
హైదరాబాద్, వెలుగు : వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేవాదుల ఎత్తిపోతల పనులన్నీ పూర్తి కావాలని ఇంజనీర్లను ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఆదేశించారు. గురువారం జలసౌధ నుంచి చీఫ్ ఇంజనీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాంలో దేవాదుల పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ స్కీం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల మార్జిన్ మనీ విడుదల చేయాల్సి ఉందని, అవి వస్తే పనులు వేగంగా పూర్తి చేస్తామని ఇంజనీర్లు తెలిపారు.
సర్ఫేస్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డిలో ఐదు, కొత్తగూడెంలో రెండు స్కీంలను రూ.257 కోట్లతో ప్రపోజల్స్ పంపామని, వీటికింద 2,630 హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. రినోవేషన్, రిపేర్, రిస్టోరేషన్‌లో భాగంగా చేపట్టిన 575 చెరువుల పనులు చేపట్టగా అందులో 497 పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 78 చెరువుల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, సీఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.