
మెదక్/పాపన్నపేట, వెలుగు : ఏడుపాయలలోని వనదుర్గా భవాని ఆలయం జాతరకు ముస్తాబైంది. మహా శివరాత్రి పర్వదినమైన శనివారం నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంబరాలు జరుగనున్నాయి. జాతరను స్టేట్ఫెస్టివల్గా నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం తరపున జిల్లా మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి జాతర ప్రారంభించనున్నారు. ఈసారి జాతరకు 8 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్ ఆధ్వర్యంలో ఎండోమెంట్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, పోలీస్, మెడికల్ అండ్హెల్త్, ఇరిగేషన్, ఫిషరీస్తదితర డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 62 మంది ఎస్సైలు, 121 మంది ఏఎస్సైలు, 324 మంది కానిస్టేబుళ్లు, 232 మంది హోంగార్డులు, రెండు స్పెషల్ పార్టీలతో కలిపి మొత్తం 860 మందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆరు చోట్ల మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. 12 మంది డాక్టర్లు, 38 మంది పారామెడికల్స్టాఫ్ ను నియమించారు. మూడు 108 అంబులెన్స్‌లు, ఒక 102 అంబులెన్స్ అందుబాటులో ఉంచుతున్నారు. 150 మంది గజ ఈతగాళ్లను, 22 తెప్పలు, ఒక బోటు సిద్ధంగా ఉంచుతున్నారు. 650 మంది పారిశుధ్య కార్మికులను, 200 మంది సూపర్వైజర్లను నియమించారు. 10 చోట్ల షవర్లు, నాలుగు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయల వరకు 135 ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది.
జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ, సౌకర్యాల కల్పన, ఇబ్బందులు తలెత్తితే తీర్చేందుకుగాను 80 మంది రెవెన్యూ సిబ్బందితోపాటు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మెదక్, తూప్రాన్ మున్సిపల్ కమిషనర్లకు కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా జాతరపై శుక్రవారం కలెక్టర్, ఎస్పీ వేర్వేరుగా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. శుక్రవారం రాత్రి అడిషనల్ కలెకర్లతో కలిసి కలెక్టర్ ఆలయం వద్ద జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శోభాయమానంగా అలంకరణ
జాతర నేపథ్యంలో వనదుర్గా మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంబాన్ని రంగురంగుల పువ్వులతో ఆకర్షణీయంగా అలంకరించారు. అలాగే ఆలయానికి వెళ్లే మార్గాల్లో ఆకట్టుకునే కమాన్లు ఏర్పాటు చేశారు. శివరాత్రి రోజు జాగరణ చేయనున్న భక్తుల కోసం ఐ అండ్ పీఆర్ఆధ్వర్యంలో కల్చరర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు.