మొక్కలు నాటడానికి చెట్లు నరుకుతున్నరు!

 మొక్కలు నాటడానికి చెట్లు నరుకుతున్నరు!
  • పర్మిషన్​ ఇచ్చిన కలెక్టర్, డీఎఫ్ఓ
  • ఉపాధి స్కీమ్​ కింద జేసీబీ, ట్రాక్టర్లతో పనులు 
  • జయశంకర్​భూపాలపల్లిలో అధికారుల వింత పనులు 
  • విలేజ్​ పార్కుల కోసం అడవులపై పడ్డ ఆఫీసర్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి, కాటారం, వెలుగు : ఓ వైపు హరితహారం పేరుతో కోట్లాది రూపా యలు ఖర్చు చేసి మొక్కలను పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరో వైపు బృహత్ పల్లె ప్రకృతి వనాల పేరుతో పచ్చగా ఉన్న అడవులను నరికేస్తోంది. మొక్కలు పెంచడం కోసం ఏకంగా వృక్షాలనే కొట్టేస్తోంది. పల్లె ప్రకృతి వనాల పనులంటూ జేసీబీలు, ట్రాక్టర్ ​డోజర్ల సాయంతో ఉపాధి హామీ పథకం కింద అటవీ భూములను చదును చేయిస్తోంది. ఏపుగా పెరిగిన చెట్లను కొట్టేసి కాలవెట్టిస్తోంది. ఈ వింత భూపాలపల్లి జిల్లాలో జరుగుతోంది. రోడ్లు వెడల్పు చేయడానికి పది, ఇరవై గజాల స్థలం ఇవ్వాలని కోరితే సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ అనుమతులు తీసుకోవాలంటూ ఏండ్లకు ఏండ్లు ఫైల్స్‌‌ పక్కన పెట్టే ఫారెస్ట్‌‌ అధికారులు..గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల కోసం ఎకరాలకు, ఎకరాల భూమిని కొట్టి చదును చేయడానికి అనుమతులివ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

రెవెన్యూ భూములు లేకనేనట! 
కాటారం, మహాదేవపూర్ మండలాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ఆయా మండలాల్లో రెవెన్యూ భూములు లేవంటూ అధికారులు అడవులపై పడ్డారు. అయితే అక్కడ పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు ఉండడంతో మొక్కలు నాటడానికి ఇబ్బంది అవుతుందని భావించారు. వాటిని కొట్టి వేయడానికి ప్రత్యేకంగా నిధులను కూడా మంజూరు చేయించుకున్నారు. ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి అటవీ శాఖను అనుమతులు కోరగా, సదరు డిపార్ట్​మెంట్​ కూడా భూములు అప్పజెప్పి చెట్లను నరుక్కోమని పర్మిషన్​ ఇచ్చేసింది. దీంతో కాటారం మండలంలోని ఐదు గ్రామ పంచాయతీల పరిధిలోని అడవుల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. మేడిపల్లి శివారులో నేషనల్‌‌ హైవే రోడ్డును ఆనుకుని ఉన్న  ఐదెకరాల్లో, జాదురావుపేట, దామెరకుంట, ప్రతాపగిరి, కొత్తపల్లి గ్రామాల పరిధిలోని 2 ఎకరాల్లో  ఫారెస్ట్‌‌ భూములను చదును చేస్తున్నారు. ఈ మండలంలో పల్లె ప్రకృతి వనాల కోసం రూ. కోటి 34 లక్షలు కేటాయించగా,  ఇప్పటి వరకు రూ.29.13 లక్షలు ఖర్చు చేశారు. మహదేవపూర్ మండలంలోని మహదేవపూర్, కాళేశ్వరం, అంబటిపల్లి, సూరారం, బొమ్మపూర్ గ్రామాల్లో కూడా ఫారెస్ట్ ల్యాండ్ లోనే పల్లె ప్రకృతి వనాల పనులు చేస్తున్నారు. ఒక్క మహదేవపూర్ లోనే 10 ఎకరాల్లో రూ.కోటి వెచ్చించి పనులు చేస్తున్నారు.   

ప్రభుత్వమే నరికేస్తే..
గ్రామాల్లో పార్కులను ఏర్పాటు చేసి చెట్లను పెంచి అక్కడ ప్రజలు ఆహ్లాదంగా గడిపేలా చేయాలన్నది బృహత్ పల్లె ప్రకృతి వనాల ముఖ్య ఉద్దేశ్యం. ఇందులోనే  జనాలు నడవడానికి వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ భూపాలపల్లి జిల్లాలోని అటవీ మండలాల్లో దీనికి విరుద్దంగా జరుగుతోంది. దశాబ్దాలుగా పెరుగుతున్న చెట్లను,   వృక్షాలను కొట్టేసి, కాల్చి బూడిద చేస్తున్నారు. ఎవరైనా చెట్లు లేని చోట మొక్కలు నాటి మరింత పచ్చదనం పెంపొందేలా చేస్తారు. కానీ అధికారులు మాత్రం పచ్చగా పెరిగిన చెట్లను తొలగించి కొత్తగా మొక్కలు పెట్టాలని ప్లాన్​ చేస్తున్నారు. పైగా చెట్లను కొట్టివేయడానికి, అడవులను చదును చేయడానికి ఉపాధి హామీ పథకం కింద పనులు చేయించడం మరొక విచిత్రం. ఉపాధి హామీ పథకం లక్ష్యం ఏమిటంటే...మిషనరీ వాడకుండా మనుషులతో పని చేయించి వారికి ఉపాధి కల్పించడం. కానీ, పనుల్లో జేసీబీ, డోజర్లను ఉపయోగిస్తూ ఆ పథకాన్ని కూడా నీరుగారుస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల పేరిట స్వయంగా ప్రభుత్వమే అడవులను నరికేస్తుండటంతో దీనిని అదనుగా భావించిన కొందరు అడవులను కొట్టి వ్యవసాయ భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.