రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవద్దు:సుప్రీంకోర్టు

రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవద్దు:సుప్రీంకోర్టు

MLAల కొనుగోలు కేసులో వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులపై జస్టిస్ గవాయి అసహనం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ నుంచి వస్తున్న కేసులన్నీ రాజకీయ పరమైనవేనన్నారు. తమ  రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేసుకోవడం సరికాదన్నారు.

సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై ఇవాళ విచారణ జరిగింది. నిందితుల బెయిల్  పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయని  ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ హక్కులను కాపాడుకునేందుకు నిందితులు హైకోర్టును ఆశ్రయించారని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు.ఈ కేసుపై విచారణను వచ్చే సుప్రీం సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు మొయినాబాద్ ఫాంహౌస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు వాదనలు వినిపించాయి. పిటిషనర్ కు అసలు పిటిషన్ వేసే అర్హత లేదన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఎమ్మెల్యేల కొనుగోలుతో పిటిషనర్ ప్రేమేందర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ముగ్గురు మధ్యవర్తులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలు వచ్చి డీల్ చేశారని.. ముగ్గురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. నిందితులపై పలు సెక్షన్స్ తో పాటు ప్రివెన్షన్ అఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయని తెలిపారు ఏఏజీ. FIRలో ఎక్కడా పిటిషనర్ పేరు లేదన్నారు. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పిటిషనరే చెపుతున్నాడని.. ఏం సంబంధంలేని బీజేపీ తరఫున పిటిషన్ ఎలా వేస్తాడని.. సీబీఐకి ఇవ్వమని ఎలా అడుగుతాడని కోర్టుకు తెలిపారు ఏఏజీ రామచందర్ రావు.

TRS పార్టీ పక్కా ప్లాన్ తోనే ఇదంతా చేసిందని బీజేపీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోలీసులు కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయటంలేదన్నారు.  కేసును సీబీఐ దర్యాప్తు చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. సీబీఐ కాకపోయినా సిట్టింగ్ జడ్జి తో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోర్టును కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు ప్రవర్తించిన తీరు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. మీడియా కు ముందే సమాచారం ఇచ్చారని.. అన్ని ప్రసార మధ్యమాల్లో ప్రచారాలు జరిగాయన్నారు. ఇదంతా ఒక డ్రామాలాగా ఉందన్నారు బీజేపీ తరఫు అడ్వకేట్. పోలీస్ కమిషనర్ స్పాట్ లోనే ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా కోట్ల రూపాయల డబ్బులు ప్రలోభాలు చూపారని చెప్పారని కోర్టుకు తెలిపారు. కేసును సీబీఐ తో దర్యాప్తు చెస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని తెలిపారు అడ్వకేట్.