దంచికొట్టింది.. భారీ వర్షంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆగమాగం

దంచికొట్టింది.. భారీ వర్షంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆగమాగం
  • అత్యధికంగా తాంసి మండలంలో 17 సె.మీ.వర్షం 
  • నీట మునిగిన కాలనీలు
  • ఇండ్లలో చిక్కుకున్న ప్రజలను కాపాడిన డీడీఆర్ఎఫ్ బృంధాలు
  • ఉప్పొంగిన వాగులు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • చెరువులను తలపించిన పొలాలు
  • పలు ప్రాజెక్టుల గేట్లు ఓపెన్

వెలుగు, నెట్​వర్క్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం భారీ వర్షం కురిసి అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా తాంసి మండలంలో 170 మిల్లిమీటర్లు, తలమడుగులో 162.4 మి.మీ, మావలలో 154.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వాగులు, చెరువులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించాయి. బ్రిడ్జిలపైనుంచి వరద ప్రవహించడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 38 వేల క్యూసెక్కులు, మత్తడివాగు ప్రాజెక్టు మొత్తం 5 గేట్లు ఎత్తి 42,860 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ ఎఫ్ బందాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 

 కోజా కాలనీ సమీపంలోని ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో ఓ కారు కొట్టుకుపోయింది. 

ఇండ్లలోకి వరద చేరి వంట సామాగ్రి, వస్తువులు, సరుకులు తడిసిపోయాయి. 

ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ, తాంసి మండల కేంద్రాల్లోని కాలనీలు నీటిలో మునిగిపోయాయి. 

 ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ వాగు ఉధృతంగా ప్రవహిచండంతో పెద్ద గోదుమల్లె, ఎల్లమ్మగూడ, బుర్కిగూడ, నేరడిగొండ కె, కొలంగూడ, జెండగూడ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

  సిరికొండ మండలంలో చిక్ మాగన్‌ వాగు ఉప్పొంగి పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  

 గుడిహత్నూర్ మండలంలోని సీతగోంది జాతీయ రహదారి పక్కన నివాసం ఉంటున్న గైక్వాడ్ గణేశ్ కుటుంబం వరదలో చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షి, ఎస్పీ అఖిల్‌ మహాజన్ సంఘటన స్థలానికి చేరుకొని డీడీఆర్ఎఫ్ బృందాలతో వారిని రక్షించారు. 

బజార్​హత్నూర్ మండలంలోని చింతలసంగ్వి, మోర్ఖండి వాగులు ఉప్పొంగడంతో 8 గ్రామాలకు రాకపోకలు బంద్ ​అయ్యాయి.

ఆసిఫాబాద్​ జిల్లాలో నిలిచిన రాకపోకలు

ఆసిఫాబాద్ మండలంలోని గూడేన్ ఘట్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గుండి, అనార్ పల్లి, లక్మాపూర్ వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. బెజ్జూర్ మండలం హేటిగూడలో పంబాల సన్నాసి అనే వ్యక్తి ఇల్లు కూలింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చింతలమానేపల్లి మండలం దిందా వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచాయి.

మార్లవాయి వంతెనపై వరద ప్రవహించడంతో గ్రామస్తులు ప్రాణాలకు తెగించి నీటిని దాటాల్సి వచ్చింది. కాగజ్ నగర్ మండలం లోని పెద్దవాగు వరద ఉధృతిని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుమ్రంభీం ప్రాజెక్టు 6 గేట్లు, వట్టివాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదిలారు.

మంచిర్యాల జిల్లాలో 60.20 మిల్లీమీటర్లు

మంచిర్యాల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. 60.20 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలోని బృందావనకాలనీ, సూర్యనగర్​, హమాలీవాడ తదితర కాలనీలను వరద చుట్టుముట్టింది. పలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

  బెల్లంపల్లిలోని రాంనగర్​ వాగు పొంగిపొర్లడంతో కాజ్​వే నీటమునిగింది. పలు ఇండ్లలోకి నీళ్లు చేరాయి. రాంనగర్​, హనుమాన్​బస్తీ,అశోక్​నగర్​ కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాత జీఎం ఆఫీస్​, గాంధీ చౌరస్తా, మెయిన్​ బజార్, అశోక్​నగర్​ క్రాస్​రోడ్, సింగరేణి స్టోర్స్, ఏరియా వర్క్​షాప్​ఏరియాల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని ఏ3 క్వార్టర్​ పైకప్పు కూలిపోయింది. ఆ టైమ్​లో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. టేకులబస్తీలోని ఏగోలపు కేతమ్మ ఇంటి గోడ కూలిపోయింది. 

  కాసిపేట మండలంలోని బుగ్గ చెరువు మత్తడి పొంగిపొర్లడంతో చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులు వరదలో చిక్కుకున్నారు. వారిని స్థానికులు తాళ్ల సహాయంతో కాపాడారు. 

 నెన్నెల మండలంలోని ఎర్రవాగు ఉప్పొంగడంతో నెన్నెలతో పాటు కోనంపేట గ్రామంలోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. మోటార్లు పెట్టి నీటిని తోడేశారు. బెల్లంపల్లి సబ్​ కలెక్టర్​ మనోజ్​ఎర్రవాగును పరిశీలించారు. 

ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు 18 గేట్లను పైకెత్తి 2,14,730 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి 29,305 క్యూసెక్కులు, గడ్డన్న వాగు ప్రాజెక్టు 5 గేట్లు పైకెత్తి 20వేల క్యూసెక్కుల నీరును దిగువకు వదిలారు. కడెం, స్వర్ణ ప్రాజెక్టులను కలెక్టర్ అభిలాష్ అభినవ్ సందర్శించి అధికారులతో సమీక్ష జరిపారు. వరదను అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను మరింత అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్​లోని టోల్​ఫ్రీ నంబర్​ 9100577132కు కాల్​ చేయాలని కలెక్టర్ కోరారు.