ఇంటి పనికి భార్యకు జీతమివ్వాల్సిందే.. కోర్టు సంచలన తీర్పు

ఇంటి పనికి భార్యకు జీతమివ్వాల్సిందే.. కోర్టు సంచలన తీర్పు
  • చైనా కోర్టు సంచలన తీర్పు

బీజింగ్‌‌‌‌: ఇంట్లో ఆడోళ్లు చేసే పనికి విలువేముంటుందిలే అనుకోవడం తప్పని చైనా ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. విడాకులు కావాలంటే పెళ్లయిన నాటి నుంచి వంటింట్లో భార్య చేసిన పనికి జీతం కట్టియ్యాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైనాలో ఈ మధ్యే కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం.. విడాకులు తీసుకునే జంటలు, పెళ్లి జరిగిన టైమ్‌‌‌‌ నుంచి వాళ్లు ఎన్నిరోజులు కలిసి ఉంటే అన్ని రోజులు ఇంట్లో చేసిన పనికి పరిహారంకోరచ్చు. ఈ చట్టం కింద తనకు పరిహారం ఇప్పించాలంటూ ఓ భార్య కోర్టును కోరింది. భర్త తననుంచి విడాకులు కోరడంతో ఆమె ఈమేరకు విజ్ఞప్తి చేసింది.

చెన్‌‌‌‌‌‌‌‌–వాంగ్‌‌‌‌ దంపతులు ఐదేండ్ల క్రితం పెండ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం వాళ్లు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న సమయంలో భరణం ఇవ్వాలని భర్తను కోర్టు ఆదేశించింది. అంతవరకు బాగానే ఉన్నా.. ఫిబ్రవరి 4వ తేదీన చైనాలో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దాంతో వాంగ్‌‌‌‌ తన భర్తతో కలిసి ఉన్న ఐదేండ్లలో చేసిన ఇంటి పనులకు వేతనం ఇప్పించాలని కోర్టుకు వెళ్లింది. ‘ఐదేండ్లు ఇంటి పని, పిల్లల బాగోగులు చూసుకున్నా. నా భర్త కొంచెం కూడా హెల్ప్‌‌‌‌ చేసే వాడు కాదు. ఆఫీస్‌‌‌‌ పనులు మాత్రమే చూసుకునేవారు. అందుకే నాకు ఎక్కువ పరిహారం ఇప్పించండి’ అని పిటిషన్‌‌‌‌లో కోరింది. వాంగ్‌‌‌‌ వాదనలు విన్న కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఐదేండ్లు వాంగ్‌‌‌‌ చేసిన పనికి రూ.5,56,937 చెల్లించాలని భర్త చెన్‌‌‌‌ను ఆదేశించింది.

అంత ఎక్కువా అని కొందరు…

కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేండ్లు ఇంటి పని చేసినందుకు ఇంత పరిహారమా అని కొందరు.. ఇంత తక్కువా అని మరికొందరు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలు ఎవరూ ఇంట్లో ఉండకూడదని, భవిష్యత్తులో మీరు విడాకులు పొందాలని అనుకుంటే మీకు ఎలాంటి పరిహారం అందబోదని కామెంట్‌‌‌‌ చేస్తున్నారు.