ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న.. తెలంగాణ జానపదం

ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న.. తెలంగాణ జానపదం

గత  కొంతకాలంగా వస్తున్న తెలంగాణ  జానపద  గీతాలు మనదేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు మొత్తం ప్రపంచ జానపద సంగీత ప్రేమికుల ఆదరణ పొందుతున్నాయి.  ఇటీవల హైదరాబాదులో ముగిసిన మిస్ వరల్డ్  పోటీలో సైతం పాల్గొన్న వివిధ దేశాల కంటెస్టెంట్లు 'రాను బొంబాయికి రాను' అనే పాటకు  నృత్యం చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించింది.  

ఒకవిధంగా చెప్పాలంటే, తెలంగాణ జానపద పాటల స్థాయి లోకల్ నుంచి  గ్లోబల్ స్థాయికి ఎదిగిందని  చెప్పవచ్చు.  తెలంగాణ ఫోక్ సాంగ్స్ చాలా లోతైనభావంతో , అద్భుతమైన వాయిస్ తో  వినసొంపుగా మనసుకు ఏదో తెలియని కొత్త అనుభూతిని కలిగేలా చేస్తున్నాయి.  గత  రెండు మూడుఏళ్ళుగా వెలువడుతున్న జానపద గీతాల్లో దాదాపు 10 జానపద పాటలు  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి.  

ఒక్కొక్క పాటకు ఒక కోటి నుంచి  మూడు కోట్ల వరకు వ్యూస్ రావడం ద్వారా చరిత్ర సృష్టించాయి.  ఇటీవలి ఏ ప్రపంచ ప్రముఖ గాయకుల పాటలకు  ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్ రాకపోవడం గమనార్హం.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఏవిధంగానైతే జానపద కళారంగం ఉపయోగపడిందో, దానికి కొనసాగింపుగా, ఇటీవలికాలంలో వస్తున్న అద్భుతమైన జానపద పాటలు, జానపదాల్లో ప్రయోగాలు, సాహిత్యం ప్రజలను ప్రధానంగా భాషలకు అతీతంగా సంగీత ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. తద్వారా, కొత్త కొత్త రచయితలు, సంగీతకారులు, గాయకులు, కళాకారులు ప్రపంచానికి పరిచయమవుతున్నారు.  తెలంగాణలో అద్భుతమైన టాలెంట్ బయటికి వస్తోంది.

అద్దాలా మేడలున్నయే...

‘అద్దాలా మేడలున్నయే... మేడల్లో మంచి చీరలున్నయే, చీరంచూ రేకలున్నయే... రాను, నేను రాను.. బొంబయికి రానూ' అనే పాట ఇటీవల ట్రెండింగ్ అయినట్టుగా మరే పాట కాలేదు.  ప్రభ, రాము రాథోడ్  పాడిన ఈ పాటను రాము  రాథోడ్ రాయగా,  కళ్యాణ్ కీస్ సంగీత దర్శకత్వం చేశాడు.  తెలంగాణ పాటను తారస్థాయికి తీసుకెళ్లిన పాట ఇది.  ఈ పాటకు  మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న పలుదేశాల అందాల భామలు కూడా డాన్స్ చేశారు. 

‘థా ఆటి బెల్లం.. థ అయిదరొట్టె,.. మల్లెనోడొస్తావ్  తక్కయెరా,  భా ఆదాపడకు, బెన్ గ పడకూ,,, ఇట్లపోయి ఆటొస్తనే' అనే పాట అద్భుత  తెలుగు ప్రయోగం..!  తెలంగాణ యాసలో ఊర్లు తిరుగుతుంటే  అనుభూతి ఉంటుంది. నల్గొండ జిల్లా ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన జానపద గీతాలు పాడే ఎనమల్ల దేవకమ్మ పాడిన ఈ పాటను నూకరాజు ప్రపంచానికి పరిచయం చేశాడు. వెంకట్ అజ్మీరా సంగీతం అందించారు. 

 ‘దారి పంటత్తుండు' 

‘దారి పంటత్తుండు' అనే పాట ఇప్పటికీ చూస్తే అదే ఎనర్జిటిక్​గా ఉంటుంది. దీనిలో  ఎస్.కె. మదీన,  మౌనిక వాయిస్,  నాగదుర్గ డాన్స్ హైలైట్​గా  చెప్పవచ్చు.  నాగుపాము కోపం,  జెర్రిపోతు పిరికితనంలాంటి పదాలతో రాసిన ఈ పాట కట్టిపడేస్తుంది. ప్రతి కుటుంబంలో ఈ పాటపై  డాన్స్ చేయడం ఇటీవల కన్పిస్తోంది.  'ఓ పిల్లో మౌనికో.. సొట్టబుగ్గల సింగారి' అనే పాటను జాటోతు వీరేందర్ నాయక్ పాడగా,  సిందూరం రమేష్ రచన, రవి కళ్యాణ్ సంగీత దర్శకత్వం వహించారు.  ఇది ఫుల్ ట్రెండింగ్​లో ఉంది.  

జానపద కళారంగాన్ని ప్రోత్సహించాలి

 ‘ఎర్రా ఎర్ర  రుమాళ్ గట్టి'  అనే పాట  యువతను  ఉర్రూతలూగించింది.  దీనిని రాజేందర్ కొండా రచించగా,  మల్లమ్మ అద్భుతంగా పాడారు. ఇటీవల జానపద గీతాల్లో అద్భుతంగా నృత్యం చేస్తున్న నాగదుర్గ ఈ పాటలో చేసిన డాన్స్ హైలెట్ గాఉంది.  అద్భుతమైన  కొరియోగ్రాఫ్ ఈ పాట డీజేలో మోగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణ జానపద కళారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినవిధంగా ప్రోత్సహించి..  తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేయాలి.  

-కన్నెకంటి 
వెంకటరమణ