ముగిసిన పులుల గణన.. ఆరు రోజులపాటు కొనసాగిన ప్రక్రియ.. రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..

ముగిసిన పులుల గణన.. ఆరు రోజులపాటు కొనసాగిన ప్రక్రియ.. రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నాయంటే..
  • 994 పులులు, 552 శాకాహార జంతువుల ఆనవాళ్లు గుర్తింపు 
  • ఎంస్ట్రైప్స్ యాప్‌లో వివ‌రాల న‌మోదు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అటవీ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పులుల గణన (ఆలిండియా టైగర్  ఎస్టిమేషన్–2026) విజయవంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 19 నుంచి 25 వరకు ఆరు రోజులపాటు అటవీ సిబ్బంది, వాలంటీర్లు ఫారెస్ట్​లో సర్వే చేపట్టారు. అయితే, సమ్మక్క–సారలమ్మ జాతర ఉండడంతో ములుగు జిల్లాలో గణన చేయలేదు. మిగిలిన జిల్లాల్లోని అన్ని బీట్‌లలో ఈ సర్వేను శాస్త్రీయ పద్ధతిలో పూర్తి చేశారు. 

దాదాపు 6 వేల మందికి పైగా వన్యప్రాణుల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పులులు, ఇతర మాంసాహార జంతువుల ఉనికికి సంబంధించి 994 ఆనవాళ్లు లభించాయి. అలాగే, 552 పెద్ద శాకాహార జంతువులకు సంబంధించిన ఆధారాలను గుర్తించారు. 15 కిలోమీటర్ల మేర కార్నివోర్ సైన్ సర్వే, రోజుకు 2 కిలోమీటర్ల ట్రాన్సెక్ట్ సర్వే నిర్వహించి అటవీ వృక్షజాలం, జంతువుల సాంద్రతను అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో సేకరించిన డేటాను ఎప్పటికప్పుడు ‘ఎం స్ట్రైప్స్’ యాప్‌లో నమోదు చేసి, వైల్డ్ లైఫ్  ఇన్‌స్టిట్యూట్  ఆఫ్  ఇండియా రిమోట్ సర్వర్‌కు అప్‌లోడ్  చేశారు. 

ఈ మెగా సర్వేలో మొత్తం 4,512 మంది అటవీ శాఖ సిబ్బందితో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చిన 1,677 మంది వలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అడవిలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లెక్క తప్పకూడదని సమన్వయంతో పనిచేశారు. కాగా, సర్వే సమయంలో కొన్ని విషాదాలు చోటుచేసుకున్నాయి. విధి నిర్వహణలో ఉన్న ఓ అటవీ వాచర్  గుండెపోటుతో మరణించగా.. మరొకరిపై ఎలుగు బంటి దాడి చేయడంతో గాయపడ్డారు.