మునిగిన భగీరథ ఇన్​టేక్​ వెల్స్

మునిగిన భగీరథ ఇన్​టేక్​ వెల్స్

భద్రాచలం,వెలుగు : చుట్టూ వరద నీరు.. ఇండ్లలో బియ్యం, బట్టలు, సామగ్రి తడిసిపోయి అల్లాడుతున్న భద్రాచలం వాసులకు సర్కారు కనీసం గుక్కెడు తాగునీరు సైతం  అందించలేకపోతోంది. ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకున్న మిషన్​భగీరథ  స్కీం మొత్తం వరదలో మునిగిపోవడంతో ఆ నీళ్లు తాగవద్దని ఆఫీసర్లే చెప్తున్నారు. దీంతో వరద ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు నీటి కోసం జనం క్యాన్లు పట్టుకొని మినరల్​వాటర్​ప్లాంట్ల వైపు పరుగు తీస్తున్నారు.

మునిగిన భగీరథ ఇన్​టేక్​ వెల్స్
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకున్న భగీరథ స్కీమ్​కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.2,250 కోట్లు ఖర్చు చేశారు. వాజేడు మండలంలోని పూసూరు, చర్ల మండలంలోని పర్ణశాల, అశ్వాపురం మండలంలోని పాములపల్లిలో ఇన్​టేక్​వెల్స్ నిర్మించారు. ఇటీవల గోదావరికి వరదలు వచ్చి, నీటిమట్టం 71.30 అడుగులకు చేరగానే ఇన్​టేక్​వెల్స్ అన్నీ ఒక్కొక్కటిగా నీటిలో మునిగిపోయాయి. వీటితో పాటు భద్రాచలం పట్టణంలోని మిషన్​భగీరథ ట్యాంకులు, నల్లాలు ముంపునకు గురయ్యాయి. మంచినీటి బోర్లు సైతం నీట మునగడంతో చేతి పంపుల్లోనూ బురదనీళ్లే వస్తున్నాయి. దీంతో వరదలు తగ్గే దాకా భగీరథ నీళ్లు, బోర్​వాటర్​ తాగవద్దని ఆధికారులే ప్రచారం చేస్తున్నారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తామన్న ప్రభుత్వం..  వరదల టైమ్​లో చేతులెత్తేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కొన్ని చోట్ల ఆఫీసర్లు ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేస్తున్నా రోగాల భయంతో అడ్డగోలుగా బ్లీచింగ్​పౌడర్​ కలుపుతున్నారు. వాటిని తాగలేకపోతున్న వరద బాధితులు ప్రైవేట్​వాటర్​ప్లాంట్ల వైపు మొగ్గుతున్నారు. ఇదే అదనుగా  ప్లాంట్ల ఓనర్లు ఎడాపెడా రేట్లు పెంచేశారు.  

డబ్బా రూ.20
వాటర్​ప్లాంట్లలో  20 లీటర్ల డబ్బా ఇంతకుముందు రూ.10కి సప్లై చేయగా.. రూ.15 కు డోర్ డెలివరీ చేసేవారు. భగీరథ వాటర్​ సప్లై కాకపోవడం, ట్యాంకర్​ ద్వారా వచ్చే నీళ్లను జనాలు తాగేందుకు వెనుకాడడంతో వాటర్​ క్యాన్​ రేట్లను వ్యాపారులు డబుల్​ చేశారు. ప్లాంటు దగ్గర క్యాన్​కు రూ.20 వసూలు చేస్తున్నారు. ఇంటికి తెచ్చిచ్చేందుకు రూ.25 వసూలు చేస్తున్నారు. ప్రజల భయాన్ని ఆసరా చేసుకుని ప్లాంట్ల యజమానులు అడ్డగోలుగా రేట్లు పెంచారు. సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. 

దోచుకుంటున్నారు
వరదలకు మా ఊర్లో ఇండ్లన్నీ మునిగాయి. వారం రోజులుగా తాగునీరే రావడం లేదు. వాటర్​ ప్లాంట్​ వారు రూ.20 లీటర్ల డబ్బాకు రూ.25 తీసుకుంటున్నారు. తప్పనిసరై వాటర్​ క్యాన్లు కొని తాగుతున్నం.
- నరెడ్ల ప్రభాకర్​, కుదునూరు, చర్ల

వేడి చేసి తాగొచ్చు 
మిషన్​భగీరథ నీళ్లను వేడి చేసుకుని తాగొచ్చు. పాములపల్లి, పూసూరు ఇన్​టేక్​ వెల్స్ సీఈ, ఎస్ఈ దగ్గరుండి బాగు చేయించారు. హైదరాబాద్​ నుంచి నిపుణులు వచ్చి పర్ణశాల ఇన్​టేక్​ వెల్​ను రిపేర్​ చేశారు.  దీంతో చర్ల వైపు సప్లై ప్రారంభించాం. దుమ్ముగూడెం వైపు త్వరలో నీళ్లు ఇస్తాం. భగీరథ వాటర్​ను వేడి చేసి తాగితే ఇబ్బందేమీ ఉండదు. నల్లాలు, పైపులు మునిగిన చోట్ల మాత్రమే ఈ నీటిని ప్రస్తుతానికి వినియోగించవద్దు.
- శ్రీనివాస్​, డీఈ, మిషన్​భగీరథ