సీఎంకు టీచర్‌‌‌‌ సంఘాల పోరాట కమిటీ బహిరంగ లేఖ 

సీఎంకు టీచర్‌‌‌‌ సంఘాల పోరాట కమిటీ బహిరంగ లేఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మన ఊరు – మన బడి, ఇంగ్లీష్‌‌ మీడియం ప్రోగామ్స్ సక్రమంగా అమలు కావాలంటే బడుల్లో టీచర్లు, పర్యవేక్షణ అధికారుల కొరత లేకుండా చూడాలని టీచర్‌‌‌‌ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌‌పీసీ) స్పష్టం చేసింది. ఇందుకోసం వెంటనే టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించి, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌‌ చేసింది. లేకపోతే దసరా సెలవుల్లో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరిస్తూ సీఎం కేసీఆర్‌‌‌‌కు బహిరంగ లేఖ రాసింది. శుక్రవారం హైదరాబాద్‌‌లో వివిధ టీచర్ యూనియన్ల నాయకులు జంగయ్య, చావ రవి, అశోక్ కుమార్, రవీందర్, రఘుశంకర్ రెడ్డి, లింగారెడ్డి, పోచయ్య, జాదవ్ వెంకట్రావ్, విజయ్ కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడారు. 2021 మార్చిలో టీచర్లకు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపడతామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. విద్యా శాఖ మంత్రి కూడా వేసవి సెలవుల్లో నిర్వహిస్తామని చెప్పారని, కానీ ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. జీవో 317తో నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్‌‌ చేశారు.

సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దు కోసం పింఛన్ విద్రోహ దినం నిర్వహిస్తామని తెలిపారు. దసరా సెలవుల్లో బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించాలని, లేకుంటే సెప్టెంబర్ 4న జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ స్పందించకుంటే సెప్టెంబర్ 11 నుంచి 23 వరకు హైదరాబాద్ ధర్నా చౌక్‌‌లో రాష్ట్ర స్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.