సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడిన మహిళ..  ఆమె కష్టాలు చూసి కొత్త ఫోన్ కొనిచ్చిన పోలీసులు

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడిన మహిళ..  ఆమె కష్టాలు చూసి కొత్త ఫోన్ కొనిచ్చిన పోలీసులు

ముంబై: కరోనా ప్రభావంతో పిల్లల చదువులు ముందుకు సాగక తల్లిదండ్రులను అనేక కష్టాలకు గురిచేస్తున్నాయి. కొడుకు ఆన్ లైన్ క్లాసుల కోసం ఓ మహిళ మూడు నెలలు కష్టపడి డబ్బులు కూడబెట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడింది. చోరీ చేసిన ఫోన్ కావడంతో చివరకు పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ సంఘటన. మహిళ కష్టాలు చూసి చలించిపోయిన పోలీసులు ఔదార్యాన్ని చాటారు. వివరాలిలా ఉన్నాయి.

ముంబై లోని బోరివ్లీ చెందిన స్వాతి సుభాష్ సావ్రే అనే మహిళ తన 8 ఏళ్ల కొడుకు ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్ కొనేందుకు చాలా కష్టాలు పడింది. పేదరికంతో పోరాడుతూ చాలా కష్టాలు పడి మూడు నెలలకు ఆరు వేలు కూడబెట్టి ఆ డబ్బుతో ఓ సెకండ్ హ్యండ్ ఫోన్ కొనింది. కొంచెం రిపేర్లు రావడంతో మరో 1500 ఖర్చు చేసింది. సిమ్ కొనుక్కుని ఫోన్ వాడడం ప్రారంభించారు. అయితే ఆ ఫోన్ చోరీకి గురైనది కావడంతో అప్పటికే పోలీసులకు కంప్లయింట్ ఉంది. వెంటనే ఆ మొబైల్ ట్రేస్ కావడం చూసి పోలీసులు స్వాతి ఇంటికి వచ్చి విచారించారు. ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి రోజంతా పోలీసు స్టేషన్లోనే ఉంచుకుని అనేక కోణాల్లో విచారించారు.

ఆ ఫోన్ ను ఆమె చోరీ చేయలేదని.. అమాయకంగా ఎవరి వద్దో కొనుగోలు చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఆమెను వదిలివేశారు. ఎంతో కష్టపడి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటే.. చివరకు పోలీసుల గడప దొక్కి ఉట్టి చేతులతో మిగలాల్సి రావడంతో తీవ్రంగా మనోవేదనకు గురైంది. ఆమె పరిస్థితిని గురించి తెలుసుకున్న ఇంటి యజమాని.. కుమారుడి ఆన్ లైన్ తరగతుల కోసం సదరు మహిళ పడిన కష్టాలను ముంబై పోలీసులకు ట్వీట్ చేసి తెలియజేశాడు.

కుమారుడి ఆన్ లైన్ క్లాసుల కోసం మహిళ ఆరాటం.. కష్టాలు గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు.  స్వాతి సావ్రేకు కొత్త ఫోన్ కొని గిఫ్ట్ గా పంపారు. మళ్లీ పోలీసులు తన ఇంటికి రావడం చూసి ఆమె కాస్త కంగారుపడినా కొత్త ఫోన్ ఇచ్చి తన కొడుకు కష్టాలు తీర్చడంతో ఆమె సంతోషంతో పోలీసులకు కృతజ్ఞలు  తెలియజేసింది.