ఎల్జీబీటీక్యూ​ మ్యారేజెస్​పై వచ్చేనెల 15లోగా బదులివ్వండి

ఎల్జీబీటీక్యూ​ మ్యారేజెస్​పై వచ్చేనెల 15లోగా బదులివ్వండి

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పెళ్లిళ్లకు చట్టబద్ధమైన గుర్తింపును కల్పించాలని కోరుతూ వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను కలగలిపి  సుప్రీంకోర్టు ఇవాళ తనకే బదిలీ చేసుకుంది. సుప్రీంకోర్టు  చీఫ్​ జస్టిస్​ డి.వై.చంద్రచూడ్, జస్టిస్​ పి.ఎస్​.నరసింహ, జస్టిస్​ జె.బి.పార్దీవాలాలతో కూడిన బెంచ్​ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్లు అన్నింటిపైనా ఫిబ్రవరి 15లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్లపై తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. పిటిషనర్లలో ఎవరైనా నేరుగా హాజరయ్యే పరిస్థితి లేకుంటే.. వర్చువల్​ ప్లాట్​ఫామ్​ ద్వారా వాదనలు వినిపించవచ్చని బెంచ్​ సూచించింది.

ఒక్కచోటే విచారించాలి..

అంతకుముందు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్ల అంశంపై  ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ హైకోర్టులో ఇదే అంశంపై పిటిషన్​ పెండింగ్​లో ఉన్నందున.. అక్కడ తీర్పు వచ్చేవరకు వేచి చూడటం లేదా అటువంటి అన్ని పిటిషన్లను కలిపి తనకే బదిలీ చేసుకోవడం అని చెప్పారు. సీనియర్​ లాయర్ ముకుల్​ రోహత్గీ ఒక పిటిషనర్​ తరపున వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టులోనే వాదనలు వినాలని సూచించారు.

హైదరాబాదీ గే జంట పిటిషన్​ కూడా.. 

ఈ అంశంపై దాఖలైన పిటిషన్లలో హైదరాబాద్​లో నివసించే స్వలింగ సంపర్క జంట సుప్రియో చక్రవర్తి, అభయ్​ డాంగ్​ దాఖలు చేసిన పిటిషన్​ కూడా ఒకటి. ‘‘మేమిద్దరం గత పదేళ్లుగా కలిసి జీవిస్తున్నాం. అందరిలా మేం కూడా తొమ్మిదో వివాహ వార్షికోత్సవాన్ని చేసుకోలేకపోయాం. మా హక్కులను కాలరాశారు. వివాహానికి చట్టబద్దత లేకపోవడం వల్లే ఇలా జరిగింది” అని పిటిషన్​ లో వారు ఆరోపించారు.