కేసులో కీలక అంశాలున్నయ్ లో తుగా విచారిస్తం : సుప్రీంకోర్టు

కేసులో కీలక అంశాలున్నయ్ లో తుగా విచారిస్తం : సుప్రీంకోర్టు
  • ఈడీ సమన్లపై కవిత పిటిషన్​లో సుప్రీంకోర్టు
  • విచారణ మూడు వారాలు వాయిదా
  • కవిత తరఫున కపిల్ సిబల్ వాదనలు 
  • ఈడీ తరఫు తుషార్​ మెహతా, ఎస్​వీ రాజు హాజరు

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ, సమన్ల నుంచి మినహాయింపు కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన రిట్​ను పెండింగ్​లో ఉన్న ఇదే తరహా కేసులకు సుప్రీంకోర్టు అటాచ్ చేసింది. ఇందులో చాలా కోర్ విషయాలు ఉన్నాయని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

ఇరు వర్గాలు తమ వాదనలు రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశిస్తూ కేసును మూడు వారాలు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్​లో ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ కవిత వేసిన రిట్​పిటిషన్ సోమవారం జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేల ఎం.త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్ ​లాయర్ కపిల్​ సిబల్​ వాదనలు వినిపించారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్​వీ రాజు వాదించారు.

మద్రాస్ ​హైకోర్టు గతంలోనే చెప్పింది

లిక్కర్ స్కామ్​ కేసులో నిందితురాలు కానప్పటికీ వ్యక్తిగతంగా హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని బెంచి దృష్టికి సిబల్ తీసుకెళ్లారు. అలాగే సీఆర్​పీసీ సెక్షన్ 160ని ఈడీ ఉల్లంఘించిందని అన్నారు. ఈ సెక్షన్ ప్రకారం మహిళను ఇంటి దగ్గరే విచారించాలని తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ రస్తోగి ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు గతంలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించిందని పేర్కొన్నారు. బెంచ్ వ్యాఖ్యలపై స్పందించిన ఈడీ తరఫు అడ్వకేట్ ఎస్​వీ రాజు.. మద్రాస్ హైకోర్టు అభిప్రాయాన్ని ఈ బెంచ్ తీర్పు పక్కన పెట్టేదిగా ఉండకూడదని అన్నారు.

మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50 అనేది విచారణకు మాత్రమేనని, దర్యాప్తు కోసం కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్ మదన్ లాల్ చౌదరి కేసుకు ముందు ఈ పరిస్థితి ఉత్పన్నం కాలేదన్నారు. అయితే మనీలాండరిగ్ కేసుల్లో సీఆర్​పీసీ సెక్షన్ 160 వర్తించదని ఈడీ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్​ చట్టం సెక్షన్ 50ని బెంచికి వివరించారు. దీని ప్రకారం ఎవరినైనా విచారణకు పిలిచే అధికారాలు ఈడీకి ఉన్నాయని అన్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో సమన్లు జారీ చేసేందుకు ఎలాంటి ప్రక్రియ లేదని సిబల్ వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న బెంచ్ సెక్షన్ 50(2) స్పష్టంగా ఉందని పేర్కొంది. అయితే అది ఎంక్వైరీ కోసం మాత్రమే అని సిబల్ వివరించారు. కానీ, తమకు దర్యాప్తు కోసం ఈడీ నుంచి సమన్లు వచ్చినట్లు చెప్పారు. మనీలాండరింగ్ చట్టం చాప్టర్ 8 లో కేవలం సాక్ష్యాధారాలు, డాక్యూమెంట్లు సమర్పించాలని మాత్రమే సమన్లు ఇచ్చే అధికారం ఉందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్.. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో ఈ పిటిషన్​ను జతచేసి విచారిస్తామని, అదే మంచిందని అభిప్రాయపడింది. జోక్యం చేసుకున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అభిషేక్ బెనర్జీ వ్యవహారాన్ని దీంతో ముడిపెట్టదని, అది వేరే అంశమని బెంచ్​ను కోరారు. ఇందుకు అంగీకరించిన బెంచ్​నళినీ చిదంబరం కేసుతో ట్యాగ్ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.