ఇండియాకు అమెరికా వార్నింగ్

ఇండియాకు అమెరికా వార్నింగ్

యునైటెడ్​ నేషన్స్: ఉక్రెయిన్​లో రష్యా సైనికుల మానవ హక్కుల ఉల్లంఘనలపై యునైటెడ్​ నేషన్స్​ కఠిన చర్యలు తీసుకుంది. యూఎన్ హ్యూమన్​రైట్స్ కౌన్సిల్(యూఎన్​హెచ్ఆర్సీ)​ నుంచి రష్యాను సస్పెండ్​ చేసింది. ఉక్రెయిన్​లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, రష్యన్​ సోల్జర్లు సామాన్య జనాలను చంపేస్తున్నారని పేర్కొంటూ అమెరికా ..‘సస్పెన్షన్​ ఆఫ్ ద రైట్స్​ ఆఫ్​ మెంబర్​షిప్​ ఆఫ్​ ద రష్యన్​ ఫెడరేషన్​ ఇన్ ద హ్యూమన్​ రైట్స్​ కౌన్సిల్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు ఓటు వేశాయి. 24 దేశాలు వ్యతిరేకించాయి. ఇండియా సహా 58 దేశాలు ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ఈ ఏడాది జనవరి నుంచి యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్​ అసెంబ్లీ, హ్యూమన్​రైట్స్ కౌన్సిల్ లో 8 సార్లు ప్రవేశపెట్టిన తీర్మానాలు, ఓటింగ్​కు మన దేశం దూరంగా ఉంది. హ్యూమన్​ రైట్స్ కౌన్సిల్​లో రష్యా మెంబర్​షిప్​ 2023 డిసెంబర్​ వరకు ఉంది. అయితే ఇప్పుడు రష్యాను సస్పెండ్​ చేశారు. 2006లో హ్యూమన్​ రైట్స్​ కౌన్సిల్​ను ఏర్పాటైనప్పటి నుంచి ఒక దేశ సభ్యత్వాన్ని సస్పెండ్​ చేయడం ఇది రెండోసారి. 2011లో లిబియాలో అప్పటి నియంత ముమ్మర్ అల్​ గడాఫీ అణచివేతల కారణంగా ఆ దేశాన్ని సస్పెండ్ చేశారు.  కాగా, యుద్ధ నేరాలకు పాల్పడే వారికి హ్యూమన్ రైట్స్​ కౌన్సిల్​లో చోటు లేదని, ఈ నిర్ణయం తీసుకున్న ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఉక్రెయిన్​ ప్రకటించింది. మద్దతిచ్చిన దేశాలకు రుణపడి ఉంటామని ఉక్రెయిన్​ ఫారిన్ మినిస్టర్ దిమిత్రో కులేబా ట్విట్టర్ లో ప్రకటించారు.  

ఇండియాకు అమెరికా వార్నింగ్

రష్యాతో సంబంధాలను కొనసాగిస్తే  మూల్యం చెల్లించక తప్పదని ఇండియాను అమెరికా మరోసారి హెచ్చరించింది. రష్యాపై ఓటింగ్ కు ముందే అమెరికా ప్రెసిడెంట్​ ఎకనమిక్​ అడ్వయిజర్ బ్రియాన్​ డీస్​ ఈ హెచ్చరిక చేశారు. అయినా, రష్యాతో ఉన్న స్నేహ సంబంధాల కారణంగా జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ కు ఇండియా మరోసారి దూరంగా ఉండిపోయింది.