టీఆర్‌ఎస్ నేతల వేధింపులకు తల్లీ, కొడుకు ఆత్మహత్య

 టీఆర్‌ఎస్ నేతల వేధింపులకు తల్లీ, కొడుకు ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. న్యూ మహరాజ లాడ్జిలో తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు.లాడ్జిలోని రూమ్ నెంబర్ 203లో తెల్లవారు జామున సూసైడ్ చేసుకున్నారు. తమ ఆత్మహత్యకు ఏడుగురు కారణమని సూసైడ్ లెటర్ రాశారు. లాడ్జిలో పొగలు రావడంతో  పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు లాడ్జీ సిబ్బంది. మృతులు రామాయం పేటకు చెందిన సంతోష్, తల్లి పద్మగా గుర్తించారు. తల్లి వైద్యం కోసం 11వ తేదీన లాడ్జికి వచ్చారని తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్ పరిశీలించారు. ఆత్మహత్య చేసుకుంటునట్టు సెల్ఫీ వీడియో చిత్రీకరించి ఫేస్ బుక్ లో పెట్టినట్టు డీఎస్పీ తెలిపారు.ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు బాధితులు.ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తోపాటు ఐరెని పృథ్వి రాజ్ అలియాస్ బాలు, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, తోట కిరణ్,కన్నా పురం కృష్ణా గౌడ్, సరాఫ స్వరాజ్,అప్పటి సీఐ నాగార్జున గౌడ్ కలిసి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ వేధించారని సెల్ఫీ వీడియోలో చెప్పాడు మృతుడు సంతోష్. ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారని గతంలో పోలీస్టేషన్ కు పిలిపించి వేధించారని కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున గౌడ్ తుంగతుర్తి సీఐగా విధులు నిర్వహిస్తున్నట్టు సంతోష్ చెప్పారు.

పల్లె జితెందర్ గౌడ్ రామాయంపేట మున్సిపల్ చైర్మన్ అయ్యాక సరాఫ్ యాదగిరి తో కలిసి ఎన్నో అక్రమాలు చేశారని బాధితుడు సంతోష్ చెప్పాడు. ఎవరైనా పట్టణంలో సమస్యల గురించి అడిగితే వారిని పిలిపించి బెదిరించే వారని తెలిపాడు.జితేందర్ గౌడ్ ఎంతో మందిని మోసం చేశాడని పేర్కొన్నారు.రామాయంపేట లోని అయ్యప్ప ఆలయం నిర్మాణంలో అందినకాడికి దండుకున్నారని ఆరోపించాడు. దేవాలయానికి ఎంత ఖర్చు చేశారని ఎవరైనా అడిగితే బెదిరించేవాడని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో తన ఫ్రెండ్ దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడని... అతను చనిపోయాక తిరిగి ఇవ్వకుండా బెదిరించాడని..ఆ తరువాత 15 లక్షలే ఇచ్చి మోసం చేశాడని తెలిపారు. స్నేహితులతో కలిసి బిజినెస్ చేశామని.. ఆ వ్యాపారం సక్సెస్ అవుతుండటంతో జితేందర్ గౌడ్ అందులో తనకు 50 శాతం వాటా కావాలని డిమాండ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 

2020 నవంబర్ లో గుర్తు తెలియని వ్యక్తులు వారిని కామెంట్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.అప్పటి  రామాయంపేట సీ ఐ నాగార్జున గౌడ్ సహకారంతో తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి తీవ్ర ఇబ్బందులు గురిచేశాడని సంతోష్ తెలిపాడు.సీఐ తన మొబైల్ తీసుకొని 10 రోజులు తన దగ్గరే ఉంచుకుని అందులోని డేటా అంతా కాపీ చేసి జితేందర్ గౌడ్ కు ఇచ్చారు.2020 డిసెంబర్ నుంచి తన పర్సనల్ డేటా బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు.దాదాపు ఏడాదిపాటు రకరకాలుగా ఇబ్బందులకు గురిచేశారని కన్నీరుపెట్టుకున్నారు.వ్యాపారాలు దెబ్బ తీశారు. ఆస్తులు నష్ట పోయాను..వారి వళ్ల అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. వీరి టార్చర్ వల్లే మా నాన్నకు పెరాలసిస్ వచ్చిందన్నారు. వీరు పెట్టే బాధలు భరించలేక చనిపోవాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. 

టీఆర్ఎస్ నేతల  అక్రమాలు, అన్యాయాలపై సాక్ష్యాధారాలతో ఎస్పీ, డీజీపీ, కలెక్టర్, మంత్రులు హరీశ్ రావ్, కేటీఆర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కొరియర్ చేశానని తెలిపారు.వీరందరూ అధికార పార్టీకి చెందిన టీఆర్ ఎస్ నేతలు కావడం.. వారికి రాజకీయంగా అండదండలు ఉండటంతో తనకు న్యాయం జరగలేదని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ఇద్దరి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని వేడుకున్నాడు.

మరిన్ని వార్తల కోసం

హనుమాన్ శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు

వివేక్ అగ్నిహోత్రి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఫిలిం మేకర్