సర్కారు ఓకే చెప్పలేదని స్టూడెంట్ల యూఎస్ టూర్ రద్దు

సర్కారు ఓకే చెప్పలేదని స్టూడెంట్ల యూఎస్ టూర్ రద్దు

రంగారెడ్డి, వెలుగు:  ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్ మెంట్ కాన్ఫరెన్స్​లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన మహేశ్వరంలోని టీఎస్ మోడల్ స్కూల్ స్టూడెంట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఆగిపోయారు. రాష్ట్ర సర్కారు నుంచి అనుమతి రాలేదని చివరి నిమిషంలో  ప్రిన్సిపాల్ చెప్పడంతో స్టూడెంట్ల ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. యూఎస్ కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ ఎన్ఎస్ఎస్(నేషనల్ స్పేస్ సొసైటీ) ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు టెక్సస్​లో  ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్ మెంట్ కాన్ఫరెన్స్​ను నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేందుకు మహేశ్వరంలోని మోడల్ స్కూల్ స్టూడెంట్లు 9 మంది కొన్ని ప్రాజెక్టులను పంపారు. స్టూడెంట్ల ప్రతిభను గుర్తించిన ఎన్ఎస్ఎస్ మొత్తం 9 మందికి సెమినార్​లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ.. ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఇన్విటేషన్ లెటర్ పంపింది.

సెమినార్ కోసం యూఎస్​కు వెళ్లాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని.. అంత మొత్తాన్ని తాము భరించలేమని ఓ స్టూడెంట్ ఆగిపోయాడు. మిగతా 8 స్టూడెంట్ల తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్ ధనుంజయకు విషయం చెప్పారు. ఆయన జిల్లా అధికారులు, మంత్రి సబిత దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ సెమినార్​లో పాల్గొనే అవకాశం వచ్చిన స్టూడెంట్లను మంత్రి సబిత అభినందించారు. తర్వాత మంత్రి కేటీఆర్ దగ్గరిని వారిని తీసుకెళ్లారు. మంత్రి కేటీఆర్ సైతం స్టూడెంట్లను అభినందించారు. వివిధ ప్రైవేటు కంపెనీల నుంచి సీఎస్ఆర్ ప్రోగ్రామ్​లో భాగంగా రూ. 11 లక్షల 50 వేలు స్కూల్ ప్రిన్సిపాల్​కు అందాయి. యూఎస్ కు వెళ్లేందుకు మొత్తం 8 మంది స్టూడెంట్లు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్ ధనుంజయకు పాస్​పోర్టులు, వీసాలు మంజూరయ్యాయి.

ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఖర్చు పెట్టి టికెట్లు కొన్నారు. ఈ నెల 23న మధ్యాహ్నం 8 మంది స్టూడెంట్లు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపల్ ధనుంజయ సహా మొత్తం 11 మంది లగేజీలతో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లో ఫ్లైట్ ఎక్కబోతున్నమనగా.. ఈ ట్రిప్​కు రాష్ట్ర సర్కారు నుంచి పర్మిషన్  లేదని.. ప్రిన్సిపాల్ ధనుంజయ స్టూడెంట్లకు చెప్పాడు. దీంతో స్టూడెంట్లు నిరాశతో వెనుదిరిగారు.   స్టూడెంట్లకు పాస్ పోర్టు, వీసాలను సమకూర్చిన ప్రిన్సిపాల్ ప్రభుత్వ అనుమతి తీసుకోవడం ఎలా మరిచిపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్ పిల్లలు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కు వెళ్లకుండా  కార్పొరేట్ సంస్థలు కుట్ర చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.