కోదాడ, వెలుగు: ఉపాధి పనులపై కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చిందని కార్మిక సంఘం నాయకురాలిని గ్రామస్తులు పంచాయతీ ఆఫీస్లో నిర్బంధించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లులో చోటుచేసుకుంది. గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలిది పద్మావతి ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. డీఆర్‌డీఏ అధికారులు బుధవారం గ్రామంలో విచారణ నిర్వహించారు. ఆఫీసర్లు వెళ్లిపోయాక గ్రామంలోని ప్రశాంత వాతావరణాన్ని కావాలనే చెడగొడుతున్నారని సర్పంచ్ వర్గానికి చెందిన కొందరు పద్మావతితో గొడవకు దిగారు. దీంతో గ్రామస్తులు పద్మావతితోపాటు ఆమెతో ఉన్న కొందరిని పంచాయతీ ఆఫీస్లో నిర్బంధించారు. సీపీఎం నాయకుడు ముల్కలపల్లి రాములు వచ్చి సర్పంచ్వర్గంతో వాగ్వాదానికి దిగారు. ఇదేం పని అని ప్రశ్నించారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని విడిపించారు. ఈ ఘటనపై పీఎస్లో కంప్లైంట్చేస్తానని పద్మావతి చెప్పారు.
