బుల్లెట్ స్పీడ్తో మిల్లెట్స్ సాగు.. మిల్లెట్స్ సాగులో తెలంగాణకు పదో స్థానం

బుల్లెట్ స్పీడ్తో మిల్లెట్స్ సాగు.. మిల్లెట్స్ సాగులో తెలంగాణకు పదో స్థానం
  • రాష్ట్రంలో నిరుడు 4.24 లక్షల ఎకరాల్లో మిల్లెట్స్​ సాగు.. 3.06 లక్షల టన్నుల ఉత్పత్తి
  • 2020లో కేవలం 2.52 లక్షల ఎకరాల్లో 1.66 లక్షల టన్నుల ఉత్పత్తి
  • మిల్లెట్స్ సాగులో తెలంగాణకు పదో స్థానం.. దిగుబడిలో ఐదో ర్యాంక్
  • దేశంలో మిల్లెట్స్​ స్టార్టప్లు ఎక్కువున్న రాష్ట్రమూ మనదే.. 
  • లోక్​సభలో వెల్లడించిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిల్లెట్స్​సాగు బుల్లెట్ స్పీడుతో దూసుకుపోతున్నది. ఐదేండ్లలోనే మిల్లెట్స్​సాగు, ఉత్పత్తి రెట్టింపయ్యాయి. మిల్లెట్స్ పండిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ పదో స్థానంలో ఉన్నది. అంతేకాదు.. మిల్లెట్స్​ ఆధారిత స్టార్టప్లు ఎక్కువున్న రాష్ట్రంగానూ తెలంగాణకు గుర్తింపు దక్కింది. ఈ విషయం లోక్​సభలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మిల్లెట్స్​ సాగు వివరాలు, తీరు తెన్నులపై ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రాలవారీగా మిల్లెట్స్ ​పండిస్తున్న జాబితాను సభ ముందు పెట్టింది.

తగ్గి, మళ్లీ పెరిగి..
రాష్ట్రంలో మిల్లెట్స్​ సాగు తొలుత స్టడీగా సాగింది. మధ్యలో రెండేండ్లు పంటల విస్తీర్ణం తగ్గింది. కానీ, ఆ తర్వాత రెండేండ్లు మాత్రం జోరుగా సాగైంది. 2020లో 1.02 లక్షల హెక్టార్లు (2.52 లక్షల ఎకరాలు) మిల్లెట్స్​ను రైతులు సాగు చేశారు. ఆ ఏడాది 1,66,330 టన్నుల ఉత్పత్తి నమోదైంది. దిగుబడి హెక్టారుకు 2,103 కిలోలుగా (2.1 టన్నులుగా) ఉన్నది. అయితే, ఆ తర్వాత రెండేండ్లు అంటే 2021, 2022లో మాత్రం పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. 2021లో కేవలం 1.83 లక్షల ఎకరాలు, 2022లో 1.80 లక్షల ఎకరాల్లో మాత్రమే మిల్లెట్స్​ను సాగు చేశారు. 

మళ్లీ 2023లో 2.81 లక్షల ఎకరాలకు మిల్లెట్స్​సాగు పెరిగింది. 2024లో అయితే అది పీక్స్కు చేరింది. ఆ ఏడాది 4.24 లక్షల ఎకరాల్లో మిల్లెట్స్​ను రైతులు సాగు చేశారు. 2020 నుంచి 2024 వరకు వరుసగా ఐదేండ్లలో 1,66,330 టన్నులు, 1,22,760 టన్నులు, 1,32,400 టన్నుల మేర మిల్లెట్స్ ఉత్పత్తి జరిగింది. 2023లో 2,55,580 టన్నుల మేర మిల్లెట్స్​ ఉత్పత్తి జరగ్గా.. 2024లో అది 3,05,840 టన్నులకు పెరిగింది. అంటే 2020 నుంచి ఇప్పటి వరకు మిల్లెట్స్ ఉత్పత్తి రెట్టింపైంది.

రాజస్తాన్ ​టాప్..
మిల్లెట్స్​ సాగు, ఉత్పత్తి విషయంలో రాజస్తాన్​ టాప్​లో ఉంది.  కానీ, దిగుబడిలో మాత్రం కింది స్థాయిలోనే ఉంది.  అది మొత్తం ఎడారి రాష్ట్రం కావడం.. సాగుకు నీళ్లు అందకపోవడం వంటి కారణాలతోనే దిగుబడి తక్కువగా వచ్చి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిగుబడి విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా మెరుగ్గానే ఉన్నది. దిగుబడుల విషయంలో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నది. అదే సమయంలో ఏపీ తొలి స్థానంలో నిలిచింది.  

రాష్ట్రంలో 43 అగ్రి స్టార్టప్లు
దేశవ్యాప్తంగా మిల్లెట్స్ స్టార్టప్లు 151 ఉంటే.. అందులో 43 మన రాష్ట్రంలోనే ఉన్నట్టు కేంద్రం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తర్వాత మహారాష్ట్రలో 18, కర్నాటకలో 16, తమిళనాడులో 15, ఏపీలో 9 స్టార్టప్​లు ఏర్పాటయ్యాయి. మిల్లెట్స్​పై ఫార్మర్స్​ ప్రొడ్యూసర్స్​ ఆర్గనైజేషన్​ (ఎఫ్​పీవో)లు మన రాష్ట్రంలో 12 ఉండగా.. అందులో 9 ఎఫ్​పీవోలు మిల్లెట్స్​ను ప్రాథమిక పంటగా, 3 ఆర్గనైజేషన్లు సెకండరీ పంటగా సాగు చేస్తున్నాయి. ఈ సంఘాలు అత్యధికంగా కర్నాటకలో 105 ఉన్నాయి. రాజస్తాన్​లో 89, యూపీలో 63 సంఘాలున్నట్టు కేంద్రం వెల్లడించింది. 

తెలంగాణలోని ఇండియన్​ ఇన్ స్టిట్యూట్​ఆఫ్​మిల్లెట్స్​రీసెర్చ్​హైదరాబాద్​ ఆధ్వర్యంలో.. ప్రధానమంత్రి కృషి వికాస్​ యోజన కింద మిల్లెట్స్​ స్టార్టప్​లకు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. అదొక్కటే కాకుండా మరో 5 నాలెడ్జ్​ పార్ట్​నర్స్, మరో 23 అగ్రి బిజినెస్ ఇంక్యూబేటర్ల సహకారం తీసుకుంటున్నట్టు తెలిపింది. వీటి ద్వారా ఇన్నొవేషన్​ అండ్​ అగ్రి ఎంట్రప్రెన్యూర్​షిప్​ డెవలప్మెంట్​కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొంది.