
కరోనా కష్టకాలంలో ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు. ఉద్యోగుల జీతాల్లో కోతకు నిరసనగా…ధర్నాకు దిగారు. పూర్తిస్థాయి వేతనం చెల్లించాలంటూ హన్మకొండ ఏకశిలా పార్కులో నిరసన కార్యక్రమం చేపట్టారు ఎంప్లాయిస్. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే సీఎం…ఉద్యోగుల జీతాలను ఎందుకు కట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనెల నుంచి పూర్తిస్థాయి వేతనం ఇవ్వాలని..లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.
ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల్లో కోతలకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసనకి దిగాయి ఉపాధ్యాయ సంఘాలు. కరోనా నెపంతో మూడు నెలలుగా వేతనాల్లో కోతలు పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఉద్యోగులు. వేతనాల్లో కోతలు విధించడం దుర్మార్గపు చర్య అన్నారు. చిన్నపాటి అంశాలకు ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యే మంత్రి కేటిఆర్ కి.. ఉద్యోగులు వేల సంఖ్యలో ట్వీట్లు చేసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
నిజామాబాద్ జిల్లా, బోధన్ లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తహసిల్ధార్ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. వేతన కోతలను నిరసిస్తూ..ఇచ్చిన జీవో నెంబర్ 27 రద్దు చేసి పూర్తి వేతనాలు ఇవ్వాలని పరిపాలనాధికారికి మెమోరాండం సమర్పించారు. పక్క రాష్ట్రాల్లో పూర్తి వేతనాలు అందిస్తున్నా… మన రాష్ట్రంలో మాత్రం కక్ష సాధింపుగా కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. IR , PRc ఇవ్వకపోగా… జీతాలు కట్ చేయడం సిగ్గుచేటన్నారు.
పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆందోళనకు దిగారు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు. అచ్చంపేటలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించి తహసిల్ధార్ కు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులకు మొత్తం జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతల్లో కోతలను నిరసిస్తూ… గద్వాల కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు ఉద్యోగ, ఉపాధ్యాయులు. రిటైర్డ్ ఎంప్లాయిస్ తో కలిసి ఆందోళనకు దిగారు. వచ్చిన జీతంలో బ్యాంకుల లోన్లు పోను ఏమీ మిగలడం లేదంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగాయి. జీతాల్లో కోతలను నిరసిస్తూ… కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఎంప్లాయిస్. పీఆర్సీని వెంటనే అమలు చేయడంతోపాటు మే నెలలో పూర్తి వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నిరసన తెలిపారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్…ఉద్యోగుల జీతాలు ఎందుకు పూర్తిగా ఇవ్వట్లేదని ప్రశ్నించారు ఎంప్లాయీస్ యూనియన్ నేతలు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని… వెంటనే పూర్తిస్థాయి వేతనాలు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.