కొలీజియం సిఫార్సుల పెండింగ్‌పై సుప్రీంకోర్టు అభ్యంతరం

కొలీజియం సిఫార్సుల పెండింగ్‌పై సుప్రీంకోర్టు అభ్యంతరం

కేంద్ర ప్రభుత్వం కొలీజియం సిఫారసులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం చేసిన సిఫార్సులోలని పేర్లలో కేంద్ర ప్రభుత్వం కొంతమందిని మాత్రమే న్యాయమూర్తులుగా ఎంపిక చేసుకుంటోందని అభిప్రాయపడింది. ఈ విషయంలో కేంద్రం తీరు తమకు చాలా ఇబ్బందికరంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ సుధాన్షు ధూలియా ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది.

ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం చేసిన పలు సిఫార్సులను పెండింగ్‌లో పెట్టడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలపై కొలీజియం చేసిన సిఫార్సులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. 

ఈ విషయంలో తమ అభ్యంతరాలను, ఆందోళనలను మరోసారి అటార్నీ జనరల్‌ ముందుంచుతున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే చాలాసార్లు చెప్పామని..  కొంత మందిని నియమించి.. మరి కొంత మందిని ఆపేయడం వల్ల సీనియారిటీ మారిపోతోందని అభిప్రాయపడింది. కొన్నిసార్లు కొలీజియం సిఫార్సులకు వెంటనే ఆమోదం లభించడం సంతోషమే. కానీ మిగిలిన సమయాల్లో ఏరికోరి ఎంపికతో చాలా ఇబ్బంది కలుగుతోందని.. అటువంటివి జరగకూడదని సుప్రీకోర్టు చెప్పింది.  కేంద్రం వ్యవహార శైలిని చూసి సీనియర్‌ న్యాయవాదులు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడటం కూడా లేదని న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ సుధాన్షు ధూలియా ధర్మాసనం అభిప్రాయపడింది. 

హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీలను న్యాయ వ్యవస్థకు వదిలేయాలని, బదిలీలను వెంటనే ఆమోదించాలని సూచించింది. విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఏజీ వెంకటరమణి, పిటిషనరు తరఫున ప్రశాంత్‌ భూషణ్‌ హాజరయ్యారు. దీనిపై విచారణను నవంబర్‌ 20కి ధర్మాసనం వాయిదా వేసింది.