లాక్ డౌన్ లో సడలింపులు

లాక్ డౌన్ లో సడలింపులు
  • నిత్యావసరాలు, కూరగాయల షాపులకు ఆంక్షలు ఉండవు!
  • మాల్స్​, టాకీస్​లు, పార్కులు బంద్​
  • వారం పదిరోజులు ఇట్లనే.. తర్వాత నైట్​ కర్ఫ్యూ మాత్రమే
  • నేడు రాష్ట్ర కేబినెట్​లో నిర్ణయం తీసుకునే చాన్స్​
  • యాసంగి వడ్ల కొనుగోళ్లు, వానకాలం సీజన్‌ యాక్షన్‌ ప్లాన్‌పైనా చర్చ

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్​ దిశగా అడుగులు వేస్తోంది. జనం గుమిగూడేవి తప్ప మిగతావన్నీ ఓపెన్​ చేయాలని ఆలోచిస్తున్నది. పండ్లు, కూరగాయలు, కిరాణా షాపులకు ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని, వాటిని పొద్దంతా తెరిచి ఉంచేందుకు ఓకే చెప్పాలనుకుంటున్నది. మాల్స్​, సిన్మా టాకీసులు, రెస్టారెంట్లు, గేమింగ్​ జోన్లు, పబ్బులు, పార్కులు, క్లబ్​ హౌస్​ల వంటి వాటిని బంద్​ పెట్టేందుకు మొగ్గుచూపుతున్నది. ఇలాంటి సడలింపులు వారం పదిరోజులు కొనసాగించి, ఆ తర్వాత నైట్​ కర్ఫ్యూను మాత్రమే విధించాలని భావిస్తోంది. రాష్ట్రంలో 19 రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఆదివారం అర్ధరాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో  ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్​ సమావేశమై లాక్​డౌన్​పై చర్చించి వేటికి సడలింపులు ఇవ్వాలన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. ట్రాన్స్​పోర్టుపై కూడా క్లారిటీ ఇవ్వనుంది. ఇన్నిరోజుల లాక్​డౌన్​ కారణంగా కరోనా పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ అవసరం లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లోనూ అన్‌లాక్‌ ప్రక్రియ మొదలు పెట్టడంతో రాష్ట్ర సర్కారు ఈ దిశగానే అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది.  రాష్ట్రంలో తొలుత పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ఈ నెల 11న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే మినహాయింపునిచ్చి మిగతా 20 గంటలు లాక్‌డౌన్‌ పెట్టారు. 

లాక్​డౌన్​ను ఇంకో తొమ్మిది రోజులు (మే 30 వరకు)  పొడిగిస్తున్నట్లు ఈ నెల 18న ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం నాలుగు గంటలే సడలింపులు ఉండటంతో ఆ టైంలో జనం ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. ఆ నాలుగు గంటలు మార్కెట్లు, వీధులు అన్నీ జనంతో నిండిపోతున్నాయి. దీంతో పొద్దంతా నిత్యావసరాలు, కూరగాయలు అమ్మే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా లాక్‌‌డౌన్‌‌ విధించే రోజుతో పోలిస్తే  రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, కొన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞాపనలు వస్తున్నాయి. 

వడ్ల కొనుగోళ్లపై చర్చ

యాసంగి వడ్ల కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా కొనుగోళ్లు ముంగించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. గన్నీ సంచుల కొరత, మిల్లర్ల కొర్రీలతో గ్రౌండ్​ లెవల్​లో అనేక సమస్యలున్నాయి. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి, కొనుగోళ్లు పూర్తి చేయడంపై కేబినెట్‌‌ ఆదేశాలు ఇవ్వనుంది. మంగళవారం నుంచి వానాకాలం సీజన్‌‌ ప్రారంభమవుతుంది. ఇప్పటికే రోహిణి కార్తె మొదలు కావడంతో రైతులు పునాస పనుల్లో నిమగ్నమయ్యారు. ఒకటి, రెండు వర్షాలు కురిస్తే పత్తి, మొక్కజొన్న, ఇతర విత్తనాలు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. కొందరు రైతులు వరినార్లు కూడా పోసుకున్నారు. లాక్‌‌డౌన్‌‌ కారణంగా వానాకాలం సీజన్‌‌కు అవసరమైన ఎరువుల సరఫరా సవ్యంగా సాగడం లేదు. వర్షాలు పడితే రైతులు ఎరువుల కోసం పీఏసీఎస్‌‌లు, ఫర్టిలైజర్లకు రావడం మొదలు పెడతారు. ఒక్కసారిగా డిమాండ్‌‌ పెరిగితే ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా కేబినెట్‌‌లో చర్చించనున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచడం, నకిలీ విత్తనాలు అమ్మకుండా కట్టడి చేయడంపైనా చర్చించనున్నారు. పలు ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల అంచనాల పెంపు ప్రతిపాదనల సైతం కేబినెట్‌‌ సమావేశంలో పరిశీలించి, వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు.