
- సుప్రీంకోర్టు కాన్సిట్యూషన్ బెంచ్ తీర్పు
- లక్ష్యాలను సాధించామా లేదా అనే విషయంతో సంబంధం లేదని కామెంట్
- నోట్ల రద్దును వ్యతిరేకించిన జస్టిస్ నాగరత్న.. మైనారిటీ తీర్పు
న్యూఢిల్లీ: ఆరేండ్ల కిందటి నోట్ల రద్దు వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రూ.1,000, రూ.500 నోట్ల డీమానిటైజేషన్ ప్రాసెస్‌లో ఎలాంటి లోపమూ లేదని స్పష్టం చేసింది. 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజారిటీ తీర్పుతో సమర్థించింది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి చట్టపరమైన, రాజ్యాంగ పరమైన లోపాలు లేవని, ఈ నిర్ణయం తీసుకునే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ), కేంద్ర ప్రభుత్వం మధ్య 6 నెలలపాటు సంప్రదింపులు జరిగాయని పేర్కొంది. కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకున్న ఎకనమిక్ పాలసీ నిర్ణయాన్ని మార్చలేమని, ఎకనమిక్ పాలసీకి సంబంధించిన విషయాలపై చాలా ఓపిక ఉండాలని జస్టిస్ ఎస్‌ఏ నజీర్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చెప్పుకొచ్చింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై సోమవారం తీర్పు చెప్పింది. డీమానిటైజేషన్‌పై 2016 నవంబర్ 8న ఇచ్చిన నోటిఫికేషన్.. అసమంజసమని చెప్పలేమమని, తీసుకున్న నిర్ణయం ఫలితం ఆధారంగా దాన్ని కొట్టివేయలేమని మెజారిటీ బెంచ్ పేర్కొంది. బ్లాక్ మనీ, టెర్రర్ ఫండింగ్‌కు అడ్డుకట్ట వేసే లక్ష్యాలతో కేంద్రం నిర్ణయం తీసుకుందని.. అయితే లక్ష్యాలను సాధించామా లేదా అనే విషయంతో సంబంధం లేదని వివరించింది. నోట్ల మార్పిడికి 52 రోజుల గడువు విధించడం సహేతుకమేనని, దాన్ని ఇప్పుడు పొడిగించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్ణీత వ్యవధి తర్వాత కూడా రద్దు చేసిన నోట్లను స్వీకరించడానికి ఆర్‌బీఐకి స్వతంత్ర అధికారం లేదని, ఈ విషయాన్ని తగిన బెంచ్ ముందుకు పంపేందుకు సీజేఐ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నామని చెప్పింది.
4:1 మెజారిటీ తీర్పు
నోట్ల రద్దును ఐదుగురు సభ్యుల బెంచ్‌లోని జడ్జిలు జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ సమర్థించారు. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం విభేదించారు.
చట్టవిరుద్ధం: జస్టిస్ నాగరత్న
బెంచ్‌లో అందరికంటే జూనియర్ అయిన జస్టిస్ నాగరత్న.. నోట్ల రద్దు తీవ్రమైన విషయమని, ఇది ఆర్థిక వ్యవస్థ, దేశ పౌరులపై ఎన్నో ప్రభావాలను చూపిందని చెప్పారు. 24 గంటల్లోనే మొత్తం కసరత్తు పూర్తి చేశారన్నారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దును చట్టం ద్వారా చేయాలి, నోటిఫికేషన్ ద్వారా కాదన్నారు. ‘నా దృష్టిలో.. నోటిఫికేషన్ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం ద్వారా తన అధికారాన్ని ఉపయోగించాలి. పార్లమెంటులో చర్చించి తర్వాత ఆమోదం తెలపడం అవసరం’’ అని జస్టిస్ నాగరత్న అన్నారు. పెద్ద నోట్ల రద్దు చట్టవిరుద్ధమని తన జడ్జిమెంట్‌లో పేర్కొన్నారు.
ఎప్పుడేం జరిగిందంటే..?
2016 నవంబర్ 8: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
2016 నవంబర్ 9: కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిల్.
2016 డిసెంబర్ 16: చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని బెంచ్.. కేంద్రం నిర్ణయం చెల్లుబాటు, ఇతర అంశాలపై విచారణ జరిపేందుకు ఐదుగురు జడ్జిల బెంచ్‌కు సిఫార్సు చేశారు.
2017 ఆగస్టు 25: కొత్త రూ.50, రూ.200 నోట్లను ఆర్బీఐ జారీ చేసింది.
2022 సెప్టెంబర్ 28: నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లన్నింటినీ విచారించేందుకు జస్టిస్ ఎస్‌ఏ నజీర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.
2022 డిసెంబర్ 7: తీర్పు రిజర్వు. 2016లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని కేంద్రం, ఆర్బీఐకి ఆదేశం.
2023 జనవరి 2: నోట్ల రద్దును సమర్థిస్తూ 4:1 మెజారిటీతో తీర్పు.