తెలంగాణ ఆదివాసీ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర కన్నుల పండువగా సాగుతోంది. శివసత్తుల పూనకాలు, కోయల డప్పు చప్పుళ్లు, కోట్లాది మంది భక్తుల మొక్కులు, ఆటపాటల నడుమ కన్నెపల్లి నుంచి సమ్మక్క బిడ్డ సారలమ్మ మేడారం గద్దెపైకి చేరుకుంది. ముఖాన ఎర్రటి ముసుగులు, ప్రత్యేక వేషధారణలో ఎత్తిన తలను దించకుండా లయబద్దంగా అడుగులు వేసుకుంటూ సారలమ్మను తీసుకొచ్చిన పూజారులను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు.
పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా పూజారులు గద్దెపైకి చేర్చారు. మేడారం జాతరలో అద్భుత సన్నివేశంగా చెప్పుకునే సమ్మక్క ఇవాళ గద్దెల పైకి రానుంది. ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు, వడ్డెలు మేడారం సమీపంలో ఉన్న సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్కను తీసుకొచ్చేందుకు వెళ్తారు. భక్తులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతుండగా... సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో గద్దెల దగ్గరకు తెచ్చి ప్రతిష్టిస్తారు పూజారులు. తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వన దేవతలు నలుగురు గద్దెలపైకి చేరడంతో గురువారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో భక్తులు మేడారం వచ్చి అమ్మలను దర్శించుకుంటారు.
మహా జాతర ప్రారంభం కావడంతో మేడారం ప్రాంతంలోని జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్, కన్నెపల్లి, రెడ్డిగూడెం, ఊరట్టం పరిసర ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. పుణ్య స్నానాలతో జంపన్న వాగు జనంతో కిక్కిరిసిపోయింది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెత్తాయి. మేడారం దారులన్నీ వాహనాలు, భక్తులతో నిండిపోయాయి.
మరిన్ని వార్తల కోసం
