పుస్తెల తాడే ఉరితాడై మహిళ మృతి

పుస్తెల తాడే ఉరితాడై మహిళ మృతి

తాళిబొట్టును మహిళలు పవిత్రంగా చూసుకుంటరు. భర్తకు ప్రతిరూపంగా భావిస్తుంటరు.అయితే, పల్లెటూర్లలో కొం దరు మహిళలు పుస్తెల తాడుకు తాళంచెవులు, కాంటాల(పిన్నీసులు) వంటివి కూడా తగిలించుకుంటుంటరు. పొలాలకు పోయినప్పుడు కాళ్లకు ముండ్లు నాటితే.. తీసుకోవడానికి కాంటాలు వాడుతుంటరు. ఇక తాళం చెవులు పడిపోతాయని, పుస్తెల తాడుకు కట్టుకుంటుంటరు. అయితే, ఇలా తాళం చెవిని పుస్తెల తాడుకుకట్టు కోవడమే ఓ మహిళ పాలిట శాపంగా మారింది. ఆ పుస్తెల తాడు మెడకు బిగుసుకుని ప్రాణాలు తీసింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లడా గ్రామంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కనుకుంట్ల ఎల్లమ్మ (45)సాయంత్రం 4 గంటల సమయంలో పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చింది. పుస్తెల తాడుకు ఉన్న తాళం చెవితో తాళంతీస్తుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పికింద పడిపోయింది. అప్పటికే తాళం చెవితాళం బుర్రలో పెట్టి ఉండటంతో పసుపుతాడు అలాగే ఆమె మెడకు గట్టిగా బిగుసుకుపోయింది. కొద్దిసే పటికి చుట్టు పక్కలవారు వచ్చి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి కుమారుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు . మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం మహబూబాబాద్ ఏరియా హాస్పి టల్ కు తరలించారు. అనుకోని ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి