పుష్కరాలపై ఇంత నిర్లక్ష్యమా.

పుష్కరాలపై ఇంత నిర్లక్ష్యమా.



టైమ్​ దగ్గర పడుతున్నా స్పందించని సర్కారు
రూ.35.70 కోట్లతో ప్రపోజల్స్ పంపినా పైసా ఇయ్యలేదు

జయశంకర్‌‌ భూపాలపల్లి/ మంచిర్యాల, వెలుగు: తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగనున్న ప్రాణహిత పుష్కరాలపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు  ఏప్రిల్ 13 నుంచి 24 వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా  కాళేశ్వరం, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, రాపనపల్లి ఇంటర్ స్టేట్ బ్రిడ్జి, దేవులవాడ, వేమనపల్లిలతోపాటు ప్రాణహిత రాష్ట్రంలోకి అడుగుపెట్టే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కరాలు నిర్వహించేందుకు ఆఫీసర్లు ప్లాన్ చేశారు. పుష్కరఘాట్ల దగ్గర భక్తుల కోసం సౌకర్యాలు కల్పించేందుకు వివిధ డిపార్ట్​ మెంట్ల ద్వారా భూపాలపల్లి జిల్లాలో 22.70 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 13 కోట్లతో ప్రపోజల్స్​పంపగా.. ఇంతవరకు  గవర్నమెంట్ స్పందించలేదు. నెల రోజుల్లో పుష్కరాలు మొదలుకానున్నా.. ఇంకా ఘాట్ల వద్ద ఎలాంటి పనులు మొదలు పెట్టకపోవడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఉమ్మడి రాష్ట్రంలో  ఘనంగా.. 
 ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో 2010 డిసెంబర్​లో ప్రాణహిత పుష్కరాలు వచ్చాయి. దీంతో అప్పటి సీఎం కిరణ్‌‌ కుమార్‌‌ రెడ్డి ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి కాళేశ్వరం వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ నుంచి రూ. 1.72 కోట్లు, ఇతర శాఖల నుంచి రూ.  8  కోట్లు కేటాయించి.. సీఎం స్వయంగా  హాజరయ్యారు. అప్పట్లో 12 రోజుల పాటు రోజుకు దాదాపు లక్ష మంది పుష్కర స్నానాలు చేశారు. టీఆర్​ఎస్​ అధినేత , ప్రస్తుత సీఎం కేసీఆర్, అప్పుడు ప్రజారాజ్యం చీఫ్​గా ఉన్న  చిరంజీవి తదితరులు మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట వద్ద పుష్కరాల్లో పాల్గొన్నారు. 

రూ.35 కోట్లతో ప్రపోజల్స్‌‌

గత పుష్కరాల సందర్భంగా నిర్మించిన పుష్కర ఘాట్లు, రోడ్లు, టాయ్​లెట్లు చాలావరకు పాడయ్యాయి. వాటికి రిపేర్లు చేయడంతో పాటు కొత్తవి నిర్మించాలి. పుష్కర ఘాట్లకు వెళ్లే రోడ్లను వెడల్పు చేయాలి. టెంపరరీ టాయ్​లెట్లు, ఆడవాళ్లు బట్టలు  మార్చుకునేందుకు గదులను నిర్మించాలి.  కరెంట్, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు  పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి. పోలీస్ బందోబస్తు,  సీసీ కెమెరాలు, శానిటేషన్ లాంటి  ఏర్పాట్లు జరగాలి. ఇందుకోసం భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో చేపట్టవలసిన పనులను గుర్తించి  రూ.35 కోట్లతో ఆఫీసర్లు ప్రపోజల్స్‌‌ పంపించారు. భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం దగ్గర హైవే పనులకు రూ.48.50 లక్షలు,  ఆర్ అండ్ బీ రోడ్డు పనులకు రూ.17లక్షలు,  పుష్కర ఘాట్లనిర్మాణానికి రూ.4.15 కోట్లు,  ఇరిగేషన్‌‌ వర్క్‌‌లకు రూ.3.50 కోట్లు, కరెంట్‌‌ పనుల కోసం రూ.69.75 లక్ష లు,  పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌‌ విభాగానికి రూ.1.90 కోట్లు, డీపీఓ కు రూ.98.44 లక్షలు,  కాళేశ్వరం ఆలయ పరిధిలో పనులకు రూ.4.10 కోట్లతో పాటు వివిధ డిపార్ట్​మెంట్ల అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించారు. మంచిర్యాల జిల్లాలో  నేషనల్​ హైవే 63 నుంచి రాపనపల్లి వరకు రోడ్డుకోసం  రూ.1.20 కోట్లు, ఎన్​ హెచ్​63 నుంచి లక్ష్మీపూర్ మీదుగా ప్రాణహిత నది వరకు రోడ్డు నిర్మాణానికి రూ.2.64 కోట్లు, ఎన్​ హెచ్​63 నుంచి దేవులవాడ మీదుగా సింగరేణి పంప్ హౌస్ రోడ్డుకు రూ.2.40 కోట్లు, ఇంటర్ స్టేట్ బ్రిడ్జికి రెండు వైపులా రోడ్ల కోసం రూ.80 లక్షలు, ప్రాణహిత దగ్గర్లోని  పుల్లగామ, ఆలుగామ, సిర్సా, జనగామల నుంచి నది వరకు రోడ్ల నిర్మాణానికి రూ.4.50 కోట్లతో  ప్రపోజల్స్ పంపించారు. అర్జునగుట్ట, వేమనపల్లి పుష్కరఘాట్ల వద్ద, ఇంటర్ స్టేట్ బ్రిడ్జి దగ్గర రూ.1.13 కోట్లతో వివిధ పనుల కోసం ప్రతిపాదనలు పంపారు. 

స్పందించని సర్కారు
ప్రాణహిత నది ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, అర్జునగుట్ట  మీదుగా ప్రవహించి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. మన రాష్ట్రం వస్తే ప్రాణహిత పుష్కరాలను మరింత ఘనంగా జరుపుకుందామని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు అసలు పట్టించుకోవడంలేదు. గత అక్టోబర్​లోనే   పుష్కర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి రివ్యూ చేశారు. ఎక్కడ ఏ పనులు చేపట్టాలో పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. ఆయన సూచనలతో భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా ఆఫీసర్లు  రూ.35 కోట్ల అంచనాలతో ప్రపోజల్స్ రెడీ చేసి గవర్నమెంట్‌‌కు పంపించారు. ఈ ప్రపోజల్స్​పై సర్కారు నుంచి స్పందన రాలేదు. ఫండ్స్​ రిలీజ్​ చేయలేదు.   సీఎం కేసీఆర్ కనీసం ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. ఈసారి పుష్కరాలకు లక్షలాది మంది వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ప్రాణహిత, గోదావరి నదుల సంగమమైన కాళేశ్వరానికి రోజుకు లక్ష మంది భక్తులు రావచ్చునని అంటున్నారు. రాపనపల్లి ఇంటర్ స్టేట్ బ్రిడ్జి దగ్గర ఘాట్​కు తెలంగాణ వాళ్లే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్​గడ్​రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడానికి చాలా సమయం పడుతుందని, పనులు ఇప్పటికైనా మొదలుపెట్టకపోతే పుష్కరాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడాల్సివస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.