గూడూరులో బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళన 

గూడూరులో బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళన 

గూడూరు, వెలుగు: ఉడకని అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం టిఫిన్ చేయకుండా హాస్టల్ గేటు ముందు బైఠాయించారు. ఎంపీ, ఎమ్మెల్యేల పిల్లలైతేనే మంచి భోజనం పెడతారా? అని ప్రశ్నించారు. ఈ పాఠశాలలో 480 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే హాస్టల్ లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీళ్ల చారు, ఉడకని అన్నం పెడుతున్నారని ఏటీడీఓ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. ‘‘స్టూడెంట్ల కోసం వచ్చిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని తన భర్త సాయంతో వార్డెన్ అమ్ముకున్నారు. వార్డెన్ భర్త అశోక్, ఆమె తమ్ముడు రాజు రాత్రి పూట హస్టల్​కు వస్తున్నారు. వాళ్లు ఎందుకు వస్తున్నారని అడిగితే.. ఈ విషయం బయటకు చెప్తే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిస్తున్నారు. వారంలో ఒక్క రోజే గుడ్డు, పండ్లు ఇస్తున్నారు. ఇందేందని అడిగితే.. తన భర్తతో కలిసి వార్డెన్ బెదిరిస్తోంది” అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు అన్నం తినమని ధర్నా కొనసాగించారు. ఆందోళన గురించి తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ వచ్చి స్టూడెంట్స్ తో  మాట్లాడారు. హాస్టల్ రికార్డులను పరిశీలించారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో అడిషనల్ కలెక్టర్ తో కలిసి స్టూడెంట్లు భోజనం చేశారు. వార్డెన్ పై కలెక్టర్ కు నివేదిక ఇచ్చి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ చెప్పారు.  

అనారోగ్యంతో టెన్త్ స్టూడెంట్ మృతి... మృతదేహంతో ఆసిఫాబాద్​లో ధర్నా

ఆసిఫాబాద్, వెలుగు: గిరిజన ఆశ్రమ పాఠశాల స్టూడెంట్ అనారోగ్యంతో మరణించిన ఘటన ఆసిఫాబాద్ ​జిల్లా పెంచికల్ పేట మండలం ఎల్లూరులో బుధవారం జరిగింది. పదో తరగతి చదువుతున్న రాజేశ్(15) జ్వరం, రక్తహీనతతో ఐదు రోజులుగా బాధపడుతున్నడు. రాజేశ్ కు జ్వరం వచ్చిందని, వెంటనే ఇంటికి తీసుకుపోవాలని హాస్టల్ సిబ్బంది శనివారం తల్లిదండ్రులు ఆలం మల్లయ్య, బిచ్చు బాయికి ఫోన్ చేసి చెప్పారు. మల్లయ్య ఆదివారం అతన్ని ఇంటికి తీసుకువెళ్లారు. జ్వరం తగ్గకపోవడంతో సోమవారం బెజ్జుర్ పీహెచ్ సీకి తీసుకెళ్లారు. పరిస్థితి సీరియస్​గా ఉండడంతో మంగళవారం కాగజ్ నగర్ లో ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. టెస్ట్​లు చేసిన డాక్టర్లు హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని.. రక్తం ఎక్కించారు. అయినా కోలుకోకపోవడంతో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించాలని సూచించారు. బుధవారం రాజేశ్​ను తీసుకెళ్తుండగా.. ఆసిఫాబాద్ దగ్గరకు రాగానే ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.స్టూడెంట్​మృతికి స్కూల్, హాస్టల్ సిబ్బంది, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మృతుని బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతదేహంతో జిల్లా ఆసుపత్రి ప్రధాన గేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్ రావాలని, రూ.15 లక్షల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీని కలెక్టరేట్ కు తరలించేందుకు సిద్ధమవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబేడ్కర్ చౌరస్తా వద్ద నేషనల్ హైవేపై రెండు గంటలు బైఠాయించారు. పోలీసులు వారిని చెదరగొట్టి.. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.