కుక్కల నుంచి కాపాడండి.. మహిళా కౌన్సిలర్ల ఆందోళన

కుక్కల నుంచి కాపాడండి.. మహిళా కౌన్సిలర్ల ఆందోళన
  • కుక్కల నుంచి కాపాడండి
  • భువనగిరి మున్సిపల్ ​సమావేశంలో మహిళా కౌన్సిలర్ల ఆందోళన

యాదాద్రి, వెలుగు : కుక్కల దాడి నుంచి ప్రజలను కాపాడాలంటూ మహిళా కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. హెచ్ఎండీఏ నిధులను అన్ని వార్డులకు సమానంగా కేటాయించాలని కౌన్సిలర్లు డిమాండ్​ చేశారు. తర్వాత కుక్కల గురించి పలువురు కౌన్సిలర్లు చర్చ లేవనెత్తారు. కుక్కల కారణంగా కొందరు ప్రాణాపాయ  స్థితికి చేరుకున్నారని చెప్పారు.

కుక్కలు వెంటపడడంతో పారిపోతూ కిందపడి కాళ్లు విరిగిన ఘటనలు సైతం ఉన్నాయన్నారు. కుక్కల సంఖ్య పెరగకుండా ఆపరేషన్లు చేయించాలని డిమాండ్​ చేశారు. దీనిపై మున్సిపల్ ​చైర్మన్ ​ఆంజనేయులు, కమిషనర్ ​నాగిరెడ్డి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పార్టీలకు అతీతంగా మహిళా కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించారు. కుక్కల సమస్య పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టారు. మూడు నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చైర్మన్​ హామీ ఇవ్వడంతో కౌన్సిలర్లు ఆందోళన విరమించారు. 

బాధితుల ధర్నా

భువనగిరిలోని 32వ వార్డులో యాసిన్​అనే చిన్నారిని కుక్క కరిచింది. దీంతో గాయపడ్డ  చిన్నారినితో కుటుంబసభ్యులు మున్సిపాలిటీ ఆఫీసు వద్ద ఎదుట బుధవారం ధర్నా చేశారు. దీంతో కమిషనర్​ నాగిరెడ్డి అక్కడికి చేరుకొని 15 రోజుల్లో కుక్కలకు కుటుంబ నియంత్రణ సెంటర్​ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గాయపడ్డ యాసిన్​కు పరిహారం కోసం కలెక్టర్​ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.  

కుక్కల దాడిలో విద్యార్థికి గాయాలు

పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శివనగర్ కు చెందిన చెందిన మూడో తరగతి విద్యార్థి పై బుధవారం వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానిక వికలాంగుల కాలనీ ప్రభుత్వ స్కూల్​లో చదువుతున్న వహీద్ పరీక్షకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వస్తున్నాడు. అక్కడే ఉన్న వీధి కుక్కలు అతడిని వెంబడించాయి. భయపడ్డ అతడు ఉరుకుతుండగా దాడి చేసి ఎడమ చేయి, ఎడమ కాలిపై కరిచి గాయపరిచాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరమడంతో పారిపోయాయి. వహీద్​ను  స్థానిక ప్రభుత్వ హాస్పిటల్​లో చేర్పించారు.