మీరు గైడ్‌లైన్స్‌ తెచ్చేసరికి థర్డ్‌‌‌‌ వేవ్ వచ్చిపోతది

మీరు గైడ్‌లైన్స్‌ తెచ్చేసరికి థర్డ్‌‌‌‌ వేవ్ వచ్చిపోతది
  • కరోనా మృతుల ఫ్యామిలీలకు పరిహారంపై సుప్రీంకోర్టు
  • కేంద్రం గైడ్‌‌‌‌లైన్స్ రూపొందించకపోవడంపై అసహనం
  • ఉత్తర్వులు ఎందుకు అమలు  చేయడంలేదో చెప్పాలని ప్రశ్న

న్యూఢిల్లీ: కరోనాతో చనిపోయినోళ్ల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ రూపొందించేసరికి థర్డ్ వేవ్ వచ్చి పోతదని కామెంట్ చేసింది. ‘‘కరోనా డెత్ సర్టిఫికెట్, నష్టపరిహారం తదితర అంశాలపై గైడ్‌‌‌‌లైన్స్ రూపొందించాలని  మేం ఉత్తర్వులు ఇచ్చి చాలా కాలమైంది. మీరు తదుపరి చర్యలు తీసుకునే సరికి.. థర్డ్‌‌‌‌ వేవ్ కూడా పూర్తి అవుతుంది’’ అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్‌‌‌‌ అనిరుద్ధ బోస్‌‌‌‌తో కూడిన బెంచ్ చెప్పింది. ఈ నెల 11 లోపు అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించింది.
పరిశీలన సాకుతో ఆలస్యం
కరోనాతో చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని లాయర్లు రీపక్ కన్సల్, గౌరవ్ కుమార్ బన్సల్ పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన బెంచ్.. కరోనాతో చనిపోయినవాళ్ల ఫ్యామిలీలకు నష్టపరిహారం ఇవ్వాలని జూన్ 30న ఉత్తర్వులిచ్చింది.  అందుకు గైడ్​లైన్స్​ రూపొందించడానికి ఆగస్టు 16న కేంద్రానికి 4 వారాల పొడిగింపును మంజూరు చేసింది. అయితే పరిశీలన సాకుతో కేంద్రం ఆలస్యం చేస్తోందని పిటిషనర్లు చెబుతున్నారు. దీంతో తమ ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పరిశీలనలో ఉన్నాయని కేంద్ర తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఇచ్చిన గడువులోగా నిర్ణయం తీసుకోవాల్సిందని కోర్టు కామెంట్ చేసింది. విచారణ 13కు వాయిదా పడింది. 

కేరళలో 11వ తరగతి ఎగ్జాంలపై స్టే
కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున కేరళలో వచ్చే వారంలో జరగనున్న 11 వ తరగతి పరీక్షలు నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 6 నుంచి కేరళలో 11వ క్లాస్ పరీక్షలు నిర్వహించాలన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చింది. ఎగ్జామ్స్ ను వారంపాటు నిలిపివేయాలని చెప్పింది. ఎగ్జాంలు ఆపాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్ బెంచ్ శుక్రవారం విచారించింది. ‘దేశంలో 70 శాతానికి పైగా కేసులు ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్లను ప్రమాదంలో పడేయలేం’ అని బెంచ్ స్పష్టం చేసింది. విచారణను ఈ నెల13కు వాయిదా వేసింది.