China Balloon:భారత్ పై చైనా సీక్రెట్ బెలూన్ తో నిఘా

China Balloon:భారత్ పై చైనా సీక్రెట్ బెలూన్ తో నిఘా

భారత్, అమెరికా వంటి దేశాలపై చైనా నిఘా పెట్టిందా..? అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలపై కన్నేసిందా..? అంతర్జాతీయ మీడియా నివేదిక వెల్లడించిన సమాచారం ఇప్పుడు యావత్ ప్రపంచాన్నే కలవరపాటుకు గురిచేస్తోంది. అసలింతకు ఏం జరుగుతోంది..? 

చైనాకు చెందిన నిఘా బెలూన్‌ను అమెరికా కూల్చివేయటంపై ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉండగా మరో సంచలన విషయం బయటపడింది. అమెరికా గగనతలంలోకి ప్రవేశించిన చైనా నిఘా బెలూన్‌ను ఆ దేశ మిలిటరీ కూల్చివేసిన కొద్ది రోజులకే మరో విస్తుపోయే విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. భారత్‌, జపాన్‌ సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచారి బెలూన్‌లను ప్రయోగించిందని తెలిపింది.

చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్ లో చాలా సంవత్సరాలుగా పాక్షికంగా నిఘా బెలూన్ వ్యవస్థ పని చేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ తన నివేదికలో వెల్లడించింది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాల సైనిక ఆస్తుల సమాచారాన్ని సేకరించిందని పేర్కొంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వైమానిక దళం ద్వారా నిర్వహిస్తున్న ఈ నిఘా ఎయిర్ షిప్ లు ఐదు ఖండాలలో కనిపించాయని అధికారులు తెలిపారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సముదాయానికి చెందిన నిఘా బెలూన్లు.. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. 

డొనాల్డ్ ట్రంప్ హయాంలో మూడు, నాలుగు సందర్భాల్లో ఇలాంటివే జరిగినా.. ఇటీవలే వాటిని చైనా నిఘా ఎయిర్ షిప్ లుగా గుర్తించినట్లు ప్రకటించింది. ఈ మధ్య తమ గగనతలంలో తిరిగిన చైనా నిఘా బెలూన్ ను అమెరికా కూల్చివేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా కూల్చివేయించింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న  బెలూన్ ను సూపర్ సోనిక్ క్షిపణితో అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. వాటి శిథిలాలను సేకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా నేవీ విడుదల చేసింది.