
- వర్షాలు, వాతావరణ మార్పులతో విస్తరిస్తున్న జ్వరాలు
- గత 15 రోజుల్లోనే లక్ష మంది బాధితులు
- ప్రభుత్వ ఆస్పత్రులకే 20 వేల మంది పేషెంట్లు
- ఈ ఏడాది ఇప్పటికే 3,065 డెంగ్యూ కేసులు
- వైద్యారోగ్య శాఖ అలర్ట్.. ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో రెడీగా మందులు
హైదరాబాద్, వెలుగు: ఎడతెరిపిలేని వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో సాధారణ జ్వరాలతో పాటు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వైరల్ ఫీవర్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే జ్వరపీడితుల సంఖ్య రెండు, మూడు రెట్లు పెరిగింది. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి రోజుకు 1,100 మందికి పైగా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. గడిచిన 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది జ్వరాలబారిన పడినట్టు అధికారులు లెక్క తేల్చారు. ప్రభుత్వ ఆసుపత్రులకే 20 వేల మంది పేషెంట్లు వచ్చారని.. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రైవేట్ ఆసుపత్రుల లెక్కలు కలిపితే ఈ సంఖ్య ఇంకా నాలుగైదు రెట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఎడతెరిపి లేని వర్షాలు, వాతావరణం చల్లబడడంతో దోమలు పెరిగిపోయాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విషజ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. ఈ నెలంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది. పారిశుధ్య కార్యక్రమాలపై నిర్లక్ష్యం చేయవద్దని పంచాయతీరాజ్, మున్సిపల్అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక డాక్టర్లంతా విధుల్లో ఉండాలని, హై రిస్క్ గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం.. గత రెండు వారాల నుంచి జ్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. వర్షాలు ఎక్కువగా నమోదైన వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, యదాద్రి భువనగిరి, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ములుగు జిల్లాల్లో ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటికే 3,065 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇందులో 30 శాతం కేసులు ఈ 15 రోజుల్లోనే వచ్చినట్లు హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కలు చెప్తున్నాయి.
ఇక ఇప్పటివరకు 248 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. ఇక ఓవరాల్‌గా రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 13 లక్షల మంది జ్వరం బారినపడ్డారు. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ హాస్పిటల్స్ కు సంబంధించినవే. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉందని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం... అధికారికంగా ఒక కేసును గుర్తిస్తే, బయటకు రాని కేసులు పదింతలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్
రాష్ట్రంలో ప్రబలుతున్న జ్వరాలు, డెంగ్యూ వ్యాధిని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. జ్వరంతో వచ్చిన రోగులకు అనవసరమైన టెస్టులు సూచిస్తూ, వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో సాధారణ వైరల్ ఫీవర్‌కి కూడా ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోతుంది. వీటిని డెంగ్యూ లక్షణాలుగా చూపిస్తూ రోగుల్లో భయాన్ని పెంచి, ఐసీయూలో చేరాలని ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా ఈ దోపిడీలో భాగమయ్యాయి.
ప్రభుత్వం నిర్ధారించిన ధరల కంటే ఎక్కువ రేట్లను వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఎన్.ఎస్.1 యాంటిజెన్ టెస్టు కోసం రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు చార్జ్ చేస్తున్నారు. డెంగ్యూ కేసుల్లో 50 వేల వరకు ప్లేట్‌లెట్లు ఉన్నా, ప్లేట్‌లెట్లు ఎక్కిస్తూ లక్ష వరకు వసూలు చేస్తున్నారు. కానీ ప్లేట్ లెట్స్10 వేల వరకు తగ్గినా, వెంటనే ఎక్కించాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు.
వైద్యారోగ్య శాఖ అలర్ట్..
రాష్ట్రంలో జ్వర బాధితులు పెరగడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్స్, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ సేవలు ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మందులు, డయాగ్నోస్టిక్ కిట్‌లను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్స్‌తో పాటు పీహెచ్‌సీలకు ప్రత్యేక సర్య్కులర్ జారీ చేశారు. వర్షాలు తగ్గాక ఇంటింటి సర్వే చేయనున్నారు.