ఎల్ఆర్ఎస్ రద్దయ్యేదాకా కొట్లాడ్తం

ఎల్ఆర్ఎస్ రద్దయ్యేదాకా కొట్లాడ్తం
  • ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లనూ రిజిస్ట్రేషన్ చేయాలె
  • ఇది 25 లక్షల కుటుంబాల సమస్య: నారగోని ప్రవీణ్ కుమార్
  • నేటి నుంచి ఆందోళనలు:రియల్టర్స్ అసోసియేషన్

హైదరాబాద్, వెలుగుపేదలు, మిడిల్ క్లాస్ ప్రజలకు, రియల్టర్లకు పెను భారంగా మారిన ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసేంత వరకూ తమ ఉద్యమం ఆగదని తెలంగాణ రియల్టర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు నారగోని  ప్రవీణ్​ కుమార్ ​రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లనూ రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం తెలంగాణ రియల్టర్స్​ అసోసియేషన్​ రాష్ట్రస్థాయి సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) అనేది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్య మాత్రమే కాదని, ఇది రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాల సమస్య అని ఆయన చెప్పారు. ఎల్ఆర్ఎస్ రద్దు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రియల్టర్లకు పిలుపునిచ్చారు. నాయకులు పార్టీలకతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. అసోసియేషన్​వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నర్సయ్య మాట్లాడుతూ.. ఏ పార్టీకీ తాము సపోర్ట్ చేయడం లేదని, కేవలం ఎల్ఆర్ఎస్ రద్దు కోసమే ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయించలేమా? అని ప్రశ్నించారు. త్వరలో అన్ని మండలాలు, జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశానికి వివిధ జిల్లాలకు చెందిన రియల్టర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎల్ఆర్ఎస్ పోరు ఇట్లా..

ఎల్ఆర్ఎస్​ రద్దు కోసం రియల్టర్స్​ అసోసియేషన్ ​దశలవారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆదివారం అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి మద్దతు కోరాలని, 21న గవర్నర్, సీఎంకు పోస్టుకార్డులు పంపాలని, 22న భిక్షాటన, 24న వంటా వార్పు, 26న ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి, వినతి పత్రాలు, 28న కలెక్టరేట్ల ముట్టడి, 29న హైవేల దిగ్బంధం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించకుంటే జనవరి 2 నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ల ఎదుట రిలే నిరాహారదీక్షలు ప్రారంభించాలని తీర్మానించారు.