
ఒకప్పటి తమిళనాడు సీఎం, దివంగత జయలలితకు అందించిన వైద్య చికిత్సపై సుప్రీంకోర్టు నియమించిన ఎయిమ్స్ డాక్టర్ల ప్యానెల్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెకు మెడికల్ ప్రాక్టీస్ ప్రకారం సరైన చికిత్సే అందించారని స్పష్టం చేసింది. జయలలితకు అందించిన ట్రీట్మెంట్ లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని తెలిపింది. అంతకు ముందే జయ మరణానికి గల కారణాలను, ఆమెకు అందించిన చికిత్స వివరాలను పేర్కొంటూ అపోలో హాస్పిటల్స్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.
2016 డిసెంబర్ 5న చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆమె మరణంపై అనేక అనుమానాలున్నాయని భావిస్తూ.... 2017 సెప్టెంబర్‌లో మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అర్ముఘస్వామితో తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే జయలలిత మరణానికి గల కారణాలు, చికిత్స వివరాలపై కమిషన్ విచారణ జరిపింది. నవంబర్ 2021లో ఈ కమిషన్ విచారణకు సాయం చేయడం కోసం సుప్రీం కోర్టు ఎయిమ్స్ డాక్టర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఆగస్టు 4న రిపోర్ట్ చేసిన ఈ ప్యానెల్.. మాజీ సీఎంకు అందించిన చికిత్స సరైందేనని.. ఎలాంటి పొరపాట్లూ దొర్లలేదని పేర్కొంది. ఏప్రిల్ 26న కమిషన్ వాదనలు పూర్తి చేసింది. జూన్ 24న కమిషన్ ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తుందని భావించగా.. మూడువారాలపాటు పొడిగించారు. కానీ కమిషన్ ఆగస్టు 24న నివేదికను అందించనుంది.