బిగ్‌బాస్ హౌస్‌లో ఉత్సాహంగా రెండో రోజు బొమ్మల పోటీ 

బిగ్‌బాస్ హౌస్‌లో ఉత్సాహంగా రెండో రోజు బొమ్మల పోటీ 

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో బొమ్మల పోటీ రెండో రోజు కూడా కొనసాగింది. కొందరు ముందు రోజే ఓడిపోయి డల్‌ అయితే.. కొందరు మాత్రం రెండో రోజు హుషారు తెచ్చుకుని జోష్ గా గేమ్ ఆడారు. కిడ్నాప్ లు, దొంగతనాలతో బిగ్‌బాస్ హౌస్‌లో నానా హంగామా చేశారు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ ఎంటర్‌‌టైనింగ్‌గానే సాగింది. 

టిట్ ఫర్ టాట్
నిర్లక్ష్యం చేసిన బొమ్మలను తీసుకెళ్లి తాను కేటాయించిన ప్లేస్‌లో పెట్టమని బిగ్‌బాస్ చెప్పాడో లేదో.. చెప్పలేనంత జోష్ వచ్చేసింది గీతూకి. మొదటిరోజు టపటపా అందరి బొమ్మలూ ఎత్తుకెళ్లే పనిలో మునిగిపోయింది. రాత్రి కూడా నిద్రపోకుండా అందరి మీద ఓ కన్నేసి ఉంచింది. కానీ, తన బొమ్మ విషయంలో మాత్రం బోల్తా పడింది. తెలివిగా బట్టలు, పేరు తీసేసి తన డాల్‌ని స్టోర్ రూమ్‌లో దాచిపెట్టింది. పొరపాటున ఎవరైనా దాన్ని కనిపెట్టేస్తే.. బట్టలు, పేరు లేవు కాబట్టి అది తనది కాదని వాదించొచ్చు, వేరే ఎవరి బొమ్మనైనా తీసుకుని దానికి తన బొమ్మ బట్టలు వేసి పేరు తగిలించేయొచ్చు అనేది గీతూ ప్లాన్. కానీ, ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. సింగర్ రేవంత్ స్టోర్‌‌ రూమ్‌కి వెళ్లినప్పుడు ఆ బొమ్మను కనిపెట్టి ఎత్తుకుపోయాడు. దాంతో బాలాదిత్యతో బేరం కుదుర్చుకుని అతని బొమ్మకి తన బొమ్మ బట్టలు తొడిగేసింది గీతూ. అన్నింట్లో సిన్సియర్‌‌గా ఉండే బాలాదిత్య ఇలా ఎందుకు చేశాడోనని మొదట డౌట్ వచ్చింది. కానీ, అతను వెంటనే దాన్ని సరిచేసుకుని తన బొమ్మని తాను తీసేసుకున్నాడు. దాంతో గీతూ గేమ్ నుంచి ఔట్ అయ్యింది. ఇక శ్రీహాన్ కూడా తొండి ఆట ఆడాడు. గట్టిగా పట్టుకుని నిద్రపోతున్నా కూడా అర్జున్ బొమ్మని తెలివిగా కొట్టేశాడు. అది ఫెయిర్ గేమ్ కాదంటూ అర్జున్ ఖండించాడు. శ్రీహాన్ లైట్ తీసుకున్నాడు.

రింగులో కింగ్
నెక్స్ట్ కెప్టెన్సీ పోటీదారుణ్ని సెలెక్ట్ చేయడానికి రింగులో కింగ్ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. అక్కడున్న పెద్ద రింగులోకి ముందు ఇద్దరు వెళ్లాలి. చేతులతో కాకుండా ప్యాడ్ సాయంతో అవతలి వారిని రింగు బయటకు నెట్టాలి. బజర్ మోగినప్పుడల్లా ఒక్కొక్కరు యాడ్ అవుతుంటారు. చివరికి ఎవరు రింగులో మిగులుతారో వాళ్లే విజేత. ముందుగా ఆరోహి, ఫైమా బరిలోకి దిగారు. వాళ్లింకా పోటీపడుతూ ఉండగానే కీర్తి వచ్చింది. ఆ తర్వాత ఇనయా, అర్జున్ తోడయ్యారు. అమ్మాయిలంతా కలిసి అర్జున్‌ని బయటకు తోసేశారు. ఫైమా తరచూ కింద కూర్చుండిపోవడం, ఎంత చెప్పినా చేతులను ఉపయోగించి ఆడుతూ ఉండటంతో ఆమెని డిస్‌క్వాలిఫై చేశాడు సంచాలకుడు రేవంత్. ఆపైన ఆరోహి వెళ్లిపోయింది. మిగిలిన కీర్తి, ఇనయా గట్టిగానే పోటీ పడ్డారు. అయితే.. కిందపడి లేస్తున్న కీర్తిని ఇనయా వెనక నుంచి తోసేయడంతో ఆమె కూడా బయటకు వెళ్లిపోయింది. అది తప్పని చెప్పబోతే ఇది నా స్ట్రాటజీ, నా గేమ్ అంటూ సమర్థించుకోబోయింది. కానీ, ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. కీర్తిని మళ్లీ పంపారు. కానీ.. అప్పటికే చాలాసేపటి నుంచి ఆడుతున్న కీర్తికి అనుకోకుండా నొప్పి రావడంతో ఇక ఆడలేక గేమ్ నుంచి తప్పుకుంది. దాంతో ఇనయా గెలిచినట్టయ్యింది. అందరూ కింద కూర్చుండిపోతున్నా.. తనని మాత్రం రేవంత్ పదే పదే హెచ్చరించాడని, కావాలనే తనని డిస్‌క్వాలిఫై చేశాడని ఫైమా అతడిని ఆడిపోసుకుంది. గత టాస్క్ లో తాను చేసినదానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంది. 

ఐస్‌క్రీమ్‌ విన్నర్స్
ఆ తర్వాత మరో టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఐస్‌క్రీమ్ కోన్స్ ఉన్నాయి. వాటి మీద రంగు రంగుల స్కూప్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద చూపించిన రీతిలో ఆ స్కూప్స్ ను అమర్చాలి. ఎవరు ముందుగా అరేంజ్ చేసి బెల్ కొడుతారో వాళ్లే విన్నర్. ఇది రెండు రౌండ్స్ లో జరుగుతుంది. మొదటి రౌండ్‌లో రాజ్‌ గెలిచాడు. రెండో రౌండ్‌లో సూర్య గెలిచాడు. అయితే రాజ్ గెలుపు ఫెయిర్‌‌గా లేదంటూ ఓ చిన్న చర్చ మొదలైంది. దాంతో రాజ్ కంగారు పడ్డాడు. తన డ్యూటీలో ఏదైనా పొరపాటు జరిగిందా అంటూ సంచాలకురాలు ఇనయా వాపోయింది. అలాంటిదేంలేదని, అంతా బాగానే ఉందని ఆరోహి చెప్పడంతో వాళ్లిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరికి కెప్టెన్సీ టాస్క్ లో చలాకీ చంటి, ఇనయా, రాజ్, సూర్యలు విజేతలుగా నిలిచారు.

రేవంత్ తీర్పులు.. ఆరోహి అరుపులు
ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి జడ్జ్ చేస్తూ, ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్పాలని రేవంత్ ప్రయత్నిస్తుంటాడు. అది బెడిసికొట్టి తిరిగి అతనికే చుట్టుకుంటూ ఉంటోంది. రింగులో పోటీ పడటం గురించి కీర్తి, ఆరోహి, వాసంతి, షానీలతో డిస్కషన్ పెట్టాడు. అమ్మాయిలందరూ కలిసి అర్జున్‌ని బయటకు పంపేయాలి అనే ఇనీసియేషన్ తీసుకోవడం బాగుందని ఆరోహిని మెచ్చుకుంటూ.. కావాలని మనమంతా అతన్ని పంపేద్దాం అన్నట్టు కాకుండా అని ఏదో చెప్పబోతుంగానే ఆరోహి అడ్డుపడిపోయింది. నేనెప్పుడు అలా అన్నాను అంటూ గొడవ మొదలెట్టింది. నువ్వన్నావని నేను అనలేదు, నేను చెప్పేది వేరు, పూర్తిగా విను అంటూ రేవంత్ ఎంత మొత్తుకున్నా ఆమె వినలేదు. తనపై నింద వేస్తున్నాడంటూ అరవడం మొదలుపెట్టింది. అతనా మాట అనలేదని షానీ కూడా చెబుతున్నా వినే పరిస్థితుల్లో లేదామె. ఎప్పటిలానే అవతలివాళ్ల ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా తన మానాన తను ఆవేశపడిపోయింది. వాసంతి కూడా ఓ సందర్భంలో రేవంత్‌ని తప్పుబట్టింది. తాను చాలా స్ట్రాంగ్‌ అంటూ వేరే కంటెస్టెంట్‌ గురించి కావాలని తన దగ్గర కామెంట్ చేస్తున్నాడంటూ వేరే వాళ్లతో చెబుతోంది. నిజానికి రేవంత్ చేస్తున్నదానిలో తప్పు లేని చోట కూడా అతనిని రాంగ్‌గా ప్రూవ్ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఇప్పటికే వ్యూయర్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. వాటిలో ఎంతో కొంత నిజం ఉందేమోనని ఈరోజు జరిగిన వాటిని బట్టి అనిపిస్తోంది.

ఏదేమైతేనేం.. సిసింద్రీ టాస్క్ ముగిసింది. బొమ్మలన్నీ స్టోర్ రూమ్‌కి చేరుకున్నాయి. తన భార్యని, పుట్టబోయే బిడ్డని తలచుకుని రేవంత్ మరోసారి ఎమోషనల్ అవ్వడంతో చంటి ఓదార్చాడు. తన బేబీని స్టోర్ రూమ్‌లో పెట్టేటప్పుడు దాన్ని వదల్లేకపోతున్నానంటూ ఆరోహి కాసేపు మెలోడ్రామా చేసింది. మొత్తానికి పోటీలూ పోరాటాలతో బుధవారం ఎపిసోడ్ ముగిసింది. ఇవాళ్టి ఎపిసోడ్ ఎమోషనల్‌గా ఉండబోతోందని ప్రోమో ద్వారా హింట్ అందింది. బేబీస్‌ టాస్క్ ఆడి ఉన్నారు కనుక తమ లైఫ్‌లోని బేబీస్‌ గురించి షేర్ చేసుకోమన్నారో ఏమో. సుదీప, కీర్తి తమ బ్యాడ్ ఎక్స్ పీరియెన్సెస్‌ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.. !