 54.2 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని చెప్పగా, 42.2శాతం బాగుందన్నారు. అయితే ఈ జిల్లాలో టీఆర్ఎస్​కు ఆదరణ తగ్గలేదు. ఎలక్షన్లొస్తే.. టీఆర్ఎస్​కే ఓటేస్తామని 38.3 శాతం మంది చెప్పారు. తర్వాతి స్థానంలో బీజేపీ (27.5%), కాంగ్రెస్​(25.5%) ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి, కాంగ్రెస్​నడుమ కొద్దితేడా మాత్రమే ఉంది.

కరీంనగర్​ జిల్లా..

సర్కారుకు సై.. బీజేపీకి జై

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో ఎక్కువ మంది ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు46 శాతం మంది టీఆర్ఎస్​ పాలన బాగుందనగా.. 39.87 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. ఈ తేడా 6 శాతంగా ఉంది. 14 శాతం మంది ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ఇక ఇక్కడి జనం మిగతా జిల్లాలకు భిన్నంగా ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 43 శాతం మంది తమ ఎమ్మెల్యేల పనితీరు బాగుందనగా.. 40.6 శాతం మంది సరిగా లేదన్నారు. ప్రభుత్వం, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్​పై సంతృప్తి వ్యక్తం చేసినా పార్టీపరంగా బీజేపీవైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటేస్తామని 42.2 శాతం చెప్పగా.. టీఆర్ఎస్​కు 36.4 శాతం, కాంగ్రెస్​కు 18.2 శాతం మంది ఓటేస్తామని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా..

అధికార పార్టీ హవా

టీఆర్ఎస్​ సర్కారు పనితీరుపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తీవ్ర నిరాశ కనిపించింది. ఇక్కడ ఏకంగా 47.6 శాతం మంది సర్కారు పనితీరు ఆశాజనకంగా లేదని చెప్పగా, 36 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 16.3 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. ఇక తమ ఎమ్మెల్యేల పనితీరుపై జనం నిరాశతో ఉన్నారు. 47.3 శాతం మంది తమ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చెప్పగా, 32.7 శాతం మాత్రమే బాగుందన్నారు. 20 శాతం మంది ఇప్పుడే చెప్పలేమన్నారు. పార్టీల విషయానికి వస్తే మాత్రం టీఆర్ఎస్​కే జనం జై కొడుతున్నారు. టీఆర్ఎస్​ కే ఓటేస్తామని సుమారు 40 శాతం మంది చెప్పగా, కాంగ్రెస్​వైపు 28 శాతం, బీజేపీ వైపు 24 .1శాతం మొగ్గుచూపారు. కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసం పోటీపడుతున్నాయి.

నల్గొండ జిల్లా

టీఆర్ఎస్, కాంగ్రెస్​ పోటాపోటీ

ప్రభుత్వ పనితీరుపై ఉమ్మడి నల్గొండ​జిల్లాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇక్కడ 50.5 శాతం మంది సర్కారు పనితీరు సరిగాలేదని చెప్పారు. 38.1 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా.. 11 శాతం మంది తాము ఏమీ చెప్పలేమన్నారు. తమ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ జిల్లా ప్రజలు సంతృప్తికరంగా లేరు. 55.5 శాతం మంది తమ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పగా, 32.2 శాతమే బాగుందన్నారు. 12 శాతం ఏమీ చెప్పలేమన్నారు. పార్టీల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్​కే జనం జై కొడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్​కే ఓటేస్తామని 44.9శాతం మంది చెప్పగా.. కాంగ్రెస్​వైపు 37.8 శాతం, బీజేపీ వైపు 16.3 శాతం మొగ్గు చూపారు.

ఖమ్మం జిల్లా..

కాంగ్రెస్​కే సలాం

ప్రభుత్వ పనితీరుపై ఉమ్మడి ఖమ్మం​ జిల్లాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ జిల్లాలో ఏకంగా 51.23 శాతం మంది సర్కారు పనితీరు బాగాలేదని చెప్పగా, 36.5 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 12 శాతం మంది ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. తమ ఎమ్మెల్యేల పనితీరుపైనా ఇక్కడి జనం తీవ్ర నిరాశతో ఉన్నారు. 52.4 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగాలేదని చెప్పగా.. 33.5 శాతం మంది బాగుందన్నారు. పార్టీల విషయానికి వస్తే ఖమ్మంలో కాంగ్రెస్​కే జనం జై కొడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాము కాంగ్రెస్​కే ఓటేస్తామని 40.8 శాతం మంది చెప్పగా.. టీఆర్ఎస్​ వైపు 33.4 శాతం, బీజేపీ వైపు 22.3 శాతం మంది మొగ్గుచూపారు. ఇక్కడ బీజేపీ మూడోస్థానానికి పరిమితమైంది.

మెదక్​ జిల్లా..

టీఆర్ఎస్​కు పోటీగా బీజేపీ

ప్రభుత్వ పనితీరుపై ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ అసంతృప్తి వ్యక్తమైంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఈ జిల్లాలో ఏకంగా 41.50 శాతం మంది సర్కారు పనితీరు బాగోలేదని చెప్పారు. 33.5 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా.. 25 శాతం మంది తాము ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారికంటే సంతృప్తిగా ఉన్నవారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది. 40.8 శాతం మంది తమ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చెప్పగా.. 41.8 శాతం మంది బాగుందన్నారు. పార్టీల విషయానికొస్తే ఉమ్మడి మెదక్​ జిల్లాలో టీఆర్ఎస్​కే జనాదరణ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్​కు ఓటేస్తామని 38 శాతం, బీజేపీకి వేస్తామని 32శాతం, కాంగ్రెస్​కు వేస్తామని 22 శాతం మంది చెప్పారు. ఇక్కడ టీఆర్ఎస్​కు బీజేపీ పోటీ ఇస్తుండగా.. కాంగ్రెస్​ మూడో స్థానానికి పరిమితమైంది.

మహబూబ్​నగర్​ జిల్లా..

బీజేపీకి స్వల్ప మొగ్గు

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లావాసులు ప్రభుత్వ పనితీరుపై అంత సంతృప్తిగా లేరు. ఈ జిల్లాలో సర్కారు పనితీరు బాగాలేదన్నవారు 51 శాతంకాగా.. సంతృప్తి వ్యక్తంచేసినవారు 38 శాతమే. 11 శాతం మంది ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరుపై భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. 45 శాతం మంది తమ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని చెప్పగా, దాదాపు సమానంగా 44.2 శాతం మంది మాత్రం పర్ఫార్మెన్స్​ బాగుందన్నారు. 11శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జిల్లా జనం బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలం పార్టీకి ఓటేస్తామని 36.5 శాతం మంది చెప్పగా, టీఆర్ఎస్​వైపు 35శాతం, కాంగ్రెస్​వైపు 27 శాతం నిలిచారు. ఇక్కడ బీజేపీకి స్వల్పంగా మొగ్గు కనిపిస్తోంది.

నిజామాబాద్​ జిల్లా

కారుకు కమలం నుంచి పోటీ

ఉమ్మడి నిజామాబాద్  జిల్లాలో ఎక్కువ మంది జనం ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 47 శాతం మంది సర్కారు పనితీరుపై సంతృప్తితో ఉండగా.. 40 శాతం మంది ఆశించిన స్థాయిలో లేదని, 13శాతం మంది ఏమీ చెప్పలేమని వెల్లడించారు. ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం అసంతృప్తి వ్యక్తమైంది. 42 శాతం మంది తమ ఎమ్మెల్యేల పనితీరు బాగుందనగా.. 48 శాతం మంది సరిగా పనిచేయడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జిల్లావాసులు, టీఆర్ఎస్​వైపే కాస్త మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్​కు ఓటేస్తామని 45 శాతం మంది చెప్పగా, బీజేపీకి ఓటేస్తామని 35 శాతం మంది అన్నారు. అధికార పార్టీకి బీజేపీ పోటీ ఇస్తోంది. కాంగ్రెస్​ మూడో స్థానానికే పరిమితమైంది. 15 శాతం మందే ఆ పార్టీ వైపు మొగ్గుచూపారు.

వరంగల్​ జిల్లా

టీఆర్ఎస్, కాంగ్రెస్​ ఢీ అంటే ఢీ

ఉమ్మడి వరంగల్​ జిల్లా జనం కేసీఆర్​ సర్కారు పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. 50 శాతం మంది సర్కారు పనితీరు బాగోలేదని చెప్పగా, 38.39 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 12 శాతం మంది చెప్పలేమన్నారు. తమ ఎమ్మెల్యేల పనితీరుపైనా ఇక్కడి వాళ్లు సంతృప్తికరంగా లేరు. 48.5 శాతం మంది తమ ఎమ్మెల్యేల పనితీరు బాలేదనగా.. 36.7 శాతం బాగుందని, 15 శాతం మంది ఇప్పుడే ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. పార్టీల విషయానికి వస్తే వరంగల్​జిల్లాలో టీఆర్ఎస్​వైపే జనం కొంత మొగ్గు చూపారు. ఎన్నికలొస్తే టీఆర్ఎస్​కే ఓటేస్తామని 39.3 శాతం మంది చెప్పగా.. కాంగ్రెస్​వైపు 32.8 శాతం, బీజేపీ వైపు 24.6 శాతం మంది మొగ్గుచూపారు.

కాళేశ్వరం పట్టని జనం

’పబ్లిక్ రిపోర్ట్‘ విశ్లేషణలో నచ్చిన, నచ్చని పథకాలను చెప్పిన జనం కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రం ప్రస్తావించకపోవడం విశేషం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుపై 50వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా, మొత్తం ఖర్చు లక్ష కోట్లు దాటనుంది. దీంతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సర్కారు చెబుతోంది. ఆర్నెల్ల కిందే ప్రాజెక్టు ప్రారంభించగా పనులు పూర్తికాకపోవడంతో వరద వచ్చిన కాలంలో పంపింగ్ సరిగా జరగలేదు. దీని ఫలితాలు ఇప్పటికే అందుతున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఎంత వరకు ప్రయోజనం అన్న దానిపై జనానికి ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సంతృప్తిగానీ, అసంతృప్తిగానీ జనం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.