రాష్ట్ర  ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించాలి

రాష్ట్ర  ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించాలి

హైదరాబాద్: ఢిల్లీలో రైతులు పోరాడి విజయం సాధించినట్లే.. వీఆర్ఏలు కూడా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. వీఆర్ఏలు చేస్తున్న పోరాటం రాజ్యాంగపరమైన, చట్టబద్ధమైనదని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద వీఆర్ఏల నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మద్దతు ప్రకటించారు.  సీపీఎం పార్టీ ఎల్లప్పుడూ వీఆర్ఏలకు అండగా ఉంటుందన్నారు.  గ్రామాలలో జరిగే  ప్రతి ప్రభుత్వ పనికి వీఆర్ఏలు బాధ్యత వహిస్తారని, ఇంతటి కీలకమైన బాధ్యతలున్న వీరికి కేవలం నెలకు రూ.10,500 వేతనంగా  ఇవ్వడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. వీఆర్ఏలకు ఇప్పటి వరకు  పే స్కేల్ ఇవ్వకుండా.. పర్మినెంట్ కూడా చేయకపోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో వీఆర్ఏలు ఒక పట్టుదలతో  కనిపిస్తున్నారని, ఢిల్లీలో రైతుల పోరాట స్ఫూర్తితో  పోరాడి  హక్కులు సాధించుకోవాలని కోరారు.  మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగ పోరాటం చేసి విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు.  రాష్ట్రంలో వీఆర్ఏలు రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించాలని తమ్మినేని వీరభద్రం సూచించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’