
- రెండో ఫేజ్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
- దేశంలో 42 వేలు దాటిన కేసులు.. 1,391 మంది మృతి
- ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,676 మందికి పాజిటివ్
- అయినా జనం ఇబ్బందులను చూసి సడలింపులిచ్చిన సర్కార్
- ప్రజలూ బాధ్యతగా ఉండాల్సిందే అంటున్న డాక్టర్లు
మూడో లాక్డౌన్ సోమవారం మొదలైంది.. కరోనాపై పోరాటంలో కొత్త ఫేజ్ ఇది.. అయితే ఈ దశ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా పెద్ద చాలెంజ్. చాకచక్యంగా ఎదుర్కోవాల్సిన చాలెంజ్. మొదట్లో పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పట్లో వందల్లో కేసులు.. ఇప్పుడు వేలు. అయినా సరే ప్రజలు పడుతున్న ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని సర్కార్ కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా బయటకు వచ్చే జనం రూల్స్ పాటించేలా చూస్తూ… కరోనానూ కంట్రోల్ చేయాల్సిన చాలెంజ్ ప్రభుత్వానిది. 40 రోజులు ఇండ్లలోనే గడిపి మళ్లీ స్వేచ్చా ప్రపంచంలోకి వస్తున్న ప్రజలకు కూడా ఇది చాలెంజే. ఒక పక్క పనులు చేసుకుంటూనే మరోపక్క కరోనా అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైమ్ ఇది.
న్యూఢిల్లీ: కరోనా మన దేశంలో ఎంటరైన రోజుకూ ఈ రోజుకూ చాలా తేడా ఉంది. రెండు లాక్డౌన్లు పెట్టినా కూడా వైరస్ విస్తరిస్తూనే ఉంది. ఫస్ట్ లాక్డౌన్ ప్రకటించినప్పుడు దేశంలో కరోనా కేసులు అంతగా లేవు. లాక్డౌన్ మొదలైన మార్చి 25వ తేదీ నాటికి నమోదైన మొత్తం కేసులు 657, మరణాలు 11. ఫస్ట్ ఫేజ్ పూర్తయిన ఏప్రిల్ 14 నాటికి 21 రోజుల్లో కేసుల సంఖ్య 11,485, మరణాలు 396కి పెరిగింది. ఈ టైంలో రోజూ సగటున 515 కేసుల చొప్పున మొత్తం 10,914 కేసులు, సగటున 18 మరణాలతో 386 మరణాలు రికార్డయ్యాయి. సెకండ్లాక్డౌన్ మొదలైన ఏప్రిల్ 15న 12,371 కేసులున్నాయి. అది పూర్తయ్యే నాటికి ఈ 19 రోజుల్లో కేసులు భారీగా పెరిగిపోయాయి. 42,505 మంది కరోనా బారినపడ్డారు. ఈ టైంలో 31,020 మందికి పాజిటివ్ వచ్చింది. సగటున రోజూ 1,632 కేసులు నమోదయ్యాయంటేనే సెకండ్ ఫేజ్‌లో పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సెకండ్ లాక్డౌన్ మొదలైన తర్వాతి రోజు నుంచి రోజూ వెయ్యికిపైగానే కేసులు నమోదయ్యాయి. ఈ రెండు మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రోజూ 2 వేల మందికిపైగా కరోనా బారిన పడ్డారు. ఇలాంటి టైంలోనే కేంద్ర ప్రభుత్వం మూడో లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అదే టైంలో ఎకానమీని, సామాన్యుడి బతుకును గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో కొన్ని సడలింపులూ ఇచ్చింది. అది మంచి నిర్ణయమే అయినా కేసులు పెరుగుతున్న ఈ టైంలోనే సడలింపులివ్వడమన్నది అటు ప్రభుత్వానికి, ఇటు జనానికి అసలు సిసలైన సవాల్. దానిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అలాగని మొత్తం బాధ్యత ప్రభుత్వం మీదే వదిలేయడం కరెక్ట్ కాదు. జనాలు బాధ్యతగా ఉండి కరోనా కట్టడికి తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముంబై, పుణేల్లో సడలింపుల్లేవ్
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మహారాష్ట్ర సర్కార్ సడలింపులస్తోంది. లిక్కర్ షాపులు, నాన్ ఎసెన్షియల్ సామాన్లు అమ్ముకునేందుకు ఓకే చెప్పింది. కొన్ని రెడ్ జోన్ జిల్లాల్లోని నాన్కంటెయిన్మెంట్ ఏరియాల్లో కూడా అన్ని పనులు చేసుకోవచ్చని సర్కార్ ఉత్తర్వులిచ్చింది. అయితే, పరిస్థితి తీవ్రంగా ఉన్నా ముంబై, పుణేల్లో మాత్రం ఎలాంటి సడలింపులుండవని తేల్చి చెప్పింది. నిత్యావసరాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఇళ్లలో పనిచేసే వాళ్లకూ అనుమతి ఉండబోదని చెప్పింది.
గుజరాత్లో కఠినంగానే
రెడ్జోన్లలోనూ అవసరమైన మేరకు సడలింపులివ్వొచ్చని కేంద్ర సర్కార్ సూచించినా, గుజరాత్ మాత్రం నో అంటోంది. హాట్స్పాట్లుగా మారిన ఆరు సిటీల్లో ఎలాంటి మినహాయింపులుండబోవని తేల్చి చెప్పింది. రెడ్ జోన్లలోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్, భావ్‌నగర్, ఆరెంజ్ జోన్లో ఉన్న రాజ్‌కోట్‌లలో సడలింపులుండవని సీఎం విజయ్‌రూపానీ ప్రకటించారు. రెండు వారాల పాటు ఇప్పుడున్న రూల్సే వర్తిస్తాయన్నారు.
లిక్కర్ షాపులు ఓపెన్
నాన్కంటెయిన్మెంట్ జోన్లలో లిక్కర్ షాపులను ఓపెన్ చేసేందుకు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, కర్నాటక, ఈశాన్య రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. నాన్కంటెయిన్మెంట్ జోన్లలోని స్వతంత్రంగా ఉన్న లిక్కర్ షాపుల వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులను కర్నాటక సర్కార్ ఆదేశించింది. కేంద్ర సర్కారు గైడ్‌లైన్స్‌కు తగ్గట్టు ఇప్పటికే అక్కడ షాపు ఓనర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యూపీలో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల దాకా వైన్ షాపులు తెరవొచ్చని హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లలో మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అమ్మకూడదని పేర్కొంది. ఏపీ కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు టైం పెట్టింది. ధరలను 25% పెంచింది. హర్యానా కూడా మందుపై ‘కొవిడ్ సెస్’ వేయాలని నిర్ణయించింది. కరోనాతో సతమతమవుతున్న ప్రాంతాలకు అండగా నిలిచేందుకు ఈ సెస్ వేయాలనుకుంటున్నట్టు రాష్ట్ర డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా తెలిపారు. లిక్కర్ షాపులకు ఓకే చెప్పిన రాజస్థాన్ సర్కార్, పాన్, గుట్కా, టొబాకో ఉత్పత్తులపై మాత్రం రాష్ట్రమంతటా నిషేధం విధించింది.
మరణాల రేటులో మనం బెటరే
మరణాల రేటు విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం చాలా మంచి పొజిషన్లోనే ఉన్నాం. ఇండియాలో డెత్ రేట్ కేవలం 3.3 శాతమే. కేసులను బాగా కట్టడి చేయగలిగిన సౌత్‌కొరియాలో 2.3 శాతంగా ఉంది. రష్యాలో డెత్ రేట్ ఒక శాతమే అయినా, కేసులు ఎక్కువగా ఉండడంతో మరణాలు పెరిగే అవకాశం ఉంది. ఈ జాబితాలో 15.7 శాతంతో బెల్జియం ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, 15.4 శాతంతో బ్రిటన్ రెండో ప్లేస్‌లో ఉంది. ఫ్రాన్స్‌లో 14.7%, ఇటలీల 13.6, స్పెయిన్ 11.5, అమెరికా 5.9, చైనాలో 5.5 శాతంగా డెత్‌రేట్ ఉంది.
ప్రభుత్వం ఏం చేయాలి?
లాక్డౌన్ 3లో సర్కార్ సడలింపులు ఇచ్చినా దానికి తగ్గట్టు కఠినమైన రూల్స్ పెట్టింది కేంద్ర సర్కార్. వాటి అమలు జనాలు, కంపెనీల చేతుల్లోనే ఉంది. అయినా సర్కార్ చేయాల్సిన పనులూ ఇంకొన్ని ఉన్నాయి.
- టెస్టుల సంఖ్యను వీలైనంత ఎక్కువగా పెంచాలి.
- కరోనా పాజిటివ్ వ్యక్తులను కలిసినోళ్లను గుర్తించాలి.
- ట్రీట్మెంట్కు ఆస్పత్రుల్లో అవసరమైన వసతులు కల్పించాలి.
- కరోనా లక్షణాలున్నవాళ్లలో భయం పోగొట్టి భరోసా పెంచాలి.
- రాకపోకలపై వీలైనంత వరకు ఆంక్షలు పెట్టాలి.
- వలస కూలీల తరలింపులో జాగ్రత్తలు పాటించాలి.
- హాట్స్పాట్లు, కంటెయిన్మెంట్ జోన్లలో నిఘాను కట్టుదిట్టం చేయాలి.
- సామాన్య జనానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి.
- కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
- వీధులు, రోడ్లు, ఆఫీసులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి.
- కరోనా మందులు, వ్యాక్సిన్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలి.
మనం ఏం చేయాలి?
- లాక్డౌన్ సడలింపులు వచ్చాయి కదా అని ఎక్కువగా బయటకు రావొద్దు.
- అవసరమైతేనే బయటకు రావాలి. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండడం మంచిది.
- బయటకు వచ్చినప్పుడు ఎడమెడం ఉండాలి.
- సర్కార్ పెట్టిన రూల్స్‌ను తప్పకుండా పాటించాలి.
- మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి.
- ఆఫీసుల్లో ఫిజికల్ డిస్టెన్స్‌ను పాటించాలి. తరచూ చేతులను కడుక్కోవాలి.
- పరిశుభ్రంగా ఉండాలి. ఇంటిని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
- కరోనా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే భయపడకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇంట్లో వాళ్లకు దూరంగా ఉండాలి.
- కరోనా సోకినోళ్లను నేరస్తులుగా చూడొద్దు. వాళ్లకు అండగా ఉండాలి.
- ఆరోగ్యవంతమైన ఫుడ్డు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పెరిగేందుకు విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి.
- వైన్ షాపుల దగ్గర దూరం పాటించాలి. షాపు దగ్గర ఐదుగురుంటే కొంచెం దూరంగా నిలబడాలి. వాళ్ల వంతు అయిపోయేదాకా వేచి చూడాలి. వీలైతే మందు ముట్టుకోకుండా ఉండడమే మంచిది.