దేశంలో పేదరికం నుంచి బయటపడినోళ్లు 41 కోట్ల మంది

దేశంలో పేదరికం నుంచి బయటపడినోళ్లు 41 కోట్ల మంది

యునైటెడ్ నేషన్స్: ఇండియాలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గత 15 ఏండ్లలో దేశంలో చారిత్రక మార్పు వచ్చిందని చెప్పుకొచ్చింది. సోమవారం ఈ మేరకు ఆక్స్‌‌ఫర్డ్ యూనివర్సిటీలో మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌‌ (ఎంపీఐ)ని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌‌డీపీ)..ఆక్స్‌‌ఫర్డ్ పావర్టీ, హ్యూమన్ డెవలప్‌‌మెంట్ ఇనిషియేటివ్ (ఓపీహెచ్‌‌ఐ) రిలీజ్ చేశాయి. సస్టెయినబుల్ డెవలప్‌‌మెంట్ గోల్‌‌లో భాగంగా పేదలను కనీసం సగానికి తగ్గించాలన్న లక్ష్యాన్ని 2030 నాటికి సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాయి. ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఇండియా ఒక ముఖ్యమైన కేస్ స్టడీ. అందులో మొదటిది పేదరికాన్ని అన్ని రకాలుగా అంతం చేయాలి. అన్ని వయసుల పురుషులు, మహిళలు, పిల్లల నిష్పత్తిని 2030 నాటికి కనీసం సగానికి తగ్గించాలి. ఏ ఒక్కరూ పేదరికంలో మగ్గిపోవద్దు” అని ఎంపీఐ చెప్పింది. ఇదే సమయంలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, ప్రపంచంలో ఎక్కువ మంది పేదలు ఉన్న దేశం ఇండియానేనని చెప్పుకొచ్చింది. ఇండియాలో ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు..అలాగే మొత్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు పేదరికంలో మగ్గిపోతున్నారని తెలిపింది.

2020 నాటికి 22.8 కోట్ల మంది పేదలు..
‘‘2005–06 నుంచి 2019–21 మధ్య 415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరికంలో ఉన్న అన్ని వయసుల పురుషులు, మహిళలు, పిల్లల నిష్పత్తిని కనీసం సగానికి తగ్గించాలనే సస్టెయినబుల్ డెవలప్‌‌మెంట్ గోల్‌‌..2030 నాటికి సాధించే అవకాశాలు ఉన్నాయనడానికి ఇది నిదర్శనం” అని మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌‌ పేర్కొన్నది. 2020 నాటికి దేశంలో ఉన్న 22.8 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసే టాస్క్ చాలా  కష్టమైందని, ఇప్పుడీ సంఖ్య భారీగా పెరిగి ఉండొచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. 2019–2021లో ఇండియాలో 9.7 కోట్ల మంది పిల్లలు(17 ఏండ్లలోపు) పేదరికంలో మగ్గిపోతున్నారని, ఇలా ఏ దేశంలోనూ లేరని చెప్పుకొచ్చింది.