ఢిల్లీలో లక్షల ఇండ్లు రెగ్యులరైజ్

ఢిల్లీలో లక్షల ఇండ్లు రెగ్యులరైజ్
  • 1,800 కాలనీల్లో ఎల్ఆర్ఎస్​ అమలు
  • ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
  • నాన్​ ఆయిల్​ కంపెనీలు పెట్రోల్​ బంకులు పెట్టే వెసులుబాటు
  • కేంద్ర కేబినెట్​లో కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ:

దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్​ క్యాపిటల్​ రీజియన్​(ఎన్​సీఆర్​) పరిధిలో అక్రమంగా కట్టుకున్న లక్షలాది ఇండ్లను రెగ్యులరైజ్​ చేయాలని కేంద్ర కేబినెట్​ నిర్ణయించింది. సుమారు 1,800 కాలనీల్లో ఎల్ఆర్ఎస్​ అమలు చేస్తామని.. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 50 లక్షల మందికి లబ్ధిచేకూరుతుందని ప్రకటించింది. ఇక గోధుమ, శనగపప్పు, కందిపప్పు తదితర ఆరు పంటలకు మద్దతు ధరలను పెంచింది. పెట్రోలియం ఉత్పత్తులను అమ్ముకోవడానికి నాన్-ఆయిల్​ కంపెనీలను అనుమతించాలని నిర్ణయించింది.

బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్​ కమిటీ (సీసీఈఏ) సమావేశం జరిగింది.

అందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్​ జవదేకర్, రవిశంకర్​ ప్రసాద్, హర్దీప్​ పురి మీడియాకు వెల్లడించారు.

త్వరలోనే రెగ్యులరైజేషన్..

ఢిల్లీలో అనధికార కాలనీల రెగ్యులరైజేషన్​ ప్రక్రియను అతి త్వరలోనే మొదలుపెడతామని హర్​దీప్​ సింగ్​పురి తెలిపారు. నవంబర్​ 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును పెడతామన్నారు.

లక్షల మంది పేదల జీవితాలను ప్రభావితం చేసే ఈ ప్రక్రియను చేపట్టడంలో కేజ్రీవాల్​ ప్రభుత్వం విఫలమైనందుకే కేంద్రం రంగంలోకి దిగిందన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం కీలకంగా మారింది. ఈ నిర్ణయాన్ని  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ స్వాగతించారు.

అక్రమ కాలనీల రెగ్యులరైజేషన్​పై కిందటి జులైలోనే తాము ప్రపోజల్స్ పంపామని, వాటినే కేంద్రం ఆమోదించిందని ఆయన చెప్పుకొచ్చారు.

రైతులకు మేలు చేస్తం..

గోధుమ, శనగ పప్పు, కంది పప్పు, ఆవాలకు కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ)ని 50 శాతం నుంచి 109 శాతానికి పెంచుతున్నట్టు ప్రకాశ్​ జవదేకర్​ చెప్పారు. గోధుమ ధరను క్వింటాకు రూ.85, బార్లీ ధర రూ.85, శనగ ధర రూ.255, మైసూర్​ పప్పు ధర రూ.325, ఆవాల ధరను క్వింటాకు రూ.225కు పెంచుతున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ రంగం క్రైసిస్​లో ఉన్న సమయంలో ఈ నిర్ణయం రైతులకు మేలు చేస్తుందని, 2022 నాటికి రైతుల సంపదను రెట్టింపు చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

నాన్​ ఆయిల్​ కంపెనీలూ పెట్రోలియం అమ్ముకోవచ్చు

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్​ అమ్మకాలకు సంబంధించి నిబంధనలను సడలిస్తున్నట్టు జవదేకర్​ చెప్పారు. ఇప్పటిదాకా పెట్రోలియంను ఉత్పత్తి చేసే ఆయిల్​ కంపెనీలకు మాత్రమే దాన్ని రిటైల్​గా అమ్ముకునేందుకు అనుమతి ఉంది. ఇకపై ఏటా రూ.250 కోట్లపైబడి టర్నోవర్​ ఉన్న ఏ కంపెనీ అయినా రిటైల్​ విధానంలో పెట్రోలియం ప్రొడక్ట్స్​ను అమ్ముకోవచ్చని జవదేకర్​ తెలిపారు. కొత్త వాటిలో 15% బంకుల్ని రూరల్​ ఏరియాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆయిల్​ రిటైలింగ్​ రంగంలో పెట్టుబడులు, కంపెనీల మధ్య కాంపిటీషన్​ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

The Union Cabinet has decided to regularize illegally built houses under the NCR.