అమ్మానాన్నలపై దాడి చేశాడని భర్తను చంపేసింది

అమ్మానాన్నలపై దాడి చేశాడని భర్తను చంపేసింది
  •     ముందుగా పంచాయతీలో కట్టేసిన భార్య
  •     వచ్చి చూసి వెళ్లిపోయిన పోలీసులు
  •     ఎవరూ ఏం చేయట్లేదని అర్ధరాత్రి హత్య

కోరుట్ల రూరల్, వెలుగు: అత్త మామలను గాయపర్చాడని భర్తను గ్రామ పంచాయతీ ఆఫీస్​లో కట్టేసింది. గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఫొటోలు తీసుకుని వెళ్లిపోయారు. పోలీసులు కూడా ఏం చేయలేకపోయారన్న ఆందోళనతో కట్టేసి ఉన్న భర్తను అర్ధరాత్రి హత్య చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన ఆలకుంట లక్ష్మయ్య అలియాస్ లస్మయ్య(38) మూడేండ్లుగా అత్తగారి ఊరైన తిమ్మయ్యపల్లిలో ఉంటున్నాడు. తాగిన మత్తులో శనివారం రాత్రి ఇంట్లో భార్య కళావతి అలియాస్ లక్ష్మితో గొడవపడ్డాడు. కళావతి బయటకు వెళ్లిపోవడంతో ఆమె కోసం దగ్గరలో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్లాడు. భార్య గురించి అడగగా లేదని చెప్పడంతో అత్త ఎల్లవ్వ, మామ ఎల్లయ్యపై కట్టెతో దాడి చేశాడు. దాడిలో ఎల్లవ్వ తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు ఆమెను కోరుట్ల ఆసుపత్రికి తరలించారు. పెళ్లయిన 15 ఏండ్లుగా బాధలు భరిస్తున్నప్పటీకి తల్లిని కొట్టడం మాత్రం కళావతి తట్టుకోలేకపోయింది. కోపంతో భర్త లక్ష్మయ్యను ఇంటి ముందర ఉన్న గ్రామపంచాయతీ ఆఫీస్​ప్రాంగణంలో తాళ్లతో కట్టేసింది. స్థానికులు 100 డయల్ చేయగా వచ్చిన పోలీసులు లక్ష్మయ్యను చూసి వెళ్లిపోయారు. గమనించిన కళావతి పోలీసులు కూడా ఏం చేయట్లేదని కట్టేసి ఉన్న భర్తను అర్ధరాత్రి బండరాళ్లతో కొట్టి, కత్తితో  గొంతు కోసి చంపేసింది. తెల్లవారుజామున కోరుట్ల పోలీస్ స్టేషన్ కు కత్తితో వెళ్లి లొంగిపోయింది.  మృతుడికి ఇద్దరు కూతుళ్లున్నారు. చిన్న కూతురు మతిస్థిమితం లేకుండా పుట్టింది. వయస్సులో ఉన్న పెద్ద కూతురితో గతంలో తాగిన మత్తులో లక్ష్మయ్య అసభ్యంగా ప్రవర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఉదయం రమ్మని చెప్పాం

100 నంబరుకు ఫోన్ రావడంతో కానిస్టేబుల్ రాత్రి 9 గంటలకు గ్రామానికి వెళ్లినట్లు సీఐ రాజశేఖర్​రాజు చెప్పారు. లక్ష్మయ్య మద్యం మత్తులో నడవలేని స్థితిలో ఉండడంతో ఉదయం అతడిని పోలీస్​స్టేషన్​కు తీసుకురమ్మని సర్పంచ్, గ్రామ పెద్దలకు చెప్పాడన్నారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని అన్నారు.